నందమూరి బ్రాండ్ గట్టిగా వాడుతున్న కార్తికేయ
బాబాయ్ డైలాగ్‌తో మొదలై అబ్బాయ్ ఎంట్రీతో ముగియడం వెనుక రాజమౌళి కాంపౌండ్ పక్కా ప్లానింగ్ కనిపిస్తోంది.
By: M Prashanth | 29 Sept 2026 5:11 PM ISTమలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ తెలుగులో ఇప్పటివరకు కనిపించిన పాత్రలు వేరు, ఇప్పుడు వస్తున్న సినిమా వేరు. ‘పుష్ప’లో భన్వర్ సింగ్ షెకావత్‌గా విలనిజం పండించిన ఫహాద్, తొలిసారిగా ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ అంటూ తెలుగులో సోలో హీరోగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. అక్టోబర్ 2న థియేటర్లలోకి దిగుతున్న ఈ సినిమాకి అనుకున్నంత బజ్ రావట్లేదా అన్న అనుమానాలు మొదలైన టైమ్‌లో, నిర్మాత ఎస్.ఎస్. కార్తికేయ వేసిన ఒకే ఒక్క ఎత్తుగడతో మొత్తం సీన్ రివర్స్ అయిపోయింది.
ఈ సినిమాకి నందమూరి బ్రాండ్‌ను జోడించిన తీరే ఇక్కడ అసలైన ట్విస్ట్. టైటిల్‌లోనే బాలకృష్ణ ఐకానిక్ డైలాగ్ ఉండగా, ఏకంగా బాలయ్యతోనే తెలుగు ట్రైలర్‌కి వాయిస్ ఓవర్ చెప్పించి సినిమాపై తొలి బజ్‌ను క్రియేట్ చేశారు. కట్ చేస్తే, సరిగ్గా రిలీజ్‌కు రెండు రోజుల ముందు హైదరాబాద్ లో జరుగుతున్న ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి గెస్ట్‌గా జూనియర్ ఎన్టీఆర్‌ను తీసుకు రానున్నారు.
బాబాయ్ డైలాగ్‌తో మొదలై అబ్బాయ్ ఎంట్రీతో ముగియడం వెనుక రాజమౌళి కాంపౌండ్ పక్కా ప్లానింగ్ కనిపిస్తోంది. సినిమా కాన్సెప్ట్ చూస్తే.. సూరి అనే ఒక చిల్లర మేజీషియన్, ఒక జీనీ బాలిక చుట్టూ తిరిగే సోషియో ఫాంటసీగా తెరకెక్కింది. శశాంక్ యేలేటి దర్శకత్వం. ఫహాద్ లాంటి సీరియస్ యాక్టర్‌ను ఫ్యామిలీ, కిడ్స్ ఆడియన్స్‌ను టార్గెట్ చేసే ఫన్ రోల్‌లో చూపించడం కాస్త కొత్త ప్రయత్నమే.
ఎమోషన్స్, మ్యాజిక్ వర్కవుట్ అయితే ఓకే కానీ, తెలుగు ఆడియన్స్ ఫహాద్‌ను ఇలాంటి లైటర్ వీన్ క్యారెక్టర్‌లో ఎంతవరకు ఓన్ చేసుకుంటారనే దానిపైనే సినిమా రిజల్ట్ ఆధారపడి ఉంది. అయితే ఇక్కడ మేకర్స్‌కి అతిపెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే, తెరవెనుక ఉన్న బలమైన ప్రొడక్షన్ ఫోర్స్. శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేనిలతో కలిసి కార్తికేయ స్వయంగా నిర్మించగా, స్వయంగా ఎస్.ఎస్. రాజమౌళి సమర్పిస్తుండటం ట్రేడ్ వర్గాల్లో పాజిటివ్ వైబ్ తెచ్చింది.
బాహుబలి నిర్మాతల సినిమా అంటే మినిమం క్వాలిటీ ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో ఎలాగూ ఉంది. దానికి తోడు కాలభైరవ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకి మెయిన్ పిల్లర్‌గా నిలవనుందని టాక్. ఇప్పుడు అందరి కళ్లూ తారక్ ఈవెంట్ మీదే పడ్డాయి. రాజమౌళి ఫ్యామిలీతో ఉన్న సాన్నిహిత్యం, పైగా ఫహాద్ లాంటి బ్రిలియంట్ యాక్టర్ తెలుగు సినిమా చేస్తుండటంతో ఎన్టీఆర్ ఈ వేదికపై ఇచ్చే స్పీచ్ చివరి నిమిషంలో ఓపెనింగ్స్‌ను భారీగా ప్రభావితం చేసే అవకాశం ఉంది.
కార్తికేయ షేర్ చేసిన ఫోటోలో తారక్, ఫహాద్, కార్తికేయ కలిసి నవ్వుతూ ఇచ్చిన స్టిల్స్ సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్ అయిపోయాయి. కంటెంట్ బలంగా ఉన్నప్పటికీ లోకల్ మార్కెట్‌లో హైప్ సరిపోదనుకున్న ప్రొడ్యూసర్లు, ఎన్టీఆర్‌ను రంగంలోకి దింపి సినిమాను సరిగ్గా సేఫ్ జోన్‌లోకి నెట్టే ప్రయత్నం చేశారు. బాలయ్య వాయిస్ ఓవర్, తారక్ లైవ్ ఎంట్రీ బాక్సాఫీస్ రన్‌ను ఎంతవరకు పరుగులు పెట్టిస్తుందో చూడాలి.
