Begin typing your search above and press return to search.

ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..

‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ నుంచి బతుకమ్మ లిరికల్ వీడియోను దర్శకుడు తరుణ్ భాస్కర్ విడుదల చేశారు. చంద్రబోస్ సాహిత్యానికి వివేక్ సాగర్ సంగీతం అందించగా, శ్రేయా ఘోషల్ ఆలపించారు. శివాత్మిక రాజశేఖర్ సంప్రదాయ దుస్తుల్లో వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. విశ్వక్ సేన్ నటిస్తున్న ఈ సీక్వెల్ నవంబర్ 19న విడుదల కానుంది.

By:  M Prashanth   |   13 Nov 2026 12:02 AM IST
ENE 2లో ఈ వైబ్ కూడా ఉందా..
X

ఈ నగరానికి ఏమైంది అనగానే కుర్రాళ్ల గ్యాంగ్ అల్లరి, గోవా ట్రిప్పులు, బీర్లు, బ్రేకప్ బాధలే గుర్తుకొస్తాయి. కానీ ఆ సినిమా సీక్వెల్ లో ఒక కలర్ ఫుల్ పండగ వైబ్ కూడా ఉంటుందని ఎవరూ ఊహించి ఉండరు. దర్శకుడు తరుణ్ భాస్కర్ లేటెస్ట్ గా ఈ నగరానికి ఏమైంది రిపీట్ నుంచి బతుకమ్మ లిరికల్ వీడియోను వదిలి అందరికీ సర్ ప్రైజ్ ఇచ్చారు. ఇటీవల వచ్చిన మిత్వా పాట స్నేహం తాలూకు ఎమోషన్ ను చూపిస్తే, ఈ రెండో పాట సినిమాలో ఉన్న మరో కొత్త కోణాన్ని హైలెట్ చేసింది.

తెలంగాణ సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మ వేడుకను నేటి తరం ఆలోచనలకు తగ్గట్లుగా రచయిత చంద్రబోస్ హార్ట్ టచింగ్ గా రాశారు. తనకు కాబోయే వాడు ఆరడుగుల అందగాడు కాకపోయినా పర్వాలేదని, తనతో కలిసి నడుస్తూ తనకన్నా ఎక్కువగా ప్రేమించే వాడు దొరికితే చాలని ఒక అమ్మాయి బతుకమ్మకు చెప్పుకునే తీరు సరదాగా ఉంది. ఆచారాల పేరుతో ఆడపిల్లల కలలకు సంకెళ్లు వేయొద్దంటూ సాగే పదాలు పాటకు మంచి అర్థాన్నిచ్చాయి.

సంగీత దర్శకుడు వివేక్ సాగర్ ఎప్పటిలాగే తన ఫ్యూజన్ ప్రయోగాలతో ఈ జానపద గీతానికి సరికొత్త టచ్ ఇచ్చారు. సంప్రదాయ వాద్యాలకు వెస్ట్రన్ బీట్స్ జత చేసి పాటను ఎంతో ఉత్సాహంగా మార్చారు. ప్రియ పిడపర్తి ఆలపించిన సాకీతో సంప్రదాయబద్ధంగా మొదలయ్యే ఈ పాటకు, శ్రేయా ఘోషల్ తన మధురమైన గాత్రంతో మంచి జోష్ తీసుకొచ్చారు. మధ్యలో వచ్చే తగిలితే పీపీపీ అనే హుక్ బీట్ వినగానే త్వరగా కనెక్ట్ అవుతుంది.

లిరికల్ వీడియోలో విజువల్స్ చాలా ఫ్రెష్ గా కుదిరాయి. చీరలో శివాత్మిక రాజశేఖర్ కూడా క్యూట్ గా హైలెట్ అయ్యారు. పూల అలంకరణలతో నిండిన ఇంటి ఆవరణలో మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ, కళ్లద్దాలు పెట్టుకుని ఆమె వేసిన స్టెప్పులు ఆకట్టుకున్నాయి. ఈశ్వర్ పెంటి కొరియోగ్రఫీ పండగ సందడికి తగినట్లుగా సహజంగా ఉంది.

మొదటి భాగంలో కామెడీ కిక్ ఇచ్చిన విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను గ్యాంగ్ తో పాటు ఈసారి కార్తీక్ పాత్రలో శ్రీనాథ్ మాగంటి కనిపించనున్నారు. అనీషా ఆంబ్రోస్, ప్రియదర్శిని రామ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. థాయ్ లాండ్ నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని ఎస్ ఒరిజినల్స్, రూట్ నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి నిర్మించారు.

ENE బాయ్స్ హంగామాతో పాటు ఇలాంటి ఆహ్లాదకరమైన పండగ పాట కూడా ఉండటం సినిమాకు ప్లస్ అయ్యేలా కనిపిస్తోంది. వినసొంపైన సంగీతం, ఆకట్టుకునే విజువల్స్ తో బతుకమ్మ పాట మెప్పిస్తోంది. ఇప్పటికే యూత్ లో మంచి క్రేజ్ ఉన్న ఈ సీక్వెల్ నవంబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది. మరి ఈ స్నేహితుల గ్యాంగ్ ఈసారి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి వినోదాన్ని పంచుతుందో చూడాలి.