సీక్రెట్ వార్స్‌లో ఎటర్నల్స్ ఎంట్రీ? మార్వెల్ కాస్మిక్ కథకు కొత్త మలుపు
అయితే అభిమానులు ఇప్పటికే యానిమేటెడ్ ప్రాజెక్టుల్లో వేరియంట్ క్యారెక్టర్లను చూశారు. డిస్నీ ప్లస్ సిరీస్ మార్వెల్ జాంబీస్ లో ఇకారిస్ వేరియంట్ కొంచెం కనిపించడం గమనార్హం.
By: Sravani Lakshmi Srungarapu | 25 Feb 2026 11:46 AM ISTమార్వెల్ స్టూడియోస్ రూపొందిస్తున్న మల్టీవర్స్ సాగా చివరి అధ్యాయంగా భావిస్తున్న అవెంజర్స్: సీక్రెట్ వార్స్ పై ఇంట్రెస్టింగ్ ఊహాగానాలు వినిపిస్తున్నాయి. తాజా ఇండస్ట్రీ రిపోర్ట్స్ ప్రకారం, మార్వెల్ తన కాస్మిక్ కథనాన్ని మళ్లీ లింక్ చేస్తూ, కనీసం ఒక ఎటర్నల్ క్యారెక్టర్ ను అయినా ఈ భారీ సినిమాలో పెట్టాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అధికారిక ప్రకటన ఏదీ లేకపోయినా, ఈ వార్త అభిమానుల్లో డిస్కషన్ కు దారితీసింది.
క్లో జావో దర్శకత్వంలో వచ్చిన ఎటర్నల్స్
2021లో రిలీజైన ఎటర్నల్స్ ద్వారా మార్వెల్ సినీమాటిక్ యూనివర్స్‌కు అమర వీరులైన ఎటర్నల్స్ పరిచయమయ్యారు. ఆస్కార్ విజేత క్లో జావో దర్శకత్వం వహించిన ఈ సినిమా, డెవియంట్స్ నుంచి భూమిని రక్షించే బాధ్యత కలిగిన అమర జీవుల కథను చెప్పింది. సినిమా చివర్లో పలువురు ఎటర్నల్స్‌ను సెలెస్టియల్ అరిషెం తనతో తీసుకెళ్లడం జరిగింది. అయితే వారి భవితవ్యంపై మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో ఇప్పటివరకు ఎలాంటి క్లారిటీ రాలేదు.
సీక్రెట్ వార్స్ లో ఎటర్నల్స్ క్యారెక్టర్
ఎటర్నల్స్ సీక్వెల్‌పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ లేనప్పటికీ, సీక్రెట్ వార్స్‌లో ఒక క్యారెక్టర్ ను చేర్చే ఆలోచన జరుగుతోందన్న వార్త ఆసక్తిని పెంచుతోంది. ఏ పాత్రను తీసుకురాబోతున్నారు అనే విషయంపై మాత్రం మార్వెల్ మౌనం పాటిస్తోంది. సీక్రెట్ వార్స్ మల్టీవర్స్ కాన్సెప్ట్‌పై ఆధారపడిన సినిమా కావడంతో, ఇతర యూనివర్స్‌ల నుంచి వేరియంట్స్‌ను పరిచయం చేసే అవకాశాలు విస్తారంగా ఉన్నాయి. ఇది గత కథల్ని నేరుగా కొనసాగించకుండా, కొత్త కోణంలో ఎటర్నల్‌ను మళ్లీ చూపించే క్రియేటివ్ ఛాన్స్ ను ఇస్తుంది.
అయితే అభిమానులు ఇప్పటికే యానిమేటెడ్ ప్రాజెక్టుల్లో వేరియంట్ క్యారెక్టర్లను చూశారు. డిస్నీ ప్లస్ సిరీస్ మార్వెల్ జాంబీస్ లో ఇకారిస్ వేరియంట్ కొంచెం కనిపించడం గమనార్హం. మెయిన్ మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ టైమ్‌లైన్‌కు వెలుపల సాగే ఈ కథలో, అతను జాంబీ కేప్టెన్ మార్వెల్‌తో పోరాడే సీన్ అభిమానులందరి దృష్టిని ఆకర్షించింది.
సీక్రెట్ వార్స్ మల్టీవర్స్ సాగా క్లైమాక్స్ కావడంతో, ఇప్పటివరకు పరిష్కారం కాని కథల్ని ఒకే వేదికపైకి తెచ్చే ప్రయత్నం జరగొచ్చు. ఎటర్నల్స్ సినిమాకు మిశ్రమ స్పందనలు వచ్చినప్పటికీ, మార్వెల్ ఈ కాస్మిక్ పాత్రలను పూర్తిగా పక్కనపెట్టలేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కనీసం ఒక ఎటర్నల్ అయినా సీక్రెట్ వార్స్‌లో కనిపిస్తే, అది గతంలో విడిచిపెట్టిన కథాంశాలకు ముగింపు ఇవ్వడమే కాకుండా, మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ భవిష్యత్తు దిశపై కూడా కీలక సూచనగా మారవచ్చు. అధికారిక ప్రకటన వచ్చే వరకు ఇవన్నీ ఊహాగానాలుగానే మిగిలినా, మార్వెల్ అభిమానుల్లో ఆసక్తి మాత్రం మరింత పెరుగుతోంది. మల్టీవర్స్ ముగింపులో ఎటర్నల్స్ పాత్ర ఎంతవరకు ఉంటుందో చూడాలి మరి.
