Begin typing your search above and press return to search.

'నేనంత రొమాంటిక్‌ కాదు'.. ఎపిక్ ట్రైలర్ ఎలా ఉందంటే?

'నేనంత రొమాంటిక్‌ కాదు..' అంటూ టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్‌ దేవరకొండ చెప్పిన డైలాగ్ తో మొదలయ్యే ఎపిక్‌: ఫస్ట్‌ సెమిస్టర్‌ మూవీ ట్రైలర్‌ ప్రస్తుతం సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతోంది.

By:  M Prashanth   |   4 Sept 2026 10:48 PM IST
నేనంత రొమాంటిక్‌ కాదు.. ఎపిక్ ట్రైలర్ ఎలా ఉందంటే?
X

'నేనంత రొమాంటిక్‌ కాదు..' అంటూ టాలీవుడ్ యంగ్ హీరో ఆనంద్‌ దేవరకొండ చెప్పిన డైలాగ్ తో మొదలయ్యే ఎపిక్‌: ఫస్ట్‌ సెమిస్టర్‌ మూవీ ట్రైలర్‌ ప్రస్తుతం సినీ ప్రియుల్లో ఆసక్తిని పెంచుతోంది. ప్రేమ, స్నేహం, బ్రేకప్‌, ఎమోషన్స్ ను ఎంటర్టైనింగ్ గా మిక్స్ చేసినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ముఖ్యంగా యువతకు కనెక్ట్ అయ్యేలా కథ, పాత్రలు, కన్వర్జేషన్స్ ను తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది.





బేబీ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆనంద్‌ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంట మరోసారి తెరపై సందడి చేయనుంది. ఆదిత్య హాసన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఎపిక్‌: ఫస్ట్‌ సెమిస్టర్‌ సెప్టెంబరు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ట్రైలర్‌ ను విడుదల చేశారు. హీరోయిన్‌ రష్మిక మందన్న ఆ ట్రైలర్‌ ను లాంచ్‌ చేశారు. ట్రైలర్‌ ను చూస్తే.. చదువు కోసం భారత్‌ నుంచి లండన్‌ కు వెళ్లిన ఓ యువకుడి జీవితంలోకి ఓ అమ్మాయి రావడం.. ఆ పరిచయం ప్రేమగా మారడం.. ఆ తర్వాత ఇద్దరి మధ్య సంబంధం ఎలాంటి మలుపులు తిరిగిందనేది ప్రధాన కథాంశంగా కనిపిస్తోంది.

ప్రేమతో పాటు లివ్‌ ఇన్‌ రిలేషన్‌, స్నేహం, గొడవలు, బ్రేకప్‌ వంటి అంశాలను ఇందులో చూపించినట్లు తెలుస్తోంది. 'బ్రేకప్‌ అవ్వాలంటే ఇలా తిట్టుకుంటూ.. ఎవరినో ఒకరిని బ్లేమ్‌ చేసుకుంటూ బ్రేక్ అవ్వాలి' అనే డైలాగ్‌ ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. అలాగే ప్రేమలో పడిన తర్వాత చేయకూడని పనుల గురించి వచ్చే సంభాషణలు కూడా నవ్వులు పూయించేలా ఉన్నాయి. పీరియడ్స్‌ గురించి వచ్చే డైలాగ్‌ కూడా ప్రస్తుత యువత ఆలోచనా విధానానికి దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తోంది.

మొత్తంగా ట్రైలర్‌ లోని డైలాగ్స్ చాలా సహజంగా, కాంటెంపరరీగా ఉండటం సినిమాకు ప్లస్‌ గా మారే అవకాశముంది. దర్శకుడు ఆదిత్య హాసన్‌ గతంలో 90s వెబ్‌ సిరీస్‌ తో తనదైన ముద్ర వేశారు. ఫ్యామిలీ స్టోరీ, నేచురల్ కామెడీ, మిడిల్ క్లాస్ ఎమోషన్స్ ను స్క్రీన్ పై ఆవిష్కరించిన ఆ సిరీస్‌ మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు ఎపిక్‌ తో మరోసారి యూత్‌ ఫుల్‌ కథను చెప్పే ప్రయత్నం చేసినట్లు ట్రైలర్‌ స్పష్టం చేస్తోంది.

90s లోని అల్లరి పాత్ర పెద్దయ్యాక ఎలా ఉంటుందనే ఆలోచనతో కథను లింక్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. లండన్‌ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కడం కూడా సినిమాకు కొత్త లుక్‌ ను తీసుకొచ్చింది. అక్కడి లొకేషన్లు, విజువల్స్‌ ఫ్రెష్‌ గా కనిపిస్తున్నాయి. ఇక ఆనంద్‌-వైష్ణవి జంటకు బేబీ తర్వాత వచ్చిన క్రేజ్‌ కూడా ఆ సినిమాకు ఉపయోగపడే అవకాశం ఉంది. వీరిద్దరి మధ్య కెమిస్ట్రీ మరోసారి వర్కౌట్‌ అయ్యేలా ట్రైలర్‌ లోని సన్నివేశాలు కనిపిస్తున్నాయి.

ఇప్పటికే విడుదలైన పాటల్లో సంచారమే మంచి రెస్పాన్స్ అందుకుంది. మిగిలిన సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు బలంగా నిలిస్తే ఎపిక్‌ యూత్‌ ఫుల్‌ ఎంటర్టైనర్‌ గా బాక్సాఫీస్‌ వద్ద ఆకట్టుకునే అవకాశం ఉంది. ఏదేమైనా.. భారీ యాక్షన్‌, హంగుల కంటే లవ్, ఫ్రెండ్ షిప్, ఫన్, ఎమోషన్స్ కు ప్రాధాన్యం ఇచ్చిన ఆ సినిమా ట్రైలర్‌ రిఫ్రెషింగ్‌ గా అనిపిస్తోంది. మరి సెప్టెంబరు 11న థియేటర్లలో ఎపిక్‌ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు మెప్పిస్తుందో చూడాలి.