Begin typing your search above and press return to search.

కుటుంబ ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు రావాలంటే?

నిజానికి సాధారణంగా కుటుంబ ప్రేక్షకులు వీకెండ్ హడావుడి కంటే వారపు రోజుల్లోనే ప్రశాంతంగా సినిమాలు చూడటానికి ప్రాధాన్యత ఇస్తుంటారు.

By:  Sivaji Kontham   |   24 July 2026 11:01 AM IST
కుటుంబ ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు రావాలంటే?
X

నేడు భార‌తీయ సినిమా బాక్సాఫీస్ సమీకరణాలు పూర్తిగా మారిపోయాయి. భాష ఏదైనా అన్నిచోట్లా ఒక‌టే పోక‌డ‌. శుక్ర, శని, ఆదివారాల వసూళ్లను మాత్రమే సీరియస్‌గా తీసుకుంటూ.. సోమవారం నుంచి గురువారం వరకు ఉన్న వారపు రోజులను పరిశ్రమ దాదాపు విస్మరించ‌డానికి నేటి ద‌ర్శ‌కనిర్మాత‌లే కార‌ణమ‌వుతున్నార‌నే విశ్లేష‌ణ సాగుతోంది. ఈ ఆలోచ‌న‌ల‌ ఫలితంగా థియేటర్ల ఆక్యుపెన్సీ దారుణంగా పడిపోతోంది. నిజానికి సాధారణంగా కుటుంబ ప్రేక్షకులు వీకెండ్ హడావుడి కంటే వారపు రోజుల్లోనే ప్రశాంతంగా సినిమాలు చూడటానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. 'అల వైకుంఠపురములో' (2020) వంటి చిత్రాలు ఇటీవలి కాలంలో కొన్ని వారాల పాటు కుటుంబాలను థియేటర్లకు రప్పించగలమని నిరూపించాయి. ఒకప్పుడు సురేష్ ప్రొడక్షన్స్, సూపర్ గుడ్ ఫిలింస్ వంటి అగ్ర బ్యానర్లు టాలీవుడ్, కోలీవుడ్‌లలో ఫ్యామిలీ ఆడియెన్‌నే ప్రధాన లక్ష్యంగా చేసుకుని కథలను ఎంచుకునేవి.

అయితే నేటికాలంలో పుట్టుకొచ్చిన అనేక నిర్మాణ సంస్థలు కేవలం మొదటి మూడు రోజుల ఓపెనింగ్స్, ఓవర్-సీస్ కలెక్షన్లపైనే పూర్తిగా ఆధారపడుతున్నాయనే విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొంటున్నాయి. ఈ పోకడకు స్వస్తి చెప్పి అన్ని వయసుల వారినీ, ముఖ్యంగా కుటుంబ ప్రేక్షకులను ఆహ్లాదపరిచేలా కథలను మలచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వీటితో పాటు ప్రస్తుతం ఉన్న అధిక టికెట్ ధరలు కుటుంబ సమేతంగా వచ్చే ప్రేక్షకులకు పెను భారంగా మారాయి. కాబట్టి ఫ్యామిలీ చిత్రాలకు టికెట్ రేట్లను సవరించడం లేదా వీక్ డేస్‌లో ప్రత్యేక ఆఫర్లు ఇవ్వడం ద్వారా కుటుంబాలను మళ్లీ థియేటర్ల వైపు ఆకర్షించవచ్చు. ఆర్థిక భారం తగ్గితే తప్ప కుటుంబాలు థియేటర్ మెట్లు ఎక్కే పరిస్థితి లేదు.

మరోవైపు తెరపై హద్దులు దాటుతున్న క్రూరమైన హింస, రక్తపాతం, నరమేధాలు కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు దూరం చేస్తున్నాయి. చిన్నపిల్లలతో కలిసి చూడలేని `బ్రూటల్ కిల్లింగ్` సన్నివేశాలను తగ్గించాల్సిన అత్యవసర పరిస్థితి ఏర్పడింది. ఇటీవలే పలువురు యువ దర్శకులు సైతం ఈ హింసాత్మక ట్రెండ్‌ను తగ్గించి, హృదయానికి హత్తుకునే కథలు తీయాలని అభిప్రాయపడటం శుభపరిణామం. ప్రేక్షకుల మానసిక ఉల్లాసానికి, కుటుంబ విలువలకు ప్రాధాన్యమిచ్చేలా సినిమాలు రూపుదిద్దుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.

దర్శకులలో ఇలాంటి పాజిటివ్ మైండ్‌సెట్ పెరగాలంటే పరిశ్రమలో కొన్ని ప్రాథమిక మార్పులు రావాలి. కేవలం డార్క్, వైలెంట్ క్రైమ్ యాక్షన్ చిత్రాలకే కాకుండా... మంచి కుటుంబ కథా చిత్రాలకు కూడా నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు పెద్దపీట వేయాలి. ఓపెనింగ్స్ ఆధారంగా కాకుండా సినిమా సుదీర్ఘ రన్‌ను ప్రోత్సహించే వాతావరణం ఏర్పడాలి. రచయితలు, దర్శకులు సమాజంలో మాయమవుతున్న మానవ సంబంధాలు, హాస్యం, స్వచ్ఛమైన ప్రేమను కథాంశాలుగా ఎంచుకోవడానికి నిర్మాతలు ధైర్యంగా పెట్టుబడులు పెట్టాలి. పరిశ్రమలోని పెద్దలు కూడా ఈ తరహా ఆరోగ్యకరమైన చిత్రాలకు అవార్డులు, ప్రశంసలతో తోడ్పాటు అందించాలి.

ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్‌ను థియేటర్లకు రప్పించేందుకు టాలీవుడ్ మరికొన్ని కీలక జాగ్రత్తలు తీసుకోవాలి. థియేటర్లలో స్నాక్స్, పానీయాల ధరలను అదుపులోకి తీసుకురావడం.. ఫ్యామిలీ ఫ్రెండ్లీ వాతావరణాన్ని కల్పించడం చాలా అవసరం. కంటెంట్‌లో అసభ్యత, అధిక రక్తపాతం లేకుండా 'యు' లేదా 'యుఎ' సర్టిఫికేషన్ పొందేలా ప్రణాళికలు చేసుకోవాలి. అలాగే వీక్ డేస్‌లో ఫ్యామిలీస్‌ కోసం ప్రత్యేక డిస్కౌంట్లు లేదా ప్యాకేజీలు ప్రకటిస్తే.. థియేటర్లు మళ్లీ మునుపటిలా కుటుంబాల నవ్వులతో కళకళలాడుతాయి. 'అల వైకుంఠ‌పుర‌ములో' త‌ర‌హాలో మంచి కుటుంబ క‌థా చిత్రాలు తెలుగులో మ‌రిన్ని రావాల‌ని వెంకీ అట్లూరి లాంటి ప్ర‌తిభావంతుడైన ద‌ర్శ‌కుడు కోరుకోవ‌డంతో మ‌రోసారి కుటుంబ క‌థా చిత్రాల‌పై ఫిలింస‌ర్కిల్స్ లో డిస్క‌ష‌న్ మొద‌లైంది.