Begin typing your search above and press return to search.

విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్

విజయశాంతి నుంచి సమంత వరకు తెలుగు తెరపై పలువురు హీరోయిన్లు యాక్షన్ పాత్రలతో మెప్పించారు. మాలాశ్రీ, వాణీ విశ్వనాథ్, అనుష్క, చార్మీ, తమన్నా, తాప్సీ కూడా ఫైట్స్‌తో ఆకట్టుకున్నారు. ఇప్పుడు రష్మిక మందన్న ‘మైసా’ చిత్రంతో యాక్షన్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకునేందుకు సిద్ధమవుతోంది.

By:  Sivaji Kontham   |   20 Nov 2026 11:05 PM IST
విజయశాంతి - సమంత మ‌ధ్య‌లో టాప్-10 యాక్ష‌న్ క్వీన్స్
X

తెలుగు సినిమా చరిత్రలో యాక్షన్ అంటే కేవ‌లం హీరోల‌కు మాత్ర‌మే అనుకునే ప‌రిస్థితి ఉండేది. కానీ లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కర్తవ్యం, ఒసేయ్ రాములమ్మ వంటి చిత్రాలతో ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేసి స్టార్ హీరోలకు దీటుగా బాక్సాఫీస్ వద్ద యాక్ష‌న్ క్వీన్ గా సత్తా చాటారు. ప్రస్తుత తరంలో సమంత `ది ఫ్యామిలీ మ్యాన్ 2`, `యశోద`, `సిటాడెల్`, `మా ఇంటి బంగారం` వంటి ప్రాజెక్టులతో యాక్షన్ క్వీన్‌గా మరో స్థాయికి చేరుకున్నారు. అయితే విజయశాంతికి, సమంతకు మధ్య ఉన్న సుదీర్ఘ విరామంలో వేరే ఎవ‌రూ హీరోయిన్‌లు యాక్ష‌న్ సినిమాల‌తో మెప్పించ‌లేదా? అంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.

90ల చివ‌రిలో 2000 ప్రారంభంలో లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ ఇమేజ్‌ను అందుకున్న‌ వారిలో మాలాశ్రీ ముందు వరుసలో నిలుస్తారు. పోలీస్ ఆఫీసర్ పాత్రల్లో.. రౌడీలను చితకబాదే సన్నివేశాల్లో మాలాశ్రీ చేసిన ఫైట్స్ అప్పట్లో మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరోవైపు వాణీ విశ్వనాథ్ సైతం పవర్‌ఫుల్ పోలీస్.. యాక్షన్ పాత్రల్లో బెరుకు లేకుండా హైవోల్టేజ్ ఫైట్లు చేసినా విజయశాంతి స్థాయిలో శాశ్వత ముద్ర వేయలేకపోయారు. ఇక రోజా గ్లామర్ పాత్రలతో పాటు పలు గ్రామీణ నేపథ్య చిత్రాల్లో కర్రసాము, ఫైటింగ్ సన్నివేశాలతో పార్ట్ టైమ్ యాక్షన్ మెరుపులు మెరిపించారు.

ఆ తర్వాత కాలంలో విజయశాంతి స్థాయిలో లేడీ ఓరియెంటెడ్ యాక్షన్ చిత్రాలకు తిరుగులేని క్రేజ్ తీసుకొచ్చిన ఘనత అనుష్క శెట్టికి దక్కుతుంది. అరుంధతి, రుద్రమదేవి, బాహుబలి చిత్రాల్లో స్వీటీ కత్తి యుద్ధాలు, గుర్రపు స్వారీలు, డూప్ లేని భారీ స్టంట్స్ తెలుగు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. అనుష్కతో పాటు 2000 దశకంలో చార్మీ కౌర్ సైతం మంత్ర, మంగళ, జ్యోతిలక్ష్మి వంటి హార్ష్ రియాలిటీ చిత్రాల్లో తన బాడీ లాంగ్వేజ్, యాక్షన్ సన్నివేశాలతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచారు.

కమర్షియల్ లేదా కంటెంట్ ఆధారిత చిత్రాల మధ్య సమతూకం పాటిస్తూ యాక్షన్ ప్రయత్నాలు చేసిన హీరోయిన్లలో తమన్నా, తాప్సీ పన్ను ప్రత్యేకంగా నిలుస్తారు. `బాహుబలి: ది బిగినింగ్` సినిమాలో అవంతిక పాత్ర కోసం తమన్నా కత్తి యుద్ధాల్లో ప్రత్యేక శిక్షణ తీసుకుని అద్భుతమైన స్టంట్స్ చేశారు. అలాగే తాప్సీ పన్ను బాలీవుడ్‌లో బేబీ, నామ్ షబానా వంటి పూర్తిస్థాయి యాక్షన్ సినిమాలు చేయకముందే తెలుగులో `సాహసం` చిత్రంలో సాహసోపేతమైన స్టంట్స్‌తో ఆకట్టుకున్నారు.

ఇక నేటి తరం నటీమణుల్లో రెజీనా కసాండ్రా `ఎవరు` వంటి థ్రిల్లర్ చిత్రాలతో పాటు పలు ప్రాజెక్టుల్లో ఫిజికల్ గా రిస్కు తీసుకునే స్టంట్స్, యాక్షన్ సన్నివేశాల్లో తన ప్రతిభను చాటుకున్నారు. ఇలా విజయశాంతి సృష్టించిన ఒరవడిని కొనసాగిస్తూ.. సమంత వంటి కొత్త తరం యాక్షన్ స్టార్ దూసుకుపోతుంటే.. ఇదే బాట‌లో ఇప్పుడు ర‌ష్మిక మంద‌న్న కూడా యాక్ష‌న్ ఇమేజ్ కోసం ప్ర‌య‌త్నించ‌డం హాట్ టాపిగ్గా మారింది. త్వ‌ర‌లో విడుద‌ల‌కు రానున్న `మైసా` చిత్రంలో ర‌ష్మిక స్టంట్స్ తో అద‌ర‌గొట్ట‌బోతోంది.