ఇండస్ట్రీలోకి మరో వారసుడు.. కొత్త సినిమా డీటెయిల్స్ ఇవే!
ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలోకి వారసులు ఎక్కువగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే.
By: Madhu Reddy | 21 Sept 2025 12:41 PM ISTఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలోకి వారసులు ఎక్కువగా ఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. అది హీరో, హీరోయిన్ల వారసులు మాత్రమే కాదు నిర్మాతలు, దర్శకుల వారసులు కూడా హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగు పెడుతూ.. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇండస్ట్రీకి మరో వారసుడు హీరోగా పరిచయం కాబోతున్నారు. ఈ మేరకు ఆ సినిమా టైటిల్ ని కూడా అప్పుడే ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఇండస్ట్రీలోకి రాబోతున్న కొత్త వారసుడు ఎవరు? ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి? ఆయన నటిస్తున్న మూవీ టైటిల్ ఏంటి? అనే విషయాలు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.
అసలు విషయంలోకి వెళ్తే.. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ బడా నిర్మాణ సంస్థగా పేరు సొంతం చేసుకున్న డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ బ్యానర్ అధినేత డీవీవీ దానయ్య ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను నిర్మించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అలాంటి ఈయన ఇప్పుడు పవన్ కళ్యాణ్ OG సినిమాను నిర్మించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 25వ తేదీన చాలా గ్రాండ్ గా ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇకపోతే ఈ సినిమా నిర్మాణ బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించిన డీవీవీ దానయ్య కుమారుడు డీవీవీ కళ్యాణ్ దాసరి హీరోగా 'అధీర' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.
ఈ చిత్రానికి శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సూపర్ విజన్ తో ఈ సినిమా రాబోతోంది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా నుండి కళ్యాణ్ దాసరి ఫస్ట్ లుక్ రేపు రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. మొత్తానికైతే నిర్మాత వారసుడిగా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెడుతున్న కళ్యాణ్ దాసరి ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని సొంతం చేసుకుంటారో చూడాలి. మరి ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు? నటీనటులు ఎవరు? మిగతా విషయాలన్నీ త్వరలోనే తెలియనున్నాయి.
కళ్యాణ్ దాసరి విషయానికి వస్తే.. ప్రముఖ బడా నిర్మాత డీవీవీ దానయ్య వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన.. నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన 'సరిపోదా శనివారం' అనే సినిమాతో నిర్మాతగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమాతో నిర్మాతగా తనను తాను ప్రూవ్ చేసుకున్న ఈయన.. ఇప్పుడు అధీరా అనే సినిమాతో హీరోగా తన కొత్త ప్రయాణాన్ని మొదలు పెడుతున్నారు. ఈ సినిమా ద్వారా సూపర్ హీరో కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కే నిరంజన్ రెడ్డి నిర్మిస్తూ ఉండగా.. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు . గౌరహరి ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇక పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.
