Begin typing your search above and press return to search.

స్టార్ క‌పుల్ మోసంపై ద‌ర్యాప్తు మ‌రింత లోతుగా?

ఎన్‌ఫోర్స్ మెంట్ ద‌ర్యాప్తు ప‌రిధిలోకి వ‌చ్చిన త‌ర్వాత కేసు నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం అంత సుల‌వు కాదు.

By:  Sivaji Kontham   |   18 Dec 2025 3:00 AM IST
స్టార్ క‌పుల్ మోసంపై ద‌ర్యాప్తు మ‌రింత లోతుగా?
X

ఎన్‌ఫోర్స్ మెంట్ ద‌ర్యాప్తు ప‌రిధిలోకి వ‌చ్చిన త‌ర్వాత కేసు నుంచి బ‌య‌ట‌ప‌డ‌టం అంత సుల‌వు కాదు. నిజాలు నిగ్గు తేలేవ‌ర‌కూ ద‌ర్యాప్తు సంస్థ వ‌దిలిపెట్ట‌దు. త‌ప్పు జ‌రిగితే దాని తీగ ప‌ట్టుకుని డొంకంతా క‌ద‌ల్చ‌డం ఈడీకి అల‌వాటు. చూస్తుంటే శిల్పాశెట్టి- రాజ్ కుంద్రా 60కోట్ల మోసం కేసులో ఈడీ డొంకంతా క‌దుపుతోంది. తీగ ప‌ట్టుకుని దానిని వెంబ‌డిస్తూ, మ‌రింత డెప్త్ గా విచారిస్తున్న‌ట్టు తెలుస్తోంది.

హ‌వాలా మార్గాల్లో సొమ్ములు ఎలా త‌ర‌లి వెళ్లాయి? అనే కోణంలో ఈ దంప‌తుల‌పై ముంబై ఆర్థిక నేరాల విభాగం (EOW) స‌హ‌కారంతో ఈడీ ద‌ర్యాప్తును ముమ్మ‌రం చేస్తోంద‌ని తొలి నుంచి క‌థ‌నాలు వ‌స్తూనే ఉన్నాయి. ఇప్పుడు దీనికి ఆస్కారం క‌ల్పిస్తూ, ఈడీ త‌న త‌దుప‌రి చ‌ర్య‌కు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు జాతీయ మీడియాలో క‌థ‌నాలొస్తున్నాయి. ప్ర‌ముఖ వ్యాపారి దీపక్ కొఠారి నుంచి 60 కోట్లు అప్పు తీసుకుని, అప్పుపై లాభాల చెల్లింపు- భాగ‌స్వామ్యం ఆశ‌లు నింపాక వ్యాపారిని నిండా ముంచేసార‌నే ఆరోప‌ణ‌ల‌తో ఈ గొడ‌వ మొద‌లైంది. బెస్ట్ డీల్ టీవీ ప్రై.లిమిటెడ్‌లో పెట్టుబ‌డి- భాగ‌స్వామ్యం పేరుతో కొఠారి నుంచి డ‌బ్బును అప్పుగా తీసుకున్నారు శెట్టి- కుంద్రా దంప‌తులు. కానీ ఆ ధ‌నాన్ని దుర్వినియోగం చేసార‌ని, సొంత ప్ర‌యోజ‌నాల కోసం ఉప‌యోగించార‌ని, దొడ్డిదారిన‌ విదేశాల‌కు త‌ర‌లించార‌ని కూడా కొఠారి ఆరోపించారు. ఇప్ప‌టికే ఈ కేసులో ఎఫ్‌.ఐ.ఆర్ న‌మోదైంది. పోలీసులు - ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు దీనిపై లోతుగా ద‌ర్యాప్తును కొన‌సాగిస్తున్నారు.

అయితే రాజ్ కుంద్రా త‌న తండ్రి ప్రాణాంత‌క వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడ‌ని చికిత్సకు స‌హ‌క‌రించేందుకు త‌న అవ‌స‌రం ఉన్నందున విదేశాల‌కు వెళ్లాల్సి ఉంద‌ని అర్జీ పెట్టుకున్నా, కోర్టు క‌నిక‌రించ‌లేదు. ఒక‌వేళ దేశం దాటి బ‌య‌ట‌కు వెళ్లాలంటే లుకౌట్ నోటీస్ నియ‌మాల‌ ప్ర‌కారం శిల్పా- కుంద్రా దంప‌తుల‌కు సాధ్య‌ప‌డ‌దు. త‌క్ష‌ణం వెళ్లి తీరాలి అనుకుంటే 60 కోట్లు బ్యాంక్ డిపాజిట్ ని కోర్టుకు ద‌ఖ‌లుప‌రిచి వెళ్లాలి. అలా కాని ప‌క్షంలో దేశం దాటి వెళ్ల‌డానికి అనుమ‌తించేది లేద‌ని కోర్టు తేల్చి చెప్పింది. ఈ దంప‌తులు దుర్వినియోగం చేసిన సొమ్ముల్ని స్వాధీన‌ప‌రుచుకోవాల‌ని, కుంద్రా ఆస్తుల‌ను జ‌ప్తు చేయాల‌ని కొఠారీ కోరుతున్నాడు. ప్ర‌స్తుతం ఈ కేసులో విచార‌ణ ముమ్మ‌రంగా సాగుతోంది.

గ‌త వివాదాల‌కు ఇది కొస‌రు..

వ్యాపారి కం న‌టుడు రాజ్ కుంద్రా చాలా కాలంగా మీడియా హెడ్ లైన్స్ లో నిలుస్తున్నారు. అత‌డు త‌న బంధువుల‌తో క‌లిసి విదేశాల నుంచి నీలిచిత్రాల యాప్ లను నిర్వ‌హిస్తున్నాడ‌ని ఇంత‌కుముందు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఆ త‌ర్వాత కుంద్రాను అరెస్ట్ చేసారు. ఆ స‌మ‌యంలో శిల్పాశెట్టి త‌న భ‌ర్త‌కు బ‌ల‌మైన అండ‌గా నిలిచింది. కుంద్రా జైలు నుంచి విడుద‌ల‌య్యాక భార్య‌, పిల్ల‌లతో తిరిగి జీవితాన్ని కొన‌సాగిస్తున్నారు. ఇంత‌కుముందు త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌ను తిప్పి కొడుతూ ఒక సినిమాలో న‌టించే ప్ర‌య‌త్నం కూడా చేసాడు. ఇంత‌లోనే దీపక్ కొఠారి అనే వ్యాపారి 60 కోట్ల మోసం కేసులో శిల్పాశెట్టి- కుంద్రాల‌ను ఇరికించ‌డంతో ఇప్పుడు కోర్టుల ప‌రిధిలో న్యాయ‌పోరాటం చేయాల్సి వ‌స్తోంది.