పాపం ఫాఫా భాష మారినా ఫలితం మారలేదు!
మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాసిల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నటుడిగా తానేంటో గత దశాబ్ద కాలంగా నిరూపించుకుంటూ వస్తున్నాడు.
By: Ramesh Palla | 5 Oct 2026 10:37 AM ISTమలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాసిల్ గురించి ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. నటుడిగా తానేంటో గత దశాబ్ద కాలంగా నిరూపించుకుంటూ వస్తున్నాడు. మలయాళ నటుడు అయినప్పటికీ మొత్తం ఇండియా వ్యాప్తంగా ఫాఫా అభిమానులను సొంతం చేసుకున్నాడు. ముఖ్యంగా సౌత్ ఇండియాలో ఆయన నటనకు ఫిదా అయిన వారు ఎంతో మంది ఉన్నారు. చూడటానికి ఒక మామూలు వ్యక్తిగా కనిపించినా నటుడిగా మాత్రం శిఖరం అంటూ ఆయన్ను అభిమానులు, సినీ విశ్లేషకులు పిలుస్తూ ఉంటారు. అలాంటి ఫాహద్ ఫాసిల్ గత కొంత కాలంగా వరుస ఫ్లాప్స్ చవిచూస్తున్నాడు. నటుడిగా ఆయనకు మచ్చ పెట్టడానికి లేదు, ఆయన్ను విమర్శించడానికి లేదు, కానీ ఒక నటుడిగా ఎంపిక చేసుకుంటున్న పాత్రలు, కథల విషయంలోనే అసలు సమస్య అంతా. గత కొన్నాళ్లుగా ఫాహద్ ఫాసిల్ ఎంపిక చేసుకుంటున్న కథలు ప్రేక్షకులను అలరించడంలో విఫలం అవుతున్నాయి.
మలయాళంలో వరుస సినిమాలతో...
మలయాళంలో గత ఐదేళ్లుగా వరుస సినిమాలు చేస్తున్నప్పటికీ ఒక్క హిట్ కూడా ఫాఫా దక్కించుకోలేక పోయాడు. దాదాపు మెయిన్ లీడ్ గా ఫాఫా దాదాపు ఏడు సినిమాలు గత ఐదేళ్ల కాలంలో విడుదల అయ్యాయి. కానీ ఏ ఒక్కటి బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకోలేదు. కనీసం యావరేజ్‌గానూ ఫాఫా సినిమాలు నిలువలేదు. దాంతో మలయాళ ఇండస్ట్రీలో ఇతడి క్రేజ్ తగ్గిందని, ఆఫర్లు మునుపటి మాదిరిగా రావడం లేదు అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మలయాళంలో ఆఫర్లు తగ్గాయా లేదంటే తెలుగులో సినిమా చేయాలి అనుకున్నాడో కానీ ఇటీవల టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ సినిమాతో వచ్చాడు. అక్టోబర్ 2న భారీ అంచనాల నడుమ విడుదలైన ఆ సినిమా తీవ్రంగా నిరాశ పరిచింది. ఈ సినిమాకా ఇంత హడావిడి చేసింది అంటూ ప్రేక్షకులు పెదవి విరుస్తున్నారు.
రాజమౌళి అండ్ టీం...
రాజమౌళి అండ్ టీం వెనుక ఉన్నారనే ఉద్దేశంతో ఈ సినిమాకు ఫాఫా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి ఉంటాడు. కానీ స్టోరీ లైన్ ఆసక్తికరంగా ఉన్నప్పటికీ స్క్రీన్ ప్లే పూర్తిగా ఫెయిల్ అయింది. రాజమౌళి, కార్తికేయ కేవలం ఐడియా విని సినిమాను ప్రమోట్ చేసేందుకు ముందుకు వచ్చి ఉంటారని అర్థం అయింది. అయితే ఫాహద్ ఫాసిల్ మాత్రం మొత్తం కథ విని ఉంటాడు, కథ ఎలా నడుస్తుంది అనే విషయాన్ని తెలుసుకుని ఉంటాడు. అయినా ఎలా ఈ సినిమాకు ఓకే చెప్పాడు అంటూ చాలా మంది ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మలయాళంలో వరుసగా ఏడు సినిమాలు ఫెయిల్ కావడంతో తెలుగులో ఒక సినిమాను చేసి హిట్ కొట్టాలనే ఉద్దేశంతో కథ విషయమై పట్టింపు లేకుండా కమిట్ అయ్యి ఉంటాడేమో అని కొందరు ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి ఫాఫా పాపం చాలా పెద్ద ఫ్లాప్ ను ఈ సినిమాతో చవిచూడాల్సి వచ్చింది.
ఫాహద్ ఫాసిల్ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్...
మలయాళంలో వస్తున్న ఫ్లాప్స్ ను తప్పించుకుని, హిట్ కొట్టి మళ్లీ గాడిలో పడాలి అనుకున్న ఫాఫా తెలుగు సినిమాకు కమిట్ అయ్యి ఉంటాడు. భాష మారినా పాపం ఫలితం మాత్రం అదే రిపీట్ అయింది. బాక్సాఫీస్ వద్ద సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని విడుదలకు ముందు అంతా అనుకున్నారు. ఫాఫా సైతం తెలుగు రాష్ట్రాల్లో కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ ప్రమోట్ చేశాడు. ఎన్నో షో లకు వెళ్లాడు, పలు ఇంటర్వ్యూలు ఇచ్చాడు, ఎన్నో ప్రెస్ మీట్స్ కు హాజరు అయ్యాడు. కానీ ఏ ఒక్కటి సినిమా ఫలితంను ఇవ్వలేదు. మెయిన్‌గా స్క్రీన్ ప్లే చెత్తగా ఉంటే ఎంత మంది పబ్లిసిటీ చేస్తే ఏం ప్రయోజనం, ఎన్ని విధాలుగా ప్రమోట్ చేస్తే ఏం లాభం అంటూ ఇప్పుడు విశ్లేషకులు విమర్శలు చేస్తున్నారు. సినిమా కోసం చాలా మంది తమ మంచి మనసును చాటుకుని ముందుకు వచ్చారు. అదంతా కూడా బూడిదలో పోసిన పన్నీరు అయింది. ఈ సినిమా ఫ్లాప్ తో ఫాఫా మళ్లీ హిట్ కోసం వెయిట్ చేయాల్సిందే.
