ఆస్కార్ తిరస్కరణతో కసితో రంగంలోకి స్టార్ హీరో!
ఆస్కార్ నామినేషన్లలో తన చిత్రానికి చోటు దక్కకపోవడంపై డ్వేన్ జాన్సన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎంతో పరిణ తితో.. అంతే కసితో స్పందించారు.
By: Srikanth Kontham | 12 Jun 2026 7:00 PM ISTహాలీవుడ్ యాక్షన్ చిత్రాల సామ్రాజ్యంలో ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నటుడు డ్వేన్ జాన్సన్. ప్రపంచవ్యాప్తంగా వందల కోట్ల డాలర్ల వసూళ్లు సాధించే కమర్షియల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన నటుడు. ఇటీవల నటనలోని సరికొత్త కోణాన్ని ఆవిష్కరిస్తూ `ది స్మాషింగ్ మెషీన్` అనే బయోపిక్ చిత్రంలో నటించారు. ప్రఖ్యాత మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ఫైటర్ మార్క్ కెర్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో జాన్సన్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచారు. అయితే ఎంతో ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ రేసులో ఈ చిత్రానికి ఆశించిన స్థాయిలో గుర్తింపు దక్కకపోవడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.
ఆస్కార్ నామినేషన్లలో తన చిత్రానికి చోటు దక్కకపోవడంపై డ్వేన్ జాన్సన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఎంతో పరిణ తితో.. అంతే కసితో స్పందించారు. అవార్డుల తిరస్కరణ తనను ఎంతమాత్రం కుంగదీయలేదన్నారు. కానీ తనలో సరికొత్త కసిని, పట్టుదలను రగిల్చిందన్నారు. నటుడిగా అత్యుత్తమ స్థాయిని చేరుకోవడానికి తాను చేయాల్సిన ప్రయాణం ఇంకా ఎంతో ఉందనే విషయాన్ని ఈ పరిణామం గుర్తుచేసిందని పేర్కొన్నారు. కమర్షియల్ యాక్షన్ హీరోగా మాత్రమే కాకుండా భావోద్వేగాలు కలిగిన పాత్రలను కూడా తాను పండించగలనని నిరూపించడమే తన ముందున్న లక్ష్యమన్నారు .
చిత్రంలో మార్క్ కెర్ పాత్ర కోసం జాన్సన్ పడిన కష్టం సామాన్యమైనది కాదు. కేవలం శారీరకంగానే కాకుండా మానసికంగా పాత్రలోకి లీనమవడానికి నెలల పాటు కఠినమైన శిక్షణ తీసుకున్నారు. ఒక అథ్లెట్ జీవితంలోని గెలుపోటములు, మాదకద్రవ్యాల వ్యసనం నుండి బయటపడిన తీరును వెండితెరపై ఎంతో సహజంగా ఆవిష్కరించారు. ఈ పాత్ర తన కెరీర్‌లోనే అత్యంత సవాలుతో కూడుకున్నదని దీనికోసం తన పరిమితులను దాటి పని చేశానని గుర్తు చేసారు. అవార్డుల కంటే కూడా నటుడిగా తనను తాను నిరూపించుకునే క్రమంలో ఎదురయ్యే సవాళ్లే తనకు ఎక్కువ సంతృప్తిని ఇస్తాయన్నారు.
ఆస్కార్ పరాభవం ఇచ్చిన స్ఫూర్తితో జాన్సన్ భవిష్యత్తు ప్రణాళికలను మరింత పటిష్టంగా సిద్ధం చేసుకుంటు న్నారు. ఇకపై భారీ బడ్జెట్ యాక్షన్ ఎంటర్‌టైనర్లకే పరిమితం కాకుండా వినూత్నమైన కాన్సెప్ట్‌లతో కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాలలో భాగస్వామి కావాలని నిర్ణయించుకున్నారు. తనలోని నటుడిని నిరంతరం మేల్కొలిపే పాత్రల కోసం అన్వేషణ సాగిస్తానని, ఏ ఒక్క తిరస్కరణ కూడా తన ప్రయాణాన్ని ఆపలేదని నమ్మకాన్ని వ్యక్తం చేసారు. ఈ కసి భవిష్యత్తులో డ్వేన్ జాన్సన్ ను మరిన్ని విలక్షణమైన పాత్రల వైపు నడిపిస్తుందనడంలో సందేహం లేదు. ఆస్కార్ కమిటీ కమర్షియల్ ఇమేజ్ ఉన్న నటుల పట్ల చూపే సాంప్రదాయ దృక్పథం కారణంగానే ఈ చిత్రానికి నామినేషన్ దక్కలేదని కొందరు భావిస్తున్నారు. అయినా? ఈ చిత్రం ద్వారా జాన్సన్ పొందిన ప్రశంసలు ఆయన మార్కెట్ వాల్యూను, నటుడిగా ఆయనకున్న గౌరవాన్ని పరిశ్రమలో మరింత ఉన్నత స్థానానికి తీసుకెళ్లాయన్నది కాదనలేని నిజం.
