Begin typing your search above and press return to search.

వంగా 'ఎపిక్' కనెక్షన్.. మామూలు రిస్క్ కాదుగా!

ఎపిక్ గురించి మొదటినుంచే ఒక లైన్ బజ్ పెంచుతోంది. శేఖర్ కమ్ముల సినిమాలో హీరోలాంటి అబ్బాయి, సందీప్ రెడ్డి వంగా సినిమాలో హీరోలాంటి అమ్మాయి మధ్య జరిగే ప్రేమకథ అని ఆదిత్య హాసన్ చెప్పాడు.

By:  M Prashanth   |   9 Sept 2026 9:21 AM IST
వంగా ఎపిక్ కనెక్షన్.. మామూలు రిస్క్ కాదుగా!
X

ఎపిక్ గురించి మొదటినుంచే ఒక లైన్ బజ్ పెంచుతోంది. శేఖర్ కమ్ముల సినిమాలో హీరోలాంటి అబ్బాయి, సందీప్ రెడ్డి వంగా సినిమాలో హీరోలాంటి అమ్మాయి మధ్య జరిగే ప్రేమకథ అని ఆదిత్య హాసన్ చెప్పాడు. కమ్ముల హీరో ఎలా ఉంటాడో ఒక అంచనా వేసుకోవచ్చు. కానీ వంగా సినిమాలో హీరోలాంటి హీరోయిన్ అనగానే లెక్క మారిపోతుంది. ఎందుకంటే వంగా హీరోలు ప్రేమలోనైనా, కోపంలోనైనా చాలా బోల్డ్‌గా ఉంటారు.

అర్జున్ రెడ్డి నుంచి యానిమల్ వరకు వంగా హీరోల విషయంలో ఇదే కనిపించింది. వాళ్లు తప్పులు చేస్తారు, తమకు నచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటారు, కొన్ని సందర్భాల్లో ప్రేక్షకుడినే ఇబ్బంది పెట్టేలా ప్రవర్తిస్తారు. కానీ చివరికి హీరోను అర్థం చేసుకునేలా వంగా స్క్రీన్ ప్లే ఉంటుంది. అదే లక్షణాలతో ఒక అమ్మాయి పాత్రను రాస్తే ఎలా ఉంటుంది? వైష్ణవి చైతన్య క్యారెక్టర్ నిజంగానే అంత బోల్డ్‌గా ఉంటుందా, లేక ఆ పోలిక కేవలం ఆమె స్వభావం వరకు మాత్రమేనా అనేది ఎపిక్‌లో చూడాలి.

వైష్ణవికి ఇలాంటి రిస్క్ పూర్తిగా కొత్త కూడా కాదు. బేబీలో ఆమె చేసిన వైష్ణవి పాత్ర చాలా సింపుల్ హీరోయిన్ క్యారెక్టర్ కాదు. ప్రేమ, కొత్త పరిచయాలు, తన నిర్ణయాలు, చేసిన తప్పులు అన్నీ కలిసిన పాత్ర అది. సినిమా వచ్చినప్పుడు ఆ క్యారెక్టర్ మీద ఎంత చర్చ జరిగిందో, సోషల్ మీడియాలో ఎంత ట్రోలింగ్ వచ్చిందో కూడా చూశాం. అయినా సాయి రాజేష్ ఆ పాత్రను కథలో పెట్టిన విధానం ప్రేక్షకులకు కనెక్ట్ అయింది. 100 కోట్లు కొట్టడానికి కారణం కూడా ఆ పాత్రే.

అలాంటి పాత్రల్లో చిన్న తేడా వచ్చినా సమస్య పెద్దదవుతుంది. హీరోయిన్ ఎందుకు అలా ప్రవర్తిస్తోంది అనే కారణం కథలో సరిగ్గా కనిపించకపోతే ప్రేక్షకుడు వెంటనే క్యారెక్టర్‌ను పట్టేస్తాడు. ముఖ్యంగా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక్క సీన్ బయటకు వచ్చినా దానిపైనే తీర్పులు మొదలవుతాయి. బేబీలో వైష్ణవికి ఆ రిస్క్ కలిసి వచ్చింది. ఇప్పుడు ఎపిక్‌లో మళ్లీ అలాంటి గ్రే షేడ్ ఉన్న అమ్మాయిగా కనిపిస్తే పోలికలు కూడా తప్పవు.

ఇక్కడ ఆదిత్య హాసన్‌కు అసలు ఛాలెంజ్ అదే. వంగా హీరోలాంటి హీరోయిన్ అని ముందే చెప్పేశాడు కాబట్టి ఆ పాత్ర మామూలుగా ఉంటే ఆ లైన్ పెద్దగా పని చేయదు. మరీ ఎక్కువ బోల్డ్‌గా రాస్తే ఆ క్యారెక్టర్ ప్రేక్షకులకు దూరమయ్యే ప్రమాదం ఉంటుంది. మధ్యలో సరైన బ్యాలెన్స్ పట్టుకోవాలి. పైగా ఎదురుగా కమ్ముల హీరోలాంటి సాఫ్ట్ క్యారెక్టర్‌లో ఆనంద్ దేవరకొండ ఉండటం వల్ల ఇద్దరి మధ్య కాంట్రాస్ట్ కూడా కథలో బలంగా కనిపించాలి. బేబీ తర్వాత వైష్ణవిని మళ్లీ ప్రేమకథలో చూస్తున్నారు కాబట్టి ఆమె పాత్రపై సహజంగానే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. ఈసారి ఆమె చేసే నిర్ణయాలు ఎంత వరకు షాక్ ఇస్తాయి, ఆదిత్య వాటిని ఎంత వరకు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా రాశాడు అనేది చూడాలి.