ఇంటెన్షనల్‌గా ఇబ్బంది పెడుతున్నారా? పరిష్కారం లేని ఎగ్జిబిటర్ల పట్టుదల!
ఈ చర్చలో భాగంగా స్పెషల్ షోల ఖర్చులపై ఎగ్జిబిటర్లు చేసిన వ్యాఖ్యలకు నాగవంశీ సెటైరికల్‌గా కౌంటర్ ఇచ్చారు.
By: Sivaji Kontham | 14 May 2026 9:58 AM ISTతెలంగాణ ఫిల్మ్ ఛాంబర్‌లో ఎగ్జిబిటర్లు- నిర్మాతల మధ్య నెలకొన్న వివాదం పరిష్కారం దిశగా సాగడం కంటే.. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకునే స్థాయికి చేరుకుంది. ముఖ్యంగా `పెద్ది` వంటి భారీ చిత్రాలు విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ఎగ్జిబిటర్లు పర్సంటేజీ షేరింగ్ విధానంపై పట్టుబట్టడంపై నిర్మాతలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది సమస్యను పరిష్కరించడానికి చేస్తున్న ప్రయత్నంలా లేదని.. ఉద్దేశపూర్వకంగా నిర్మాతలను ఇబ్బంది పెట్టడమేనని మైత్రి మూవీ మేకర్స్ అధినేత రవిశంకర్ .. నిర్మాత నాగవంశీ ధ్వజమెత్తారు.
మైత్రి రవిశంకర్ ఈ వివాదంపై స్పందిస్తూ... ఎగ్జిబిటర్ల తీరు `నీ సినిమాలో నాకు షేర్ కావాలి` అని బలవంతంగా అడుగుతున్నట్లు ఉందని మండిపడ్డారు. ఏడాదికి విడుదలయ్యే 150 సినిమాల విషయంలో పర్సంటేజీ విధానం సజావుగానే సాగుతోందని... కానీ రాబోయే ఆరేడు పెద్ద సినిమాల నుండే అదనపు లాభాలు ఆశించడం అన్యాయమని ఆయన పేర్కొన్నారు. పెద్ది, ఫౌజీ వంటి భారీ చిత్రాలు క్యూలో ఉన్నప్పుడు కావాలనే ఇబ్బందులు సృష్టించడం చూస్తుంటే.. వీరికి సమస్యను పరిష్కరించాలనే ఆలోచన లేదని.. కేవలం నిర్మాతలను ఒత్తిడికి గురిచేయాలనే ఉద్దేశం కనిపిస్తోందని ఆయన ఆరోపించారు.
నిర్మాత నాగవంశీ కూడా ఎగ్జిబిటర్ల వైఖరిని తీవ్రంగా తప్పుబట్టారు. `పెద్ది' వంటి సినిమాలు థియేటర్లకు ప్రేక్షకులను రప్పిస్తాయని ఆశించే సమయంలో ఇండస్ట్రీకి ఇలాంటి థియేటర్ ఇష్యూ అవసరమా అని ఆయన ప్రశ్నించారు. మొదటి వారం గురించి కాకుండా.. రెండో వారం జనం రాకపోతే వచ్చే నష్టాలను సర్దుబాటు చేయాలని ఎగ్జిబిటర్లు కోరుతున్నారని అన్నారు. నిర్మాతలను, పంపిణీదారులను ఇబ్బంది పెడుతూ ఎవరిని బాగు చేయడానికి ఈ పర్సంటేజీ విధానం తీసుకువస్తున్నారని ఆయన నిలదీశారు.
ఈ చర్చలో భాగంగా స్పెషల్ షోల ఖర్చులపై ఎగ్జిబిటర్లు చేసిన వ్యాఖ్యలకు నాగవంశీ సెటైరికల్‌గా కౌంటర్ ఇచ్చారు. పది వేల రూపాయలకే స్పెషల్ షోలు వేస్తున్నారన్న వాదనపై స్పందిస్తూ.. పాపం ఆ ఎగ్జిబిటర్ గారికి తెలియదేమో.. పది వేలకి ఏ రోజూ ఎక్కడా స్పెషల్ షోలు వేయనివ్వలేదు అని ఎద్దేవా చేశారు. ఒక థియేటర్ సెంటిమెంట్ కోసం లక్ష రూపాయల రెంట్ కట్టి... 25 శాతం టికెట్లు ఉచితంగా ఇచ్చి... పోలీస్ పర్మిషన్ల కోసం ఖర్చు చేసి షోలు వేసిన రోజులు తమకు తెలుసని ఆయన గుర్తు చేశారు. థియేటర్లకు కట్టే రెంట్లలో అసలు ఓనర్లకు ఎంత వెళ్తుందో కనిపెట్టడం సిబిఐ కి కూడా సాధ్యం కాదని వ్యాఖ్యానించారు.
మొత్తానికి ఎగ్జిబిటర్లు- నిర్మాతల మధ్య జరుగుతున్న ఈ పోరు టాలీవుడ్ భవిష్యత్తును సంకటంలో పడేసేలా ఉందన్న చర్చ సాగుతోంది. మమ్మల్ని మేము చంపుకొని ఎవరిని బాగు చేయడానికి ఈ పర్సంటేజీ? అన్న నాగవంశీ ప్రశ్న పరిశ్రమలోని ఆందోళనను ప్రతిబింబిస్తోంది. ఇరు వర్గాలు మొండి పట్టు వీడి.. ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటేనే `పెద్ది` వంటి పెద్ద సినిమాలకు .. పంపిణీ వ్యవస్థకు మేలు జరుగుతుందని నిర్మాతలు స్పష్టం చేస్తున్నారు. పట్టు విడుపు ఉండాలని కూచుని మాట్లాడుకుందామని పెద్ది సమర్పకుడు మైత్రి రవిశంకర్ పిలుపునిచ్చారు.
