ఫస్ట్ సెమిస్టర్ అయిపోయింది.. ఫైనల్ సెమిస్టర్ మారుతుందా!
ఇప్పుడు దర్శకుడి చేతిలో ప్రేక్షకుల రెస్పాన్స్ కూడా ఉంది. ఫస్ట్ హాఫ్‌లో ఆదిత్య, కడలి మధ్య రిలేషన్‌షిప్, వాళ్ల మధ్య వచ్చే చిన్న చిన్న మూమెంట్స్‌కు మంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి.
By: M Prashanth | 12 Sept 2026 9:35 AM ISTఎపిక్ ఫస్ట్ సెమిస్టర్ నిన్న థియేటర్లలోకి వచ్చింది. ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య కెమిస్ట్రీకి మంచి రెస్పాన్స్ వస్తున్నా, సినిమా పేస్ ముఖ్యంగా సెకండాఫ్ విషయంలో మిక్స్‌డ్ టాక్ వినిపిస్తోంది. క్లైమాక్స్ కూడా అందరికీ ఒకేలా కనెక్ట్ కాలేదు. అయితే దర్శకుడు ఆదిత్య హాసన్ ముందే ఫైనల్ సెమిస్టర్ పేరుతో రెండో భాగం ఉంటుందని చెప్పేశాడు. ఇప్పుడు మొదటి పార్ట్ రిజల్ట్ తర్వాత ఆ ప్లాన్ ఉంటుందా లేదా అన్నది అసలు డౌట్.
రిలీజ్‌కు ముందే ఆదిత్య సీక్వెల్ గురించి ఓపెన్‌గా మాట్లాడాడు. ఫస్ట్ సెమిస్టర్ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఫైనల్ సెమిస్టర్ షూటింగ్ మొదలుపెడతానని చెప్పాడు. మొదటి భాగం క్లైమాక్స్‌ను కూడా రెండో భాగం వైపు తీసుకెళ్లేలా రాశాడు. కథకు అవసరమైన ముగింపే పెట్టానని అప్పుడే చెప్పడంతో, పార్ట్ టూ ఆలోచన మధ్యలో వచ్చినది కాదు.
ఇప్పుడు దర్శకుడి చేతిలో ప్రేక్షకుల రెస్పాన్స్ కూడా ఉంది. ఫస్ట్ హాఫ్‌లో ఆదిత్య, కడలి మధ్య రిలేషన్‌షిప్, వాళ్ల మధ్య వచ్చే చిన్న చిన్న మూమెంట్స్‌కు మంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎపిక్‌ను ఆదిత్య తన 90స్ ప్రపంచంతో కూడా కనెక్ట్ చేశాడు. అక్కడ చిన్న పిల్లాడిగా కనిపించిన ఆదిత్యనే ఇప్పుడు ఆనంద్ దేవరకొండ పాత్రగా పెద్దవాడిని చేశాడు. ఫైనల్ సెమిస్టర్‌లో కూడా ఇదే పాత్ర ప్రయాణం కొనసాగనుంది.
మొదటి సినిమాలో లండన్ జీవితం, లైవ్ ఇన్ రిలేషన్‌షిప్, కుటుంబ ఒత్తిడి వరకు వెళ్లాడు. రెండో భాగంలో ఈ రిలేషన్‌షిప్ ఎక్కడికి చేరుతుందన్నదే కథకు ప్రధాన పాయింట్ కావాల్సి ఉంది. ఫైనల్ సెమిస్టర్ షూటింగ్ ముందే పూర్తి చేసి పెట్టలేదు. మొదటి సినిమా రిలీజ్ తర్వాతే మొదలు పెడతానని ఆదిత్య చెప్పాడు. ఇప్పుడు షూట్ మొదలయ్యేలోపే ఏ పాయింట్స్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది, ఎక్కడ ప్రేక్షకులు కనెక్ట్ కాలేదు అన్న ఫీడ్‌బ్యాక్ ఆయన చేతిలో ఉంది. కథను మార్చకపోయినా పేస్, సీన్స్ లెంగ్త్, క్యారెక్టర్స్‌కు ఇచ్చే స్పేస్ విషయంలో ఏమైనా మార్పులు చేస్తాడా అన్నది చూడాలి.
మరోవైపు ఆదిత్య దగ్గర 90స్ రెండో, మూడో సీజన్స్ ప్లాన్ కూడా ఉన్నాయి. 2000 నుంచి 2017 మధ్య ఆ కుటుంబంలో ఏం జరిగిందో రెండో సీజన్‌లో చూపించాలని ఆయన ఇప్పటికే చెప్పాడు. ఎపిక్ ఫైనల్ సెమిస్టర్ షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందనే తేదీ మాత్రం ఇంకా బయటకు రాలేదు. ఫస్ట్ సెమిస్టర్ థియేట్రికల్ రన్ పూర్తయ్యేలోపు పార్ట్ 2 మీద టీమ్ నుంచి ఏమైనా కొత్త అప్డేట్ వస్తుందేమో చూడాలి.
