మొన్న త్రిష.. నేడు నయనతార.. హీరోయిన్స్ ఇళ్లకు బాంబు బెదిరింపులు!
గత కొన్ని రోజుల క్రితం హీరో విజయ్ దళపతి ఇంటిపై బాంబు బెదిరింపులు రాగా.. ఇటీవల ప్రముఖ హీరోయిన్ త్రిష కృష్ణన్ ఇంటిపై కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి
By: Madhu Reddy | 8 Oct 2025 5:54 PM ISTసినీ సెలబ్రిటీలకు బాంబు బెదిరింపులు అత్యంత సంచలనంగా మారింది. గత కొన్ని రోజుల క్రితం హీరో విజయ్ దళపతి ఇంటిపై బాంబు బెదిరింపులు రాగా.. ఇటీవల ప్రముఖ హీరోయిన్ త్రిష కృష్ణన్ ఇంటిపై కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. ఇప్పుడు నయనతార ఇంటికి కూడా బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలుస్తోంది. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం..
తాజాగా నయనతార నివాసంలో పేలుడు పరికరం ఉందని హెచ్చరిస్తూ.. చెన్నైలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కార్యాలయానికి ఒక ఈమెయిల్ వెళ్లిందట. దీంతో అప్రమత్తమైన తేనాంపేట్ పోలీసులు వెంటనే చర్యలు తీసుకొని.. నయనతార నివాసంలో సమగ్ర తనిఖీ నిర్వహించారు. అయితే వారి పరిశోధనలో అక్కడ ఎటువంటి పేలుడు పరికరాలు లభించలేదని, ఇది కేవలం ఫేక్ బెదిరింపు అంటూ పోలీసులు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. చెన్నైలోని వీనస్ కాలనీలో నయనతార ఇంటికి తాళం వేసింది. కారణం ప్రస్తుతం ఆమె షూటింగ్ నిమిత్తం తమిళనాడు వెలుపలే ఉన్నారు. ప్రస్తుతం ఆమె నివాసంలో కేవలం భద్రత సిబ్బంది మాత్రమే ఉంటున్నారు. వీనస్ కాలనీలోని నయనతార ఇల్లు 7, 000 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఒక విలాసవంతమైన బంగ్లా.. ఇది స్టూడియోగా కూడా ఉపయోగపడుతుంది. వివాహం అనంతరం ఈ ఇంటిని అత్యంత సుందరంగా నిర్మించుకుంది నయనతార. ఇప్పుడు ఆ ఇంటికి బెదిరింపు కాల్స్ రావడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేయగా.. ఇది నకిలీ బెదిరింపులు అంటూ పోలీసులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ విషయం తెలిసి అటు నయనతార.. విఘ్నేష్ శివన్ తో పాటు ఇటు అభిమానులు కూడాఊపిరి పీల్చుకుంటున్నారు.
ఇకపోతే గత వారం రోజులుగా కనీసం 10 ప్రదేశాలను పేర్కొంటూ దుండగులు పంపిన బాంబు బెదిరింపులు, చెన్నై పోలీసులను ఒక్కసారిగా గందరగోళానికి గురిచేసాయి. విజయ్, త్రిష , శేఖర్ నివాసాలతో పాటు సీఎం స్టాలిన్ నివాసం అలాగే గవర్నర్ నివాసం పై కూడా ఇలా నకిలీ బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో అలర్ట్ అయిన అధికారులు బాంబు డిటెక్షన్ అండ్ డిస్పోజల్ స్క్వాడ్ బృందాలు వెంటనే విస్తృత తనిఖీల కోసం రంగంలోకి దిగగా.. అక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు లభించలేదు.
నయనతార విషయానికి వస్తే.. ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్ లతో బిజీగా ఉన్న నయనతార.. మెగాస్టార్ చిరంజీవితో కలిసి 'మన శంకర్ వరప్రసాద్ గారు' సినిమా షూటింగ్లో బిజీగా ఉంది. అలాగే 'మూకుత్తి అమ్మన్ 2' సినిమా షూటింగ్లో కూడా బిజీగా ఉంది. ఈ సినిమాకి సుందర్ సీ దర్శకత్వం వహిస్తూ ఉండగా.. సుమారుగా వందకోట్ల బడ్జెట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా యష్ హీరోగా నటిస్తున్న టాక్సిక్ లో కూడా ఆయనకు సోదరిగా నటిస్తోంది. అంతేకాదు మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహద్ ఫాజిల్ కాంబినేషన్ లో వస్తున్న మలయాళ చిత్రం పేట్రియాట్ లో కూడా నయనతార నటిస్తున్నారు. ఇలా వరుస సినిమాల షెడ్యూల్ బిజీ కారణంగా ఆమె ఇంటి వెలుపలే ఉన్నారు. ఇలాంటి సమయంలోనే నయనతార ఇంటికి బాంబు బెదిరింపులు రావడం వైరల్ గా మారుతోంది. ఏది ఏమైనా మొన్న త్రిష.. నేడు నయనతార ఇలా హీరోయిన్స్ ను టార్గెట్ చేస్తూ బాంబు బెదిరింపు కాల్స్ రావడం పలు అనుమానాలకు తెరలేపింది.
