2026 ఈద్‌కి టాప్ హీరోల క్లాష్
ఈసారి ఈద్ వచ్చి వెళ్లింది. బాలీవుడ్ లో అంతగా చెప్పుకోవడానికేమీ లేదు. కానీ 2026 ఈద్ కానుకగా రెండు భారీ సినిమాలు విడుదలకు ప్లాన్ చేస్తుండడం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది.
By: Sivaji Kontham | 7 Sept 2025 3:00 PM ISTఈసారి ఈద్ వచ్చి వెళ్లింది. బాలీవుడ్ లో అంతగా చెప్పుకోవడానికేమీ లేదు. కానీ 2026 ఈద్ కానుకగా రెండు భారీ సినిమాలు విడుదలకు ప్లాన్ చేస్తుండడం సర్వత్రా ఆసక్తిని కలిగిస్తోంది. ఈసారి బరిలో అజయ్ దేవగన్ ధమాల్ 4, రణబీర్ కపూర్- విక్కీ కౌశల్ ల `లవ్ అండ్ వార్` విడుదలకు సిద్ధమవుతున్నాయి.
నిజానికి దేవగన్ మునుపటి ఫ్రాంఛైజీ ఉత్సుకతను ఇప్పుడు కూడా కొనసాగించగలడా? ఫ్రాంఛైజీలో మొదటి సినిమా `ధమాల్` బంపర్ హిట్టు. ఇప్పటికీ మీమ్స్ రూపంలో ధమాల్ కి గుర్తింపు ఉంది. కానీ ఆ తర్వాత వచ్చిన రెండు సినిమాలు మొదటి భాగం అంత పెద్ద హిట్లు కావు. కానీ ఫర్వాలేదు. అందుకే చాలా గ్యాప్ తర్వాత ధమాల్ ఫ్రాంఛైజీలో నాలుగో సినిమాని ప్లాన్ చేస్తుండడంతో మునుపటి హైప్ ఉంటుందా? అన్నది ప్రస్తుతానికి సందిగ్ధతను కలిగిస్తోంది.
ధమాల్ చిత్రంలో అన్ని పాత్రలను ఇటీవలే ధమాల్ టైమ్స్ పేరుతో పరిచయం చేసారు. ఈసారి ఫ్రాంఛైజీ నటులతో పాటు, కొత్తతరం కూడా టీమ్ లో చేరింది. తారాగణంలో సంజయ్ మిశ్రా, రవి కిషన్, ఉపేంద్ర లిమాయే, సంజీదా షేక్, అంజలి దినేష్ ఆనంద్ కూడా చేరారు. ధమాల్ బంపర్ హిట్ కొట్టడానికి కారకుడైన దర్శకుడు ఇంద్రకుమార్ ఇప్పుడు ఈ నాలుగో భాగాన్ని కూడా మొదటి పార్ట్ తరహాలో అద్బుతమైన కామెడీతో తెరకెక్కిస్తానని ప్రామిస్ చేస్తున్నారు.
అయితే వచ్చే `ఈద్` పండక్కి రణబీర్ కపూర్- విక్కీ కౌశల్- ఆలియా ప్రధాన పాత్రల్లో కళాత్మక చిత్రాల దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న `లవ్ అండ్ వార్` పోటీబరిలో నిలువనుంది. ఇది అద్బుతమైన ముక్కోణ ప్రేమకథా చిత్రం. దానికి తోడు వార్ నేపథ్యంలో రక్తి కట్టించబోతోందని టాక్ ఉంది. అందువల్ల ఈ భారీ చిత్రంతో `ధమాల్ 4` పోటీపడి రేసులో ఏమేరకు దూసుకెళుతుందో వేచి చూడాలి. దశాబ్దం క్రితం రణబీర్ కపూర్ `ఏ దిల్ హై ముష్కిల్` అజయ్ దేవగన్ `శివాయ్`ను బాక్సాఫీస్ వద్ద రేసులో వెనక్కి నెట్టింది. కానీ ఈసారి ఇంద్రకుమార్ భారీ హైప్ తో ధమాల్ నాలుగో భాగాన్ని ప్లాన్ చేస్తుండడంతో ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే.
