OG మేకర్స్ కు నోటీసులు.. క్రిమినల్ కేసు కూడా!
తాజాగా డీవీవీ సంస్థపై మల్లేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు నిర్ణయం వెలువరించకముందే.. తనను కించపరుస్తూ ట్వీట్ పెట్టారని ఆరోపించారు.
By: M Prashanth | 29 Sept 2025 1:10 AM ISTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యంగ్ డైరెక్టర్ సుజీత్ కాంబోలో వచ్చిన ఓజీ మూవీని టాలీవుడ్ ప్రముఖ డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 24న ప్రీమియర్స్ తో సినిమా సందడి మొదలవ్వగా.. తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పెషల్ షోలతోపాటు టికెట్లు రేట్ల పెంపు విషయంలో జీవో అందుకుంది డీవీవీ.
కానీ ఇప్పుడు టికెట్ ధరల అంశంపై ఆ రాష్ట్ర హైకోర్టులో కేసు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పిటిషన్ దాఖలు చేసిన మల్లేష్ యాదవ్.. తనకు రూ.100 డిస్కౌంట్ ఇస్తానని డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ ట్వీట్ చేసినందుకు పరువు నష్టం దావా వేస్తున్నట్లు ఇటీవల తెలిపారు. హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించి పోస్ట్ పెట్టారని ఆరోపించారు.
తాజాగా డీవీవీ సంస్థపై మల్లేష్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైకోర్టు నిర్ణయం వెలువరించకముందే.. తనను కించపరుస్తూ ట్వీట్ పెట్టారని ఆరోపించారు. అందుకే కోర్టు ధిక్కారం కింద నోటీసులు పంపిస్తున్నట్లు తెలిపారు. హైకోర్టు ఆర్డర్ లో తానొక్కడికే మినహాయింపు ఇవ్వాలని ఎక్కడా ఎవరూ చెప్పలేదని వ్యాఖ్యానించారు.
రాత్రి 11:30 గంటలకు ఉత్తర్వులు అప్డేట్ అయిందని.. కానీ అంతకుముందే డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ తమ అధికారిక X, ఇన్ స్టా అకౌంట్స్ లో బర్లా మల్లేష్ యాదవ్ ఒక్కరికే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు పొడిగించిందని పోస్ట్ పెట్టినట్లు చెప్పారు. నైజాం ఏరియాలో ఎక్కడైనా రూ.100 కే టికెట్ ఇస్తామని తన పేరు మెన్షన్ పోస్ట్ పెట్టారని పేర్కొన్నారు.
అయితే అప్పటికి కోర్టు ఆర్డర్ రాలేదని, కానీ ఆ పోస్ట్ వల్ల తనను చాలా మంది ట్రోల్ చేశారని అభ్యంతరం వ్యక్తం చేశారు. రాజ్యాంగ పరంగా తనకు ఉన్న హక్కుతో కేసు ఫైల్ చేశానని తెలిపారు. దానిని రకరకాలుగా చేస్తున్నారని అన్నారు. అందుకే చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తున్నానని.. లీగల్ నోటీసులు కూడా ఇప్పుడు తాను పంపిస్తున్నట్లు చెప్పారు.
తనను కించపరుస్తూ పోస్ట్ పెట్టి, ట్రోల్స్ చేయించడం చట్టవిరుద్ధమని తెలిపారు. హైకోర్టు ఆర్డర్ తనకే ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టడం వల్ల.. కోర్టు ధిక్కారం కింద నోటీసులు పంపుతున్నట్లు తెలిపారు. దాంతోపాటు డీవీవీ సంస్థపై తాను క్రిమినల్ కేసు పెట్టనున్నానని, అందుకు తగ్గ లీగల్ యాక్షన్ ను తీసుకుంటానని చెప్పారు. ప్రస్తుతం ఈ విషయం సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. మరి డీవీవీ సంస్థ స్పందిస్తుందేమో వేచి చూడాలి.
