వైవాహిక బంధంలో చేదు అనుభవాలు!
పరిశ్రమలో నటిగా బిజీగా ఉంటూనే బిడ్డకు తల్లిగా, తండ్రిగా అన్ని బాధ్యతలను తానొక్కరినే మోయడం ఎంతో ఒత్తిడితో కూడుకున్న విషయమన్నారు.
By: Srikanth Kontham | 10 Jun 2026 6:00 PM ISTప్రముఖ టెలివిజన్- సినీ నటి ఇవా గ్రోవర్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అత్యంత బాధాకరమైన విషయాలను ఇటీవల ఓ టాక్ షోలో పంచుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో హైదర్ అలీ ఖాన్‌తో ఆమెకు జరిగిన వివాహం, ఆ తర్వాత ఎదుర్కొన్న ఒడిదుడుకుల గురించి ఇవా తొలిసారి బహిరంగంగా మాట్లాడారు. వైవాహిక జీవితంలో తాము అనుభవించిన కష్టాలు, మానసిక సంఘర్షణ ఒకానొక దశలో తనను ఎంతగానో కుంగదీశాయని ఆవేదన వ్యక్తం చేశారు. తన వివాహ బంధాన్ని నిలబెట్టుకోవడానికి తాను చేయని ప్రయత్నమంటూ లేదన్నారు.
దెబ్బతిన్న వైవాహిక బంధాన్ని కేవలం ఒక బిడ్డను కనడం ద్వారా సరిదిద్దలేమన్నారు. బంధంలో మూల స్థంభాలైన నమ్మకం, గౌరవం లేనప్పుడు పిల్లలు పుట్టినా ఆ బంధం నిలబడదని పైగా ఆ ప్రభావం పిల్లల మానసిక స్థితిపై కూడా పడుతుందని తన సొంత జీవిత అనుభవాన్ని ఉదాహరణగా చెప్పకొచ్చారు. హైదర్ అలీ ఖాన్‌తో ఉన్న బంధంలో పరస్పర అవగాహన లోపించడం, నిరంతర విభేదాల కారణంగా ఇద్దరి మధ్య దూరం పెరిగిందని ఇవా తెలిపారు.
కేవలం సమాజం కోసం.. కుటుంబ గౌరవం కోసం అసంతృప్తికరమైన బంధంలో కలిసి ఉండటం కంటే ఆ బంధం నుండి గౌరవప్రదంగా బయటకు రావడమే మంచిదన్నారు. ఆ నిర్ణయం తీసుకోవడం అంత సులువు కాకపోయినా? తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి , ప్రశాంతమైన జీవితాన్ని గడపడానికి ఆ మార్గాన్ని ఎంచుకోవాల్సి వచ్చిందని తెలిపారు. ఒంటరి తల్లిగా తన బిడ్డను పెంచడంలో ఎదురైన సవాళ్లను కూడా ఇవా ఈ సందర్భంగా ప్రస్తావించారు.
పరిశ్రమలో నటిగా బిజీగా ఉంటూనే బిడ్డకు తల్లిగా, తండ్రిగా అన్ని బాధ్యతలను తానొక్కరినే మోయడం ఎంతో ఒత్తిడితో కూడుకున్న విషయమన్నారు. ఆర్థికంగా, సామాజికంగా ఎన్నో అడ్డంకులు ఎదురైనప్పటికీ తన కూతురి భవిష్యత్తు కోసం ఎక్కడా రాజీ పడకుండా ముందడుగు వేశానని గర్వంగా చెప్పుకొచ్చారు. చిత్ర పరిశ్రమలో ఉన్న గ్లామర్ వెనుక నటీనటుల వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో అంధకార కోణాలు ఉంటాయనేది ఈ ఘటన ద్వారా మరోసారి తేటతెల్లమైంది.
ఇవా గ్రోవర్ చేసిన ఈ వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో ..పరిశ్రమ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. కష్ట కాలంలో తనకు కుటుంబ సభ్యులు .. కొద్దిమంది అత్యంత ఆప్తమిత్రులు అందించిన మద్దతును కృతజ్ఞతతో గుర్తుచేసుకున్నారు. ఆ మద్దతు వల్లే తాను మళ్లీ కెరీర్‌పై దృష్టి పెట్టగలిగానని చెప్పుకొచ్చారు. గతాన్ని మర్చిపోయి ప్రస్తుతం వృత్తిపరమైన జీవితంలో ప్రశాంతతను వెతుక్కుంటున్నట్లు ఇవా తెలిపారు. ఎన్నో సూపర్ హిట్ టీవీ సీరియల్స్ - సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో మెప్పించిన ఇవా రాబోయే రోజుల్లో మరిన్ని మంచి ప్రాజెక్ట్‌లతో ప్రేక్షకుల ముందుకు రావాలని ఆశిస్తున్నారు. జీవితంలో ఎదురయ్యే ఎలాంటి కష్టాలనైనా ధైర్యంతో ఎదుర్కొని నిలబడాలనే సందేశాన్ని తన జీవితం ద్వారా తోటి మహిళలకు అందించాలని ఆకాంక్షించారు.
