'ఈఎన్ఈ' గ్యాంగ్‌ను తక్కువ అంచనా వేయకండి
‘ఈ నగరానికి ఏమైంది’ సీక్వెల్ ‘ఈఎన్ఈ రిపీట్’కు విడుదలకు ముందు పెద్దగా బజ్ కనిపించడం లేదు. ట్రైలర్‌కు మిశ్రమ స్పందన రావడంతో పాటు ప్రమోషన్లు కూడా అంతంతమాత్రంగానే ఉన్నాయి. అయితే ఓటీటీ, రీ-రిలీజ్‌లో ఈఎన్ఈకి యూత్ నుంచి వచ్చిన ఆదరణ ఈ సినిమాకు కలిసొచ్చే అవకాశం ఉంది. ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో ఉన్న ఎమోషనల్ కనెక్షన్‌తో బాక్సాఫీస్ వద్ద అనూహ్య వసూళ్లు సాధిస్తుందేమో చూడాలి.
By: Garuda Media | 17 Nov 2026 5:00 AM ISTతెలుగులో ఒకప్పటితో పోలిస్తే ఈ మధ్య సీక్వెల్స్ హడావుడి బాగా పెరిగింది. వీటి సక్సెస్ రేట్ తక్కువగానే ఉన్నప్పటికీ.. పార్ట్-2, ఫ్రాంఛైజీ సినిమాలు వస్తూనే ఉన్నాయి. ఈ గురువారం కూడా ఒక సీక్వెల్ రాబోతోంది. అదే.. ఈఎన్ఈ రిపీట్. 2018లో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి ఇది రీమేక్. ‘పెళ్ళిచూపులు’తో సెన్సేషన్ క్రియేట్ చేశాక తరుణ్ భాస్కర్ రూపొందించిన చిత్రమిది. రిలీజ్ టైంలో ఈ సినిమా ఓ మోస్తరు ఫలితాన్నందుకుందంతే.
ఇక ‘ఈఎన్ఈ రిపీట్’ కంటెంట్ విషయానికి వస్తే.. ఫస్ట్ టీజర్ అని, పాటలు అని ఏమీ రిలీజ్ చేయకుండా నేరుగా కొన్ని వారాల ముందు ట్రైలర్ లాంచ్ చేసింది టీం. దానికి మిశ్రమ స్పందన వచ్చింది. కొందరు ట్రైలర్ క్రేజీగా ఉందంటే.. కొందరేమో ‘ఈ నగరానికి ఏమైంది’ వైబ్ మిస్సయిందంటూ పెదవి విరిచారు. ఇక ఈ మూవీ ప్రమోషన్లు అయితే అంత గొప్పగా ఏమీ చేయట్లేదు. టీం ఇంటర్వ్యూలు ఇస్తోంది కానీ.. అవన్నీ సరదా చిట్ చాట్స్ లాగా అనిపిస్తున్నాయి తప్పితే, సినిమాకు హైప్ తెచ్చేలా లేవన్న కంప్లైంట్ ఉంది.
మొత్తంగా చూస్తే ‘ఈఎన్ఈ రిపీట్’కు రిలీజ్ ముంగిట పెద్దగా హైప్ అయితే కనిపించట్లేదు. అలా అని ఈ సినిమాను తక్కువ అంచనా వేయలేం. ‘ఈ నగరానికి ఏమైంది’ గ్యాంగ్‌కు యూత్‌లో ఉన్న ఫాలోయింగ్ సామాన్యమైనదికాదు. ఆ సినిమా రిలీజైనపుడు థియేటర్లలో ఆశించిన ఫలితం రాలేదు కానీ.. ఓటీటీలో ఈ సినిమాను విరగబడి చూశారు. కొన్నేళ్ల ముందు ఈ చిత్రాన్ని రీ రిలీజ్ చేస్తే.. యూత్ ఫస్ట్ రిలీజ్ కంటే బాగా చూశారు. భారీ వసూళ్లు అందించారు. అప్పటిదాకా తరుణ్ భాస్కర్‌కు సీక్వెల్ తీసే ఉద్దేశం లేదు కానీ.. ఈ రెస్పాన్స్ చూశాకే ఆ ప్రయత్నం మొదలుపెట్టాడు.
ఈ సినిమా ట్రైలర్ అంచనాలకు తగ్గట్లు లేదని, ప్రమోషన్లు గట్టిగా చేయట్లేదని ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో బజ్ క్రియేట్ కాలేదని అనుకుంటే పొరపాటే. ఈఎన్‌ఈ ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో యూత్‌కు ఉన్న ఎమోషనల్ కనెక్షన్ వేరు. వారి కోసం సైలెంటుగా రేపు థియేటర్లలో కుర్రకారు దిగిపోతే ఆశ్చర్యం లేదు. సినిమాకు ఒక మోస్తరు టాక్ వచ్చినా చాలు.. యూత్ ఈ చిత్రాన్ని నెత్తిన పెట్టుకుంటారనడంలో సందేహం లేదు. బాక్సాఫీస్ దగ్గర ఎవ్వరూ ఊహించని నంబర్స్ చూసే అవకాశం ఉంది. ఈ సినిమాను తక్కువ అంచనా వేస్తున్న వాళ్లందరూ కొంచెం వెయిట్ చేస్తే వాస్తవం అర్థమవుతుంది.
