Begin typing your search above and press return to search.

ట్రెండింగ్: ఇక్క‌డ గ‌రివిడి ల‌క్ష్మి.. అక్క‌డ ఈత ల‌క్ష్మి

మహారాష్ట్రకు చెందిన ప్రముఖ తమాషా - లావ‌ణీ కళాకారిణి విఠాబాయి భౌ మాంగ్ నారాయణ్‌గాంకర్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ బ‌యోపిక్ సినిమాను తెరకెక్కించారు.

By:  Sivaji Kontham   |   30 Oct 2026 10:42 PM IST
ట్రెండింగ్: ఇక్క‌డ గ‌రివిడి ల‌క్ష్మి.. అక్క‌డ ఈత ల‌క్ష్మి
X

దక్షిణాదిన ఎంతో మంది జానపద కళాకారుల జీవిత కథలు వెండితెరపై ఆవిష్కృతమవుతున్న తరుణంలో, ఇటీవల ఉత్తరాంధ్ర పాపుల‌ర్ బుర్రకథ కళాకారిణి జీవిత ఆధారంగా తెరకెక్కిన `గరివిడి లక్ష్మి` చిత్రం విడుదలై విమర్శకుల నుండి విశేష ప్రశంసలు అందుకుంది. ఈ చిత్రంలో టైటిల్ పాత్రను పోషించిన ఆనందిని తన అద్భుత నటనతో ప్రేక్షకులను అలరించడమే కాకుండా కళాకారుల జీవన పోరాటాన్ని కళ్లకు కట్టింది. ఇప్పుడు ఇదే తరహాలో ఉత్తరాదిన రంగుల వేదికపై డ్రామా, తమాషా, లావ‌ణీ కళారంగంలో రాణించిన ఒక దిగ్గజ కళాకారిణి జీవిత కథ ఆధారంగా `ఈత` చిత్రం రూపుదిద్దుకుని విడుదల ముస్తాబవుతోంది.

మహారాష్ట్రకు చెందిన ప్రముఖ తమాషా - లావ‌ణీ కళాకారిణి విఠాబాయి భౌ మాంగ్ నారాయణ్‌గాంకర్ జీవిత చరిత్ర ఆధారంగా ఈ బ‌యోపిక్ సినిమాను తెరకెక్కించారు. జానపద కళారంగానికి ఆమె అందించిన సేవలు, వేదికపై ఆమె ప్రదర్శించిన నటన... జీవితంలో ఎదుర్కొన్న ఒడిదొడుకులు.. పొందిన కీర్తి ప్రతిష్ఠలను ఆవిష్కరిస్తూ లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని మలిచారు. ఇటీవల విడుదలైన `ఈత` అధికారిక ట్రైలర్ నెట్టింట శరవేగంగా దూసుకెళ్తూ.. అత్యద్భుతమైన విజ్యువల్ గ్రాండియారిటీ.. భావోద్వేగాలతో ప్రేక్షకులను కట్టిపడేస్తోంది.

ఈ చిత్రంలో `సాహో` ఫేమ్ శ్రద్ధా కపూర్ ప్రధాన విఠాబాయి పాత్రను పోషించగా, రణ్‌దీప్ హుడా అన్నా సావంత్ మర్చంట్ పాత్రలో కనిపిస్తున్నారు. ట్రైలర్‌లో శ్రద్ధా కపూర్ అభినయం, మహారాష్ట్ర సాంప్రదాయ `నవవారి` చీరకట్టులో ఆమె చూపిన హావభావాలు, పవర్‌ఫుల్ డైలాగ్ డెలివరీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. పాత్రలో శ్రద్ధా పూర్తిగా లీనమై నటించిందని, ఈ సినిమాతో ఆమెకు ఖచ్చితంగా జాతీయ అవార్డు వస్తుందని సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.

మ్యాడాక్ ఫిల్మ్స్ - కథ్‌పుట్లీ క్రియేషన్స్ పతాకాలపై దినేష్ విజన్, లక్ష్మణ్ ఉటేకర్, కరిష్మా శర్మ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి ప్రసిద్ధ సంగీత ద్వయం అజయ్-అతుల్ అందించిన నేపథ్య సంగీతం ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ప్రతి సన్నివేశంలోనూ మైలుకూతలు తెప్పించేలా ఉన్న వారి సంగీతం సినిమా స్థాయిని మరింత పెంచిందని రీసౌండింగ్ రెస్పాన్స్ వస్తోంది. శ్రద్ధా కపూర్, మ్యాడాక్ ఫిల్మ్స్, లక్ష్మణ్ ఉటేకర్ , అజయ్-అతుల్ కాంబినేషన్ బాక్సాఫీస్ వద్ద మరో బ్లాక్‌బస్టర్ హిట్‌ను ఖాయం చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

రణ్‌దీప్ హుడాతో పాటు మహమ్మద్ జీషాన్ అయ్యూబ్, సిద్ధార్థ్ జాధవ్, అనంత్ జోషి, నానా పటేకర్, ఉల్కా గుప్తా వంటి బలమైన తారాగణం నటిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 4 న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. దక్షిణాన `గరివిడి లక్ష్మి` జానపద కళాకారుల సత్తాను చాటిచెప్పగా.. ఉత్తరాన అదే స్థాయిలో `ఈత- విఠాబాయి కథ`తో ప్రేక్షకాదరణ పొందుతుందని సినీ ప్రియులు భావిస్తున్నారు. ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్‌లో నిలిచిన ఈ ట్రైలర్ సినిమాపై ఉన్న అంచనాలను రెట్టింపు చేసింది.