అన్నా చెల్లెళ్ల మధ్య ఆస్తి తగాదా లేనట్టేనా?
బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర మరణానంతరం అతడి కుటుంబంలో ఆస్తి వివాదం రాజుకుంటుందని ప్రచారమైంది.
By: Sivaji Kontham | 27 Jan 2026 8:30 AM ISTబాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర మరణానంతరం అతడి కుటుంబంలో ఆస్తి వివాదం రాజుకుంటుందని ప్రచారమైంది. దానికి కారణం ఆయన మొదటి భార్య కుమారులైన సన్నీడియోల్, బాబి డియోల్ ప్రస్తుతం తమ తండ్రికి ఉన్న 600కోట్ల ఆస్తులకు వారసులుగా ఉన్నారు. అయితే పెళ్లి చేసుకోకపోయినా కానీ, డ్రీమ్ గర్ల్ హేమమాలినితో ఇద్దరు కుమార్తెలకు ధర్మేంద్ర తండ్రి. దీంతో హేమ మాలిని కుమార్తెలైన ఇషా డియోల్, అహనా డియోల్ ఆస్తిలో వాటా కోసం వస్తారని, అన్నలతో ఫైట్ చేస్తారని అంతా భావించారు.
ధర్మేంద్ర మరణానంతరం సంస్మరణ సభలను డియోల్ బ్రదర్స్ వేరుగా, హేమమాలిని కుటుంబం వేరుగా నిర్వహించడంతో ఇరు కుటుంబాల నడుమ సఖ్యత లేదని కూడా సందేహాలొచ్చాయి. కానీ పరిస్థితుల వేగంగా మారిపోయాయి. అన్నా చెల్లెళ్ల మధ్య సత్సంబంధాలకు కొదవేమీ లేదని పరిణామాలు చెబుతున్నాయి. హేమమాలిని కుమార్తెలు ధర్మేంద్ర ఆస్తి కోసం పోరాడే ఆలోచనతో లేరు. వారంతా మేము ఒకటిగా ఉన్నామని నిరూపిస్తున్నారు.
ఇంతలోనే ఇప్పుడు డియోల్ కుటుంబ సభ్యులంతా కలిసి ఒకే వేదికపై సెలబ్రేషన్ చేసుకునే సమయం రానే వచ్చింది. డియోల్ కుటుంబంలో ప్రస్తుతం డబుల్ సెలబ్రేషన్స్ నడుస్తున్నాయి. ఒకవైపు `బార్డర్ 2` సినిమా బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తుంటే, మరోవైపు దివంగత లెజెండరీ నటుడు ధర్మేంద్రకు భారత ప్రభుత్వం అత్యున్నత పురస్కారాన్ని ప్రకటించింది.
ఈ సందర్భంగా ఈషా డియోల్ తన సోషల్ మీడియా వేదికగా తన ఆనందానికి అవధులే లేవని ప్రకటించింది.
గణతంత్ర దినోత్సవం (జనవరి 26) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం తన తండ్రి ధర్మేంద్రకు మరణానంతరం దేశపు రెండో అత్యున్నత పౌర పురస్కారం `పద్మ విభూషణ్` ప్రకటించడంపై ఈషా డియోల్ చాలా ఎమోషనల్ అయ్యారు.
``మా పాపాకు ఈ గౌరవం దక్కడం చాలా సంతోషంగా ఉంది`` అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేశారు. ధర్మేంద్ర 2025 నవంబర్ 24న కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మరణానంతరం ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని గెలుచుకున్నారు.
ఇంతలోనే సన్నీ డియోల్ నటించిన మోస్ట్ అవైటెడ్ వార్ డ్రామా `బార్డర్ 2` జనవరి 23న విడుదలై సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ముంబైలో జరిగిన స్పెషల్ స్క్రీనింగ్‌లో సన్నీడియోల్ సోదరి అయిన ఈషా డియోల్, తన సోదరి అహానా డియోల్‌తో కలిసి ఈ సినిమాను వీక్షించారు. సినిమా చూసిన తర్వాత సన్నీ డియోల్‌ను కౌగిలించుకుని ``నువ్వు బెస్ట్ అన్నయ్యా!`` అని ప్రశంసించారు. అభిమానులంతా ఈ సినిమాను కుటుంబంతో కలిసి చూడాలని ఆమె కోరారు.
డియోల్ కుటుంబంలో ఐక్యత..
ధర్మేంద్ర మరణం తర్వాత సన్నీ డియోల్ -హేమమాలిని కుమార్తెలు (ఈషా, అహానా) మధ్య విభేదాలు ఉన్నాయని వస్తున్న పుకార్లకు ఈ ఫోటోలు చెక్ పెట్టాయి. సన్నీ డియోల్ తన ఇద్దరు చెల్లెళ్లతో కలిసి నవ్వుతూ ఫోటోలకు ఫోజులివ్వడం అభిమానులకు కనువిందు చేసింది.
`బార్డర్ 2`సినిమా కేవలం 3 రోజుల్లోనే దేశవ్యాప్తంగా సుమారు రూ. 121 కోట్లు, ప్రపంచవ్యాప్తంగా రూ. 158 కోట్లు వసూలు చేసి బాక్సాఫీస్ వద్ద సునామీగా నిలిచింది. ఈ చిత్రంలో సన్నీడియోల్ తో పాటు, వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్ తదితరులు నటించారు. డియోల్ బ్రదర్స్ ప్రతి విజయాన్ని హేమమాలిని కుమార్తెల సెలబ్రేట్ చేసుకుంటున్నారు. దీని అర్థం .. ఆస్తి కోసం పాకులాట ముఖ్యం కాదు.. బంధాలు అనుబంధాలు ముఖ్యమని సిస్టర్స్ నిరూపిస్తున్నట్టే.
