Begin typing your search above and press return to search.

మెగాస్టార్ ఆఫీస్ పై ఈడీ సోదాలు!

తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మెగాస్టార్ ఆఫీస్ పై సోదాలు నిర్వహించడం ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే..

By:  Madhu Reddy   |   8 Oct 2025 12:24 PM IST
మెగాస్టార్ ఆఫీస్ పై ఈడీ సోదాలు!
X

తాజాగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు మెగాస్టార్ ఆఫీస్ పై సోదాలు నిర్వహించడం ఇండస్ట్రీలో సంచలనం సృష్టిస్తోంది. అసలు విషయంలోకి వెళ్తే.. మలయాళం మెగాస్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న మమ్ముట్టి ఆఫీసులో ఈడీ అధికారులు తాజాగా సోదాలు నిర్వహించారు. తాజాగా చెన్నైలోని మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కి చెందిన సినిమా నిర్మాణ సంస్థ వేఫేర్ ఫిలిమ్స్ పై అక్టోబర్ 8 బుధవారం నాడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు దాడి చేశారు. మొత్తం ఎనిమిది మంది ఈడీ అధికారులు, సిఆర్పిఎఫ్ (CRPF) సిబ్బందితో కలిసి ఈ సోదాలు చేపట్టారు.. లగ్జరీ వాహనాల అక్రమ దిగుమతి , విదేశీ కరెన్సీ లావాదేవీల దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.

మరోవైపు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ తో పాటూ అమిత్ చకల్కల్ ఇళ్లపై దాదాపు 8 మంది ఈడి అధికారులు, సిబ్బంది సోదాలు చేస్తున్నారు. అంతేకాదు కేరళ, తమిళనాడులోని మొత్తం 17 ప్రాంతాలలో ఈ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా ఎర్నాకులం, త్రిస్సూర్ , కోయంబత్తూరు, కోజికోడు, మలప్పురం, కొట్టాయం వంటి ప్రాంతాలలోని వ్యాపార కేంద్రాలు, వాహన యజమానుల ఇళ్లల్లో కూడా ఈడి అధికారులు తనిఖీలు చేపట్టారు.

ఇకపోతే మొదటి దశ దర్యాప్తులో భాగంగా కోయంబత్తూర్ లోని ఒక గ్రూపు నకిలీ పత్రాలతో లగ్జరీ వాహనాలను రిజిస్టర్ చేసి.. వాటిని తక్కువ ధరలకే సినీ తారలకు విక్రయించినట్లు తేలిందని.. వారు ఇండియన్ ఆర్మీ, అమెరికా ఎంబసీ, విదేశాంగ మంత్రిత్వ శాఖకు సంబంధించిన వ్యక్తులము అని చెప్పి, వాహన రిజిస్ట్రేషన్లు పొందారని అటు అధికారులు కూడా వెల్లడించారు. దీనికి తోడు ప్రస్తుతం మమ్ముట్టి ఫిలిం ప్రొడక్షన్ కంపెనీ పై ఈడీ దాడులు నిర్వహిస్తుండడంతో సినీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. అధికారులు లగ్జరీకారుల అక్రమ రవాణా, విదేశీ డబ్బు లావాదేవీలపై మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఇటీవలే దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ నివాసాలలో కష్టమ్ అధికారులు కూడా సోదాలు నిర్వహించిన విషయం తెలిసిందే. లగ్జరీ కార్ల స్మగ్లింగ్ ఆరోపణలకు సంబంధించి నమోదైన కేసు పైనే కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేశారు." ఆపరేషన్ నమకూర్" పేరుతో సోదాలు నిర్వహించారు. ముఖ్యంగా కొచ్చి తిరువనంతపురంలో ఉన్న పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంటితోపాటు పనంపిల్లి నగర్ లోని దుల్కర్ సల్మాన్ నివాసానికి వెళ్లి అక్కడ సోదాలు నిర్వహించడం జరిగింది.