Begin typing your search above and press return to search.

అతి విశ్వాసం స్టైల్ కాదు మూర్ఖత్వం!

బాలీవుడ్ లో అగ్ర‌గామి నిర్మాత‌గా వెలిగిపోతున్న‌ ఏక్తా కపూర్ తన సినీ , టెలివిజన్ ప్రయాణంలో ఎదుర్కొన్న హెచ్చుతగ్గుల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

By:  Srikanth Kontham   |   12 Oct 2026 2:38 PM IST
అతి విశ్వాసం స్టైల్ కాదు మూర్ఖత్వం!
X

బాలీవుడ్ లో అగ్ర‌గామి నిర్మాత‌గా వెలిగిపోతున్న‌ ఏక్తా కపూర్ తన సినీ , టెలివిజన్ ప్రయాణంలో ఎదుర్కొన్న హెచ్చుతగ్గుల గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. వినోద రంగంలో మూడు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రముఖ యూట్యూబర్ రణ్‌వీర్ అల్లాబాదియాతో జరిపిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడారు. తన కెరీర్‌లో 2008వ సంవత్సరం వృత్తిపరంగా అత్యంత దారుణమైన సంవత్సరమని, ఆ సమయంలో తీవ్రమైన ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నానని ఏక్తా ఓపెన్‌గా వెల్లడించారు.

2008లో తాను తీసుకున్న నిర్ణయాలు, ప్రాజెక్టులు ఏవీ సరిగ్గా సాగలేదని ఏక్తా కపూర్ వ్యాఖ్యానించారు. వృత్తిపరంగా ఎదురైన ఆ విఫలాలు మానసికంగా కూడా ఎంతో కృంగదీశాయని పేర్కొన్నారు. అయితే మానసిక ఆరోగ్యం పరంగా చూస్తే కోవిడ్-19 సమయం తన జీవితంలో అత్యంత కష్టతరమైనదని, ఆ సమయంలో ఒకవైపు సరోగసీ ద్వారా తల్లిగా మారిన తర్వాత ఎదురైన మార్పులు, మరోవైపు చుట్టూ చూసిన పరిస్థితులు తనను తీవ్రంగా ప్రభావితం చేశాయని తెలిపారు. కానీ ప్రొఫెషనల్ కెరీర్ విషయంలో మాత్రం 2008 ఏడాది అత్యంత కఠినమైనదని స్పష్టం చేశారు.

తన పతనానికి , ఆ సమయంలో ఎదురైన ఎదురుదెబ్బలకు గల కారణాలను కూడా ఏక్తా విశ్లేషించారు. `అతివిశ్వాసం అనేది స్టైల్ లేదా స్వాగ్ కాదు. అది కేవలం మూర్ఖత్వం` అని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆ సమయంలో తనకు అన్నీ తెలుసనే భ్రమలో ఉన్నానని, పక్కాగా కాగితాలపై అగ్రిమెంట్లు లేకుండా పనులు చేయడం, ప్రొఫెషనల్స్‌తో సంబంధాలను సరిగ్గా నిర్వహించకపోవడం వంటి పొరపాట్లు చేశానని అంగీకరించారు. విజయాల కంటే వ్యక్తులతో నిర్మించుకునే సంబంధాలు ఎంతో ముఖ్యమని ఆ అనుభవం నేర్పినట్లు వెల్లడించారు.

ఆ కఠిన సమయం తనకు నమ్రత , టీమ్‌వర్క్ , వృత్తిపరమైన బాధ్యతలను ఎలా నిర్వహించాలో నేర్పించిందని ఏక్తా తెలిపారు. ఆ క్రమంలోనే పరిశ్రమలోని ప్రముఖులు తనకు ఎంతో మార్గదర్శకత్వం వహించారని చెప్పారు. ముఖ్యంగా స్టార్ ఇండియా మాజీ అధిపతి ఉదయ్ శంకర్ వంటి దిగ్గజాలను కలవడం ద్వారా వర్క్ ఎథిక్స్ నేర్చుకున్నానని, గౌరవం అనేది పరస్పరం ఇచ్చిపుచ్చుకునేదని గ్రహించానని పేర్కొన్నారు. విజయాలు, ఓటములు మారుతుంటాయి కానీ క్రెడిబిలిటీ, పనిలో నిజాయితీ ఎప్పటికీ పోకూడదని వ్యాఖ్యానించారు.

బుల్లితెర చరిత్రను మలుపు తిప్పిన అనేక సూపర్‌హిట్ సీరియల్స్‌కు ఏక్తా కపూర్ ప్రాణం పోశారు. `క్యుంకీ సాస్ భీ కభీ బహూ థీ`, `కహానీ ఘర్ ఘర్ కీ`, `కసౌటీ జిందగీ కే`, `పవిత్ర రిష్తా` వంటి సంచలన ధారావాహికలు బాలాజీ టెలిఫిల్మ్స్ బ్యానర్‌పైనే రూపుదిద్దుకున్నాయి. టెలివిజన్ రంగంలోనే కాకుండా బాలీవుడ్ సినిమాలు, డిజిటల్ ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లలో కూడా ఏక్తా క‌పూర్ తనదైన ముద్ర వేసి ట్రెండ్ సెట్టర్‌గా నిలిచారు.

ఏక్తా కపూర్ నిర్మించిన రియాలిటీ షో `లాక్ అప్` పెద్ద ఎత్తున ప్రేక్షకాదరణ పొందిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సంచలన రియాలిటీ షో రెండవ సీజన్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. పతనం నుంచి పాఠాలు నేర్చుకుని తిరిగి నిలబడిన తీరు, నేటి తరం యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్స్ క్రియేటర్లకు ఏక్తా జ‌ర్నీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని చెప్పొచ్చు.