విద్యా బాలన్ ఐకానిక్ హిట్ 'ది డర్టీ పిక్చర్' పార్ట్ 2!
బాలీవుడ్ లో బోల్డ్ కంటెంట్ సంచలనం సృష్టించిన సీక్వెల్స్ జాబితాలోకి మరో ఐకానిక్ హిట్ సినిమా చేరబోతోంది.
By: Srikanth Kontham | 12 Oct 2026 1:00 PM ISTబాలీవుడ్ లో బోల్డ్ కంటెంట్ సంచలనం సృష్టించిన సీక్వెల్స్ జాబితాలోకి మరో ఐకానిక్ హిట్ సినిమా చేరబోతోంది. విద్యా బాలన్ ప్రధాన పాత్రలో నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ `ది డర్టీ పిక్చర్` విడుదలై 15 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా నిర్మాత ఏక్తా కపూర్ ఆ చిత్రానికి సీక్వెల్‌ను అధికారికంగా ప్రకటించారు. `ది డర్టీ పిక్చర్ 2`రూపకల్పనకు సంబంధించిన పనులు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, ప్రేక్షకులకు చెప్పడానికి సరికొత్త కథ సిద్ధంగా ఉందని వెల్లడించారు.
`నేను ప్లాన్ చేస్తున్న అతిపెద్ద ప్రాజెక్టులలో `ది డర్టీ పిక్చర్ 2` ఒకటి. సరిగ్గా 15 ఏళ్ల తర్వాత ఈ సీక్వెల్ చేయడానికి పూనుకున్నాను. ఎందుకంటే? ఈసారి వెండితెరపై ఆవిష్కరించడానికి బలమైన, ప్రాధాన్యత కలిగిన కథ నా వద్ద ఉందని నమ్ముతున్నాను` అని ఏక్తా కపూర్ వ్యాఖ్యానించారు. 2011లో మיలన్ లుథ్రియా దర్శకత్వంలో తెరకెక్కిన `ది డర్టీ పిక్చర్స` చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు కలెక్షన్లు సాధించడమే కాకుండా విమర్శకుల ప్రశంసలతో ఐకానిక్ మూవీగా నిలిచింది.
దక్షిణాది నటి సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో విద్యా బాలన్ నటించగా, నసీరుద్దీన్ షా, ఇమ్రాన్ హాష్మీ, తుషార్ కపూర్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాలో నటనకు గాను విద్యా బాలన్‌కు ఉత్తమ నటిగా జాతీయ ఫిల్మ్ అవార్డు కూడా వరించింది. సిల్క్ స్మిత పాత్ర గురించి, సినిమా మూలసూత్రం గురించి ఏక్తా కపూర్ మరోసారి గుర్తు చేసుకున్నారు.
`ఆ సినిమాలో సిల్క్ స్మితను నేను ఎప్పుడూ ఒక బాధితురాలిగా చూడలేదు. సమాజం ఆమె సెక్సువాలిటీపై మోపిన నిందలను, ఆంక్షలను ఎదురించి ఆత్మగౌరవంతో జీవించిన మహిళగా చూశాను. సెక్సువాలిటీ అనేది వ్యక్తిగత ఎంపిక. తన స్వేచ్ఛను ఆస్వాదించిన మహిళగా ఆ పాత్రను మలిచాం. అందుకే ఆ చిత్రం అంత పెద్ద హిట్ అయిందని` పేర్కొ న్నారు.
రాబోయే సీక్వెల్ `ది డర్టీ పిక్చర్ 2` కూడా మొదటి భాగం తరహాలోనే ఓ ప్రముఖ మహిళ జీవితం ..ఆమె ఎంచుకున్న మార్గం చుట్టూ తిరుగుతుందని ఏక్తా కపూర్ స్పష్టం చేశారు. అయితే ఈ సీక్వెల్ ఏ నటి లేదా ఏ ప్రముఖ మహిళ జీవిత విశేషాల ఆధారంగా తెరకెక్కుతోంది అనే విషయాన్ని మాత్రం గోప్యంగా ఉంచారు. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన నటీనటులు, దర్శకుడు , ఇతర వివరాలను అధికారికంగా ప్రకటిస్తామన్నారు.
స్త్రీల స్వేచ్ఛ, నైతిక సరిహద్దులు, వినోద పరిశ్రమలోని ఆంతరంగిక పోరాటాల నేపథ్యంగా 15 ఏళ్ల క్రితం వచ్చిన `ది డర్టీ పిక్చర్` భారతీయ సినిమా ధోరణినే మార్చేసింది. తాజాగా మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఏక్తా కపూర్ ఈ ఫ్రాంచైజీని పునరుద్ధరించడానికి సిద్ధమవడంతో ఈసారి ఏ మహిళా ఐకాన్ జీవితాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తారోనని సినీ ప్రియులు, బాలీవుడ్ వర్గాలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి.
