Begin typing your search above and press return to search.

ఎపిసోడ్‌కు 2.5కోట్లు.. పారితోషికం వివాదంపై పాపుల‌ర్ న‌టి వివ‌ర‌ణ‌!

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన హాలీవుడ్ ఫాంటసీ డ్రామా సిరీస్ `గేమ్ ఆఫ్ థ్రోన్స్` సాధించిన విజయం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.

By:  Sivaji Kontham   |   30 May 2026 5:00 PM IST
ఎపిసోడ్‌కు 2.5కోట్లు.. పారితోషికం వివాదంపై పాపుల‌ర్ న‌టి వివ‌ర‌ణ‌!
X

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన హాలీవుడ్ ఫాంటసీ డ్రామా సిరీస్ `గేమ్ ఆఫ్ థ్రోన్స్` సాధించిన విజయం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈ సిరీస్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడు ఇందులో నటించిన ప్రధాన నటీనటులు ఎపిసోడ్‌కు ఏకంగా 3 లక్షల డాలర్లు (సుమారు 2.5 కోట్లకు పైగా) పారితోషికం తీసుకున్నారంటూ గత కొన్నేళ్లుగా ఇంటర్నెట్‌లో విపరీతంగా వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. తాజాగా ఈ లాంగ్-స్టాండింగ్ రూమర్లపై ఈ సిరీస్‌లో `మదర్ ఆఫ్ డ్రాగన్స్` డెనెరిస్ టార్గారియన్ పాత్ర పోషించిన ప్రముఖ నటి ఎమీలియా క్లార్క్ ఎట్టకేలకు స్పందించారు. ఈ ప్రచారంలో ఉన్న పారితోషికాల వెనుక ఉన్న అసలు నిజాన్ని బయటపెడుతూ నెట్టింట సాగుతున్న ఊహాగానాలకు తెరదించారు.




ప్రఖ్యాత‌ అంతర్జాతీయ పత్రిక `వెరైటీ`కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎమీలియా క్లార్క్ (39) మాట్లాడుతూ.. గత పదేళ్లకు పైగా ప్రచారంలో ఉన్న ఈ రెమ్యునరేషన్ వార్తలు పూర్తిగా అవాస్తవమని.. అవి చాలా అతిశయోక్తి మాట‌లు అని కొట్టి పారేసారు. మేము అంత పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించలేదు.. ఒకవేళ అది నిజమై ఉంటే.. నేను ఇప్పుడు కొన్ని పోర్షే కార్లలో తిరుగుతూ ఉండేదాన్ని.. ఒకసారి ఊహించుకోండి! అంటూ క్లార్క్ చాలా చమత్కారంగా సమాధానమిచ్చారు. అయితే రూమర్లలో ఉన్న సంఖ్య కంటే తమకు ఎంత తక్కువ అందిందనే విషయాన్ని కూడా పూర్తిగా వెల్లడించలేదు ఈ న‌టి., జార్జ్ ఆర్. ఆర్. మార్టిన్ నవల ఆధారంగా వచ్చిన ఈ సిరీస్ ద్వారా తనకు లభించిన డబ్బు తన తల్లిదండ్రుల మార్టిగేజ్ (ఇంటి రుణం) పూర్తిగా చెల్లించడానికి.. తమ కుటుంబానికి ఆర్థిక భద్రత ఇవ్వడానికి సరిపోయిందని పేర్కొన్నారు.

2011లో ప్రారంభమై 2019 వరకు మొత్తం ఎనిమిది సీజన్ల పాటు విజయవంతంగా సాగిన ఈ సిరీస్‌లో ఎమీలియా క్లార్క్‌తో పాటు కిట్ హారింగ్టన్, లీనా హీడే, సోఫీ టర్నర్, నికోలాజ్ కోస్టర్-వాల్డౌ త‌దిత‌రులు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సిరీస్ ముగింపుకు ముందే హాలీవుడ్‌లో తరచూ వినిపించే లింగ వివక్ష పై ఎమీలియా గతంలోనే క్లారిటీ ఇచ్చారు. 2018లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్ స్క్రీనింగ్ సందర్భంగా మాట్లాడుతూ.. ``ఇది నా మొదటి పెద్ద ప్రాజెక్ట్.. అయినా కేవలం నేను ఒక స్త్రీని అనే కారణంతో నా పారితోషికం విషయంలో ఎలాంటి వివక్ష జరగలేదు.. నా తోటి మేల్ స్టార్స్ తో సమానంగానే నాకు కూడా సమాన వేతనం లభించింది! అని సగర్వంగా ప్రకటించారు. కాగా అదే 2018లో నికోలాజ్ కోస్టర్-వాల్డౌ చట్టపరమైన వివాదాల తాలూకు కోర్టు పత్రాల ద్వారా... ఆయన ఆఖరి సీజన్‌లోని కనీసం ఆరు ఎపిసోడ్‌లకు గాను ఒక్కో ఎపిసోడ్‌కు 1.07 మిలియన్ డాలర్లు అందుకున్నట్లు బయటపడటం గమనార్హం.

ఈ ప్రతిష్టాత్మక సిరీస్‌లో డెనెరిస్ టార్గారియన్‌గా తన నటన గురించి ఎమీలియా మాట్లాడుతూ.. స్క్రిప్ట్ ప్రకారం ప్రతి సీజన్‌లో ఆ పాత్ర తీసుకున్న నిర్ణయాలను ఒక నటిగా తను పూర్తిగా అర్థం చేసుకుని.. ఆ పాత్రతో మమేకమై నటించానని.. అదే తన బాధ్యతగా భావించానని చెప్పారు. గేమ్ ఆఫ్ థ్రోన్స్ అందించిన అంతర్జాతీయ గుర్తింపు తర్వాత ఎమీలియా క్లార్క్ కేవలం ఒక్క తరహా పాత్రలకే పరిమితం కాకుండా విభిన్న శైలి చిత్రాలలో నటించి తన బహుముఖ ప్రజ్ఞను నిరూపించుకున్నారు. లెజెండరీ యాక్షన్ సిరీస్ `టెర్మినేటర్ జెనిసిస్`లో సారా కానర్ పాత్రలోనూ.. అలాగే `స్టార్ వార్స్` ప్రపంచంలోకి అడుగుపెట్టి `సోలో: ఎ స్టార్ వార్స్ స్టోరీ`లో ఖీరాగా ఎమిలియా క్లార్క్ నటించి మెప్పించారు.

యాక్షన్ చిత్రాలకే కాకుండా రొమాంటిక్ కామెడీ చిత్రాలలోనూ క్లార్క్ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. `లాస్ట్ క్రిస్మస్` అనే చిత్రంలో క్రిస్మస్ స్టోర్‌లో ఎల్ఫ్‌గా పనిచేసే కేట్ అనే గాయని పాత్రలో త‌న‌ నటన ప్రేక్షకులను అలరించింది. ఇవే కాకుండా అబోవ్ సస్పిషన్, సీక్రెట్ ఇన్వేషన్, క్రిమినల్, ది పాడ్ జనరేషన్ వంటి వైవిధ్యభరితమైన ప్రాజెక్టులతో హాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకుంటూ ముందుకు సాగుతున్నారు.