Begin typing your search above and press return to search.

వ్యాపారాల‌న్నిటికీ పెద్ద‌న్న‌య్య లాంటిది.. మ‌హిళా నిర్మాత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..

సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తుంటారు ఏక్తా క‌పూర్. బాలాజీ టెలీఫిలింస్ అధినేత్రిగా, మేటి సినీనిర్మాత‌గా ఏక్తా విజ‌య గాధ‌లు అన్నీ ఇన్నీ కావు.

By:  Sivaji Kontham   |   12 Oct 2026 6:00 PM IST
వ్యాపారాల‌న్నిటికీ పెద్ద‌న్న‌య్య లాంటిది.. మ‌హిళా నిర్మాత సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..
X

సంచ‌ల‌నాల‌కు కేరాఫ్ అడ్రెస్ గా నిలుస్తుంటారు ఏక్తా క‌పూర్. బాలాజీ టెలీఫిలింస్ అధినేత్రిగా, మేటి సినీనిర్మాత‌గా ఏక్తా విజ‌య గాధ‌లు అన్నీ ఇన్నీ కావు. సంప‌ద‌ల సృష్టిలో మేటి ఎంట‌ర్ ప్రెన్యూర్ గా సుప్ర‌సిద్ధులు. నిర్మాత ఏక్తా కపూర్ తాజాగా `ది రణ్‌వీర్ షో` (TRS) పాడ్‌కాస్ట్‌లో రియల్ ఎస్టేట్ పెట్టుబడులు, సంపద సృష్టిపై తన విలువైన అభిప్రాయాలను షేర్ చేసారు. రణ్‌వీర్ అల్లాబాడియా (బీర్‌బైసెప్స్)తో జరిగిన ఈ ఇంటర్వ్యూలో మ‌హిళా నిర్మాత ఏక్తా రియల్ ఎస్టేట్ ప్రాముఖ్యతను, స్థిరాస్తి పెట్టుబ‌డుల‌ వల్ల కలిగే ప్రయోజనాలను వివరంగా చర్చించారు.

తన తండ్రి, దిగ్గజ నటుడు జితేంద్ర కపూర్ తన 65వ ఏట రియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టారని ఏక్తా కపూర్ వెల్లడించారు. ప్రస్తుతం ఆయన వయసు 84 ఏళ్లు అని... ఏ వయసులోనైనా కొత్త వ్యాపారాన్ని లేదా అవకాశాన్ని ప్రారంభించవచ్చని నిరూపిస్తూ ఆయన యువతకు ఆదర్శంగా నిలిచారని ఏక్తా పేర్కొన్నారు.

జితేంద్ర కపూర్ ఒక సాధారణ `చాల్`(పూరి పాక‌లు) నేపథ్యం నుండి రావడం వల్ల.. కష్టపడి సంపాదించిన డబ్బును అనవసరంగా ఖర్చు చేయకుండా పొదుపు చేయడంపై ఎక్కువ దృష్టి పెట్టేవారని ఏక్తా తెలిపారు. మొదట ఫిక్స్డ్ డిపాజిట్ల ద్వారా మూలధనాన్ని సురక్షితం చేసుకుని.. ఆ తర్వాత భూమిపై పెట్టుబడులు పెట్టాలని ఆయన నేర్పించిన మధ్యతరగతి ఆర్థిక విధానాన్ని గుర్తుచేసుకున్నారు.

వ్యాపారాలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు లేదా నష్టాలు వచ్చినప్పుడు కూడా రియల్ ఎస్టేట్ ఎప్పుడూ ఒక బలమైన అండగా నిలుస్తుందని ఏక్తా కపూర్ అభిప్రాయపడ్డారు. రియల్ ఎస్టేట్‌ను వ్యాపారాలన్నింటికీ `పెద్ద అన్నయ్య` లాంటిదంటూ అభివర్ణించారు. ఇది అత్యంత సురక్షితమైన దీర్ఘకాలిక పెట్టుబడి రూపమని.. కష్టకాలంలో ఆపద్బాంధవలా మద్దతుగా నిలుస్తుందని చెప్పారు.

కేవలం ఆస్తి ధరల పెరుగుదలే కాకుండా.. సొంతిల్లు ఉండటం వల్ల ఆదా అయ్యే అద్దె మొత్తాన్ని కూడా ఆర్థిక ప్రయోజనంగా పరిగణించాలని ఏక్తా క‌పూర్ సూచించారు. భూమి విలువ పెరగడంతో పాటు.. ఐదేళ్ల కాలంలో పెట్టుబడులు రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుందని.. అద్దె రూపంలో ఆదా అయ్యే మొత్తం కూడా భారీ సంపదను నిర్మించడంలో సహాయపడుతుందని తెలిపారు. ఏక్తా క‌పూర్ ది డ‌ర్టీ పిక్చ‌ర్ సీక్వెల్ ని నిర్మించేందుకు రెడీ అవుతున్న సంగ‌తి తెలిసిందే. మొద‌టి భాగాన్ని తెలుగు న‌టి, డ్యాన్స‌ర్ సిల్కు స్మిత జీవిత‌క‌థ‌తో రూపొందించ‌గా, ఇప్పుడు మ‌రో న‌టి జీవిత‌క‌థ‌తో డ‌ర్టీ పిక్చ‌ర్ 2 తెర‌కెక్కించేందుకు ఏక్తా సిద్ధ‌మ‌వుతున్నారు. మ‌రోవైపు వెబ్ సిరీస్ లు, టెలివిజ‌న్ సిరీస్ ల‌తో నిరంత‌రం బిజీగా ఉన్నారు.