ఐబొమ్మ రవి 20కోట్ల లావాదేవీలు.. ED రంగ ప్రవేశం
ఐబొమ్మ రవి ఇమ్మడి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తవ్వే కొద్దీ ఈ కేసులో నిజాలు నిర్ఘాంతపోయేలా చేస్తున్నాయి.
By: Sivaji Kontham | 18 Nov 2025 7:57 PM ISTఐబొమ్మ రవి ఇమ్మడి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తవ్వే కొద్దీ ఈ కేసులో నిజాలు నిర్ఘాంతపోయేలా చేస్తున్నాయి. కూపకట్ పల్లిలో సీసీఎస్ పోలీసులు అతడిని అరెస్ట్ చేసిన తర్వాత బ్యాంక్ ఖాతాలోని 3.5 కోట్ల నిధిని అధికారులు ఫ్రీజ్ చేసారు. అతడి ల్యాప్ టాప్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని కేసును వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు.
ముఖ్యంగా ఐబొమ్మ రవికి ఆదాయం ఎలా సమకూరింది? అతడి బ్యాంక్ ఖాతాల నుంచి ఓవర్సీస్ కి డబ్బు ఎలా ప్రవహించింది? కోట్లాది రూపాయల ప్రవాహం వెనక ఎవరెవరు ఉన్నారు? అనే వివరాలను సీసీఎస్ పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇక ఈ కేసుతో ముడిపడి ఉన్న బెట్టింగ్ యాప్ ల వ్యవహారాన్ని కూడా పోలీసులు నిగ్గు తేల్చనున్నారు. దీనికోసం ఇప్పటికే ఈడీతో సంప్రదింపులు జరిగాయి. ఈడీ ఈ కేసు వివరాలను తమకు సమర్పించాల్సిందిగా కోరింది. దర్యాప్తు వేగంగా పూర్తి చేయడానికి సంబంధిత పత్రాలు, ఆధారాలు, కేసు వివరాలను కోరుతూ ఈడీ అధికారులు నగర పోలీసు కమిషనర్ సజ్జనార్‌కు లేఖ రాశారు.
ప్రస్తుతం ఇమ్మడి రవి పెద్ద ఎత్తున మనీలాండరింగ్‌కు పాల్పడినట్లు ఈడీ అనుమానిస్తోంది. ఇమ్మడి రవి 40 కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను నిర్వహించాడని రకరకాల మార్గాల ద్వారా నిధులను విదేశాలకు తరలించాడని దర్యాప్తు అధికారులు చెబుతున్నారు. డబ్బు దేశం నుండి ఎలా మళ్లించాడో అధికారులు పరిశీలిస్తున్నారు.
అలాగే క్రిప్టో వాలెట్ నుంచి రవి నాన్-రెసిడెంట్ ఎక్స్‌టర్నల్ ఖాతాకు నెలకు సుమారు రూ.15 లక్షలు బదిలీ అయిందని ఈడీకి సమాచారం అందింది. క్రిప్టో నుంచి వరుస ట్రాన్జాక్షన్లపై సీరియస్ గా దర్యాప్తు సాగుతోంది.
దర్యాప్తు ప్రకారం.. రవి 20 కోట్లు పైగా లావాదేవీలు సాగించాడు. కోట్లాది రూపాయల ఆస్తులను కూడగట్టాడు. హైదరాబాద్, కరేబియన్ లో ఇల్లు, ఫ్లాట్లు కొన్నాడు. అతడికి బెట్టింగ్ యాప్ ల నుంచి భారీగా నిధులు వచ్చినట్టు అధికారులు చెబుతున్నారు. బెట్టింగ్ యాప్ ల సొమ్ములతో నెలకు రెండు దేశాలలో ఎంజాయ్ చేసేవాడు. యూరోపియన్ దేశాలు అతడి ఫేవరెట్ డెస్టినేషన్స్. అలాగే సినిమాలను పైరసీ చేయడం ద్వారా నెలకు 11లక్షలు ఆర్జించాడు. స్నేహితులు, బంధువులతో అంతగా సంబంధాలు లేవు. అతడు పూర్తిగా కరేబియన్ దీవుల్లో సెటిలవ్వాలని ప్లాన్ చేసినట్టు అధికారులు చెబుతున్నారు.
