ఎపిక్ 'ప్రియసఖి'.. ఆనంద్, వైష్ణవి బ్యూటిఫుల్ కెమిస్ట్రీ చూశారా?
యూత్ ఫుల్ ప్రేమకథలంటే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది.
By: M Prashanth | 26 May 2026 12:48 PM ISTయూత్ ఫుల్ ప్రేమకథలంటే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ ప్రత్యేకమైన ఆసక్తి ఉంటుంది. ఇప్పుడు అదే లిస్ట్ లోకి చేరేందుకు సిద్ధమవుతోంది ఎపిక్- ఫస్ట్ సెమిస్టర్ చిత్రం. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ఆ సినిమా నుంచి తాజాగా విడుదలైన రెండో సింగిల్ ప్రియసఖి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. మెలోడీ, విజువల్స్, లిరిక్స్ కలిసి ఆ పాటను యూత్ కు దగ్గర చేస్తున్నాయి.
90స్ ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ వెబ్ సిరీస్ తో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు ఆదిత్య హాసన్ ఆ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టైటిల్ గ్లింప్స్, ఫస్ట్ సాంగ్‌కు మంచి స్పందన రావడంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ఇప్పుడు ప్రియసఖి పాట ఆ అంచనాలను మరింత పెంచింది. 'జీవితాన్ని మార్చేశావే బుజ్జి నెమలి.. స్వర్గంలోతూ చూపించావే పూల కడలి' వంటి లైన్స్ తో సాగిన పాటలో ప్రేమలో పడిన ఓ యువకుడి మనసును ఎంతో అందంగా చూపించారు.
తన మనసులోని భావాలను బయటకు చెప్పలేక మౌనంగా ప్రేమను దాచుకునే యువకుడి ఎమోషన్ ను సాంగ్ లో స్ట్రాంగ్ గా చూపించడం ప్రత్యేకంగా నిలిచింది. ఆ పాటకు సురేష్ బనిశెట్టి అందించిన లిరిక్స్ ప్రధాన ఆకర్షణగా మారింది. 'సూర్యుడు ఎరుగని కొత్త కాంతి ఇది.. చంద్రుడు చూడని కొత్త వెన్నెల ఇది' వంటి లైన్స్ వినేవారిని వెంటనే ఆకట్టుకుంటున్నాయి. సింపుల్ పదాలతో డీప్ ఫీలింగ్ ను చెప్పడంలో ఆయన మరోసారి తన ప్రత్యేకతను చూపించారు.
సింగర్ కేఎస్ హరిశంకర్ తన స్మూత్ వాయిస్ తో పాటకు మరింత అందం తీసుకొచ్చారు. ఆయన వాయిస్ లోని ఎమోషనల్ టచ్ కారణంగా పాట మెల్లగా మనసులోకి వెళ్లిపోతుంది. మెలోడీ ప్రేమికులకు సాంగ్ రిపీట్ మోడ్ లో వినిపించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ మరోసారి తన మ్యూజికల్ మ్యాజిక్ ను చూపించారు. సాఫ్ట్ ఇన్స్ట్రుమెంట్స్, ఫ్రెష్ ట్యూన్ తో ఒక పీస్ ఫుల్ ఫీల్ ను సృష్టించారు. గిటార్స్, ఫ్లూట్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అన్నీ పాట మూడ్ కు తగ్గట్టుగా ఉండటం విశేషం.
వోకల్స్‌ను ఎక్కడా మింగేయకుండా మ్యూజిక్ ను సున్నితంగా డిజైన్ చేయడం పాటకు పెద్ద ప్లస్ గా మారింది. విజువల్ గా కూడా ప్రియసఖి ఆకట్టుకుంటోంది. లండన్‌లోని అందమైన లొకేషన్స్ లో పాటను చిత్రీకరించారు. కలర్ ఫుల్ ఫ్రేమ్స్, క్లీన్ విజువల్స్, రిచ్ సినిమాటోగ్రఫీ సాంగ్ కు ఫ్రెష్ లుక్ తీసుకొచ్చాయి. ముఖ్యంగా ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య మధ్య కనిపించిన కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. బేబీ తర్వాత ఆ జంట మళ్లీ కలిసి నటించడం కూడా సినిమాపై ఆసక్తి పెరగడానికి కారణమైంది.
ఇద్దరి స్క్రీన్ ప్రెజెన్స్, ఎమోషనల్ కనెక్ట్ మరోసారి ప్రేక్షకులను థియేటర్లకు రప్పించేలా కనిపిస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య చిత్రాన్ని రూపొందిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తున్న ఆ సినిమా జూలైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏదేమైనా ప్రియసఖి సాంగ్ కు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఎపిక్ – ఫస్ట్ సెమిస్టర్ యూత్ లో మంచి బజ్ క్రియేట్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.
