Begin typing your search above and press return to search.

పెద్ద హీరోల్ని పక్కకు నెట్టి OG విలన్ హవా మొదలైనట్టే ఇక‌

బాలీవుడ్‌లో ఇటీవల భారీ బడ్జెట్ చిత్రాలు, పెద్ద హీరోల సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న వేళ సీరియల్ కిస్సర్‌గా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ హష్మీ సంచలన విజయంతో దూసుకొచ్చారు.

By:  Sivaji Kontham   |   21 Aug 2026 6:50 PM IST
పెద్ద హీరోల్ని పక్కకు నెట్టి OG విలన్ హవా మొదలైనట్టే ఇక‌
X

బాలీవుడ్‌లో ఇటీవల భారీ బడ్జెట్ చిత్రాలు, పెద్ద హీరోల సినిమాలు వరుసగా బాక్సాఫీస్ వద్ద సందడి చేస్తున్న వేళ సీరియల్ కిస్సర్‌గా పేరు తెచ్చుకున్న ఇమ్రాన్ హష్మీ సంచలన విజయంతో దూసుకొచ్చారు. సన్నీ డియోల్, అమీర్ ఖాన్ కాంబినేషన్‌లో వచ్చిన `బట్వారా 1947` లాంటి క్రేజీ ప్రాజెక్ట్ బజ్ ఉన్నా దానిని కూడా పక్కకు నెట్టి ఇమ్రాన్ హష్మీ నటించిన `ఆవారాపన్ 2` రికార్డు స్థాయి వసూళ్లతో గ్రాండ్ విక్టరీ కొట్టింది. గతంలో పవన్ కళ్యాణ్ OG చిత్రంలో విలన్‌గా నటించి మెప్పించిన ఈ ఓజీ విలన్ హవా సోలో హీరోగా కూడా మొదలైందని ఈ చిత్రం నిరూపించింది.

ఈ సరికొత్త బాక్సాఫీస్ సంచలనం `ఆవారాపన్ 2` విడుదలైన కేవలం ఐదు రోజుల్లోనే రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరి సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆగస్టు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలి రోజు నుంచే థియేటర్లలో స్థిరమైన వసూళ్లను సాధిస్తోంది. వీకెండ్‌లోనే కాకుండా సోమ, మంగళవారాల్లో కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బలమైన పట్టును ప్రదర్శిస్తూ దూసుకుపోతోంది.

సినిమా కలెక్షన్ల గ్రాఫ్‌ను పరిశీలిస్తే.. మొదటి రోజు రూ. 22 కోట్ల వసూళ్లతో ఘనమైన శుభారంభం లభించింది. ఆ తర్వాత స్వాతంత్య్ర దినోత్సవ వీకెండ్ కలసిరావడంతో రెండో రోజు ఏకంగా 55 శాతం వృద్ధితో రూ. 33.75 కోట్లను రాబట్టింది. మూడో రోజు రూ. 26 కోట్లు, నాలుగో రోజు రూ. 9.25 కోట్లు సాధించగా, ఐదో రోజు మంగళవారం రూ. 9.75 కోట్లు వసూలు చేసింది. దీంతో దేశీయంగా రూ. 100.75 కోట్ల నెట్ వసూళ్లను.. ప్రపంచవ్యాప్తంగా రూ. 144.13 కోట్ల గ్రాస్‌ను నమోదు చేసి సంచలనం సృష్టిస్తోంది.

ఇమ్రాన్ హష్మీ సుదీర్ఘ సినీ కెరీర్‌లో సోలో హీరోగా రూ. 100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి చిత్రంగా `ఆవారాపన్ 2` ప్రత్యేకంగా నిలిచింది. గతంలో ఆయన `టైగర్ 3`, `దే కాల్ హిమ్ OG` వంటి వంద కోట్ల చిత్రాల్లో భాగమైనా వాటిలో ప్రతి నాయకుడి (విలన్) పాత్రలే పోషించారు. దాదాపు దశాబ్దం క్రితం వచ్చిన `ఆవారాపన్` మొదటి భాగం థియేటర్లలో సరిగ్గా ఆడకపోయినా దాని సంగీతం, భావోద్వేగాల వల్ల కల్ట్ స్టేటస్‌ను సంపాదించుకోగా.. ఇప్పుడు ఆ క్రేజ్ ఈ సీక్వెల్‌కు కొండంత బలంగా మారి రూ. 100 కోట్ల మైలురాయిని దాటించింది.

సుమారు రూ. 45 కోట్ల పరిమిత బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం.. కేవలం ఐదు రోజుల్లోనే రూ. 60 కోట్ల నికర లాభాన్ని అందించి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. నిర్మించిన వ్యయం కంటే 122 శాతం కంటే ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టిన ఈ సీక్వెల్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద రన్ అవుతున్న తీరు చూస్తుంటే మునుముందు మరిన్ని భారీ రికార్డులను తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.