Begin typing your search above and press return to search.

సినిమాలో సిక్సర్లు అవే.. ‘ఎపిక్’పై సాయి మార్తాండ్

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’.

By:  M Prashanth   |   4 Sept 2026 10:48 PM IST
సినిమాలో సిక్సర్లు అవే.. ‘ఎపిక్’పై సాయి మార్తాండ్
X

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎపిక్: ఫస్ట్ సెమిస్టర్’. ఆదిత్య హాసన్ దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ యూత్‌ఫుల్ లవ్ డ్రామాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ నిర్మించాయి. సెప్టెంబర్ 11న చిత్రం థియేటర్లలోకి రానున్న నేపథ్యంలో, హైదరాబాద్‌లో గ్రాండ్‌గా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన ‘లిటిల్ హార్ట్స్’ డైరెక్టర్ సాయి మార్తాండ్ మాట్లాడిన విశేషాలు యూత్‌లో మంచి బజ్ క్రియేట్ చేశాయి.

వేదికపైకి రాగానే వైష్ణవి నటన గురించి ప్రస్తావిస్తూ ఆయన మాట్లాడారు. సెకండ్ హాఫ్‌లో ఒక 15 నిమిషాల సీక్వెన్స్ వస్తుందని, అందులో వైష్ణవి చెప్పే డైలాగ్స్, ఆమె పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంటాయని చెప్పారు. ప్రస్తుతం మనకున్న బెస్ట్ యాక్టర్లలో ఆమె ఒకరని ప్రశంసించారు. ఆ తర్వాత క్లైమాక్స్ ముందు వచ్చే శివాజీ సీన్ కూడా అదిరిపోతుందని, సినిమాలో ఈ రెండు సీక్వెన్సులు పక్కా సిక్సర్ల లాంటివని పేర్కొన్నారు.

ఆనంద్ దేవరకొండ గురించి మాట్లాడుతూ.. దొరసాని నుంచి ఆయన చేసిన అన్ని చిత్రాలూ చూశానని చెప్పారు. మిడిల్ క్లాస్ మెలోడీస్ తనకు చాలా ఇష్టమైన సినిమా అని, ఒక నటుడిగా ఆనంద్ ట్రాన్స్‌ఫార్మేషన్ ఎంతో స్ఫూర్తినిస్తుందని అన్నారు. ఇదే సమయంలో ఈ చిత్రంలో సింజిత్ పాత్రలో నటించిన కల్యాణ్ శంకర్ గురించి ప్రత్యేకంగా చెబుతూ, ఆయన టైమింగ్ సూపర్ అని, సింగిల్ టేక్ ఆర్టిస్ట్ అయిన కల్యాణ్ క్యారెక్టర్ సినిమాకే ప్రధాన హైలైట్లలో ఒకటిగా నిలుస్తుందని చెప్పుకొచ్చారు.

దర్శకుడు ఆదిత్య హాసన్‌తో తనకున్న అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. సరిగ్గా ఏడాది క్రితం ఆదిత్య నిర్మించిన ‘లిటిల్ హార్ట్స్’ సినిమాకు పెయిడ్ ప్రీమియర్స్ పడ్డాయని, దానికంటే పెద్ద హిట్ ఈ ‘ఎపిక్’ అవుతుందని ధీమా వ్యక్తం చేశారు. ఆదిత్య ప్రస్తుత తరం బెస్ట్ రైటర్లలో ఒకరని, తానిప్పుడు ఈ స్టేజ్ మీద ఉండటానికి కారణం ఆదిత్యనే అని చెప్పారు. ‘90స్’ సిరీస్ వల్లనే తమ ప్రయాణం మొదలైందని, ఆ సిరీస్ తనకు చాలా వ్యక్తిగతమైనదని తెలిపారు.

సినిమా కంటెంట్ గురించి చెబుతూ.. కథలో అమ్మాయి, అబ్బాయి మధ్య ఒక పెద్ద డిబేట్ నడుస్తుందని చెప్పారు. బయటకు వచ్చాక కొందరు అమ్మాయి వైపు, మరికొందరు అబ్బాయి వైపు మాట్లాడే అవకాశం ఉన్నా, చూసిన ప్రతి ఒక్కరికీ ఇదొక ఫుల్ సాటిస్‌ఫైయింగ్ ఫిల్మ్‌గా నిలుస్తుందని వివరించారు. ముఖ్యంగా విదేశాలకు వెళ్లి చదువుకునే వారికి ఈ కథ బాగా కనెక్ట్ అవుతుందన్నారు. తన అన్నయ్య కూడా లండన్‌లో చదువుకున్నాడని, అక్కడ విద్యార్థులు బ్యాగులు పట్టుకుని తిరుగుతారని, తనకూ అలాంటి బట్టలే తెచ్చేవారని గుర్తుచేసుకున్నారు. అంత చిన్న డీటెయిలింగ్‌తో రెండేళ్ల క్రితం తనకు చెప్పిన కథను ఆదిత్య ఏమాత్రం మార్పు లేకుండా తెరపైకి తీసుకొచ్చాడని ప్రశంసించారు. పక్కా కన్విక్షన్‌తో తీసిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చాలా పెద్ద హిట్ అవుతుందని సాయి మార్తాండ్ ఆశాభావం వ్యక్తం చేశారు.