OG విలన్ ముస్లిమ్స్ మస్ట్ వాచ్ అంటున్నాడు
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ ఈ సీజన్ లో కమర్షియల్‌గా బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే.
By: Sivaji Kontham | 28 Oct 2025 11:09 AM ISTపవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ ఈ సీజన్ లో కమర్షియల్‌గా బ్లాక్ బస్టర్ చిత్రంగా నిలిచిన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద పవన్ మానియా వర్కవుటైంది. దానికి తోడు సీరియల్ కిస్సర్ ఇమ్రాన్ హష్మి అద్భుత విలనీ ఈ సినిమాకి ప్లస్ అయింది. భారతదేశంలోని అరుదైన ప్రతిభావంతులలో హష్మి ఒకరు. అందుకే ఇప్పుడు ఆయన ముస్లిముల నుద్ధేశించి చేసిన వ్యాఖ్యలు ఆసక్తికర చర్చకు తావిచ్చాయి.
ఇమ్రాన్ హష్మి తాను నటించిన హక్ చిత్రాన్ని త్వరలో విడుదలకు సిద్ధం చేస్తున్నాడు. ప్రచార కార్యక్రమాల్లో ప్రత్యేకించి ముస్లిములనుద్ధేశించి మాట్లాడుతూ ప్రతి ఒక్క ముస్లిమ్ తప్పక చూడాల్సిన సినిమా ఇదని అన్నారు. ఇది ముస్లిముల చట్టాలకు సంబంధించి పెద్ద ప్రశ్నను లేవనెత్తిన షాభానో నిజ కథతో రూపొందించిన చిత్రం. షా భానో భర్తగా ఇమ్రాన్ హష్మి నటించాడు. తలాక్ వ్యవస్థను పెంచి పోషించే వ్యవస్థలో దానిని తొలగించాలని ధైర్యంగా పోరాడిన షాభానో కథను తెరపై అద్భుతంగా చూపించారని చిత్రబృందం చెబుతోంది. తాను కేవలం రొమాంటిక్ ఎంటర్ టైనర్లలోనే కాదు, డెప్త్ ఉన్న పాత్రలలోను నటించి మెప్పించగలనని ఇమ్రాన్ హష్మి ఇప్పటికే కొన్ని చిత్రాల్లో నిరూపించాడు. ఇప్పుడు హక్ చిత్రంలోను అతడి పాత్ర అందరినీ ఆకట్టుకుంటుందని ధీమాగా ఉన్నాడు.
ఇందులో ట్యాలెంటెడ్ యామి గౌతమ్ ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం 7 నవంబర్ 2025న విడుదల కానుంది. హష్మీ మాట్లాడుతూ.. ఒక సున్నితమైన సామాజిక సమస్య చుట్టూ ముడిపడి ఉన్న చట్టపరమైన ఇతివృత్తాన్ని తెరపై చూడాలని అన్నాడు.1985 నాటి చారిత్రాత్మక షా బానో కేసు నుండి ప్రేరణ పొందిన చిత్రమిది. ఇది ముస్లిముల వ్యక్తిగత చట్టం, మహిళల హక్కులు, లౌకికవాదంపై దేశవ్యాప్తంగా చర్చలకు దారి తీసిన కేసుపై సినిమా. ఈ కేసు భారతదేశ ముస్లిములలో విడాకులు, లింగ సమానత్వం గురించి చాలా చర్చకు తావిచ్చింది.
ఇమ్రాన్ హష్మీ ఈ చిత్రంలో ప్రతివాది అయిన భర్త మొహమ్మద్ అహ్మద్ ఖాన్ పాత్రను పోషిస్తున్నాడు. ఇది ఒక ముస్లిమ్ మహిళ పోరాటానికి సంబంధించిన కథ. మతం, చట్టం ఈ రెండిటితో ముడిపడిన వ్యవహారాలను డీల్ చేసే చిత్రం. ఈ కథాంశం భావోద్వేగంతో కూడకున్న డ్రామాను.. న్యాయం, వ్యక్తిగత హక్కులపై వ్యవహారాలను తెరపై ఆవిష్కరిస్తుంది.
స్క్రిప్ట్ చదవడం వల్ల మతం, చట్టం ఎక్కడ కలుస్తాయనే దానిపై లోతైన విషయాలపై అవగాహన వచ్చిందని హష్మి అన్నారు. `హక్` రెండు వాదనలను తెరపైకి తెస్తున్నాడని వెల్లడించారు. సమాజాలను శాసించే మతపరమైన విశ్వాసాలు, సమానత్వం, న్యాయాన్ని కాపాడే రాజ్యాంగ విలువలపై చర్చ ఇది. ఈ చిత్రంలో ప్రతిదీ పక్షపాతం లేని విధంగా ఉందని ఇమ్రాన్ హష్మి తెలిపారు. ముస్లిమ్ మహిళలకు సానుకూలంగా కథాంశం ఉందని అన్నాడు.
``ముస్లిములు ఈ చిత్రాన్ని తప్పక చూడాలి`` అని ఇమ్రాన్ హష్మి సూచించాడు. హక్ దశాబ్ధాలుగా సంఘంలో పాతుకుపోయిన ముస్లిమ్ మతాచారాలపై స్పష్ఠంగా చర్చించే సినిమా. ఈ మూవీ చూశాక చాలా మంది దశాబ్దాలుగా వేధిస్తున్న సమస్యల గురించి నేరుగా ఒకరితో ఒకరు మాట్లాడతారని భావిస్తున్నట్టు తెలిపాడు. సానుభూతి, ఐడెంటిటీ, న్యాయం, సంస్కరణల గురించి విమర్శనాత్మకంగా ఆలోచించమని ప్రేక్షకులను సవాలు చేసే కథ ఇదని హష్మి అభివర్ణించారు. మతపరమైన, సాంస్కృతిక దృక్పథంతో సమానత్వం, నైతిక బాధ్యత గురించి ఆలోచించమని కూడా సవాల్ చేస్తుందని హష్మి అన్నారు.
