'యుఫోరియా'లోని ఆ సీన్ అత్యంత దారుణం..!
శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాపై మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. నేటి యువత వింత పోకడలను, వారి మానసిక స్థితికి అద్దంపడుతూ రూపొందించిన సినిమా ఇది.
By: Tupaki Entertainment Desk | 7 Feb 2026 6:00 PM ISTసినిమాల్లో ఏది ఎంత వరకు చూపించాలి.. ఏది చూపించాలి?..ఎలాంటి హద్దుల్ని పాటించాలి.. హింసాత్మక సీన్‌లు ఎంత వరకు చూపించాలి వంటి రిస్ట్రెక్షన్స్ ఉండేవి..వాటిని ప్రేక్షకులు కూడా పాటించేవారు. కానీ ఇప్పుడు తరం మారింది..పద్దతులూ మారిపోతున్నాయి. ఏది చూపించకూడదో దాన్నే ఇప్పుడు ప్రధానంగా వెండితెరలపై చూపించే సంస్కృతి మొదలైంది. ఇలాంటివి చూడటానికి ప్రేక్షకులు కూడా ఇష్టపడుతుండటంతో దర్శకులు అలాంటి వాటిపైనే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు.
ఏవీ చూడకూడదో వాటినే చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు `యుఫోరియా` మూవీ విషయంలో మాత్రం ఆ హద్దులు మరింతగా చెరిపేసినట్టుగా తెలుస్తోంది. అదే ఇప్పుడు సినిమా చూసిన వారందరినీ అత్యంత దారుణమైన ఫీల్‌ని కలిగించి షాక్‌కు గురి చేస్తోంది. వివరాల్లోకి వెళితే...వెండితెరపై భారీ సెట్‌ల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న గుణశేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి తన పంథాకు పూర్తి భిన్నంగా తెరకెక్కించిన మూవీ `యుఫోరియా`. భూమిక, సారా అర్జున్, విఘ్నేష్ గవిరెడ్డి ప్రధాన పాత్రల్లో నటించారు. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పబ్‌లో జరిగిన ఓ యదార్థ సంఘటన ఆధారంగా దీన్నిరూపొందించారు.
శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమాపై మిక్స్డ్ టాక్ వినిపిస్తోంది. నేటి యువత వింత పోకడలను, వారి మానసిక స్థితికి అద్దంపడుతూ రూపొందించిన సినిమా ఇది. జూబ్లీహిల్స్ పబ్‌లో ఓ యువతి అత్యాచారానికి గురి కావడం..దీని వెనుక ప్రముఖుల కుమారులు ఉండటం అప్పట్లో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇదే అంశానికి మరిన్ని యదార్థ సంఘటనలని జోడీంచి పక్కా క్రైమ్ థ్రిల్లర్ స్టోరీగా `యుఫోరియా`ను దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించారు.
సినిమాలోని చాలా వరకు సన్నివేశాలు యూత్‌తో పాటు తల్లదండ్రులకు కనువిప్పు కలిగించే విధంగా ఉన్నాయి. సభ్య సమాజంలో నేటి యువత వింత పోకడలు పోతే ఒళ్లు మరిచి చేస్తున్న అకృత్యాలు మానవాళి మనుగడనే ప్రశ్నిస్తున్నాయి. సినిమాలో తల్లీ కొడుకుల మధ్య ఉన్న సంఘర్షణని ప్రధానంగా చూపించారు. ఇందులో హద్దులు దాటి ప్రవర్తించే తనయుడికి తల్లిగా భూమిక నటించింది. ఓ సన్నివేశం సభ్య సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తోంది.
డ్రగ్స్ సేవించిన మత్తులో ఉన్న యువకుడు, ఆ మత్తులో భూమిక తన తల్లి అని తెలిసినా తనకు లిప్ లాక్ ఇవ్వడానికి ప్రయత్నించడం ఒళ్లు గగుర్పాటుకు గురయ్యేలా ఉంది. సినిమాలో ఇది అత్యంత హేయకరమైన, అత్యంత దారుణమైన సన్నివేశం. సినిమా ద్వితీయార్థంలో వచ్చే ఈ సీన్ ప్రేక్షకుల్నితీవ్ర దిగ్భ్రాంతికి గురి చేస్తోంది. పైశాచికత్వం పెరిగిపోయిన నేటి సమాజంలో ఇలాంటి సంఘటనలు నిజజీవితంలో జరుగుతున్నాయని వింటున్నా కానీ తెరపై చూడటం అంటే ప్రేక్షకులు జీర్ణించుకోలేక పోతున్నారు.
