దసరా బరిలో ధమాకా పేల్చేది ఎంతమంది?
దసరా పండుగ సీజన్ సినిమా ప్రియులకు సరికొత్త వినోదాన్ని పంచేందుకు సర్వం సిద్ధమైంది. బాక్సాఫీస్ వద్ద ఏ క్షణమైనా కలెక్షన్ల సునామీ సృష్టించేందుకు ఆసక్తికర చిత్రాలు క్యూ కట్టాయి.
By: Srikanth Kontham | 15 Oct 2026 9:16 PM ISTదసరా పండుగ సీజన్ సినిమా ప్రియులకు సరికొత్త వినోదాన్ని పంచేందుకు సర్వం సిద్ధమైంది. బాక్సాఫీస్ వద్ద ఏ క్షణమైనా కలెక్షన్ల సునామీ సృష్టించేందుకు ఆసక్తికర చిత్రాలు క్యూ కట్టాయి. ఇప్పటికే సూపర్స్టార్ రజనీకాంత్ నటించిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ `జైలర్ 2` రిలీజ్ అయింది. విడుదలైన తొలి ఆట నుంచే ప్రేక్షకులు నుంచి పాజిటివ్ టాక్ రావడంతో హిట్ బొమ్మగా ఖాయమైపోయింది. సినిమాకు మంచి రివ్యూలు వచ్చాయి. అయితే 1000 టార్గెట్ రీచ్ అవుతుందా? లేదా? అన్నది తేలడానికి ఇంకా సమయం పడుతుంది. మరికొన్ని గంటల్లో బాక్సాఫీస్ వద్ద అసలైన దసరా పోరు షురూ కానుంది.
ఇదే రోజున పలు క్రేజీ చిత్రాలు రిలీజ్అ వుతున్నాయి . ముఖ్యంగా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్న `రణబాలి` అక్టోబర్ 16న ప్రేక్షకుల ముందుకు రానుంది. పీరియాడిక్ యాక్షన్ చిత్రం కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఇదే రోజున టాలెంటెడ్ అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన వైవిధ్యమైన లవ్ అండ్ ఫ్యామిలీ డ్రామా `క్రేజీ కళ్యాణం` కూడా థియేట్రికల్ రిలీజ్కు రెడీ అయింది. అనుపమ మార్క్ పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.
ఈ సినిమాలతో పాటు డిఫరెంట్ కాన్సెప్ట్లతో ప్రేక్షకులను అలరించేందుకు మరో వైవిధ్యమైన చిత్రం కూడా రేసులో నిలిచింది. కోలీవుడ్ నుంచి వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే విజయ్ ఆంటోనీ నటించిన తాజా సెంటిమెంట్ యాక్షన్ ఎంటర్టైనర్ `నాన్నకుట్టీ` కూడా అక్టోబర్ 16నే విడుదలవుతోంది. భిన్నమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రంపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఫ్యామిలీ ఆడియన్స్ను టార్గెట్ చేస్తూ వస్తున్న ఈ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది.
దసరా రేసును మరింత రంజుగా మార్చేందుకు అక్టోబర్ 17న మరో ఆసక్తికర చిత్రం కూడా బరిలోకి దిగుతోంది. టాలెంటెడ్ నటి ఆనంది ప్రధాన పాత్రలో నటిస్తున్న `గర్విడి లక్ష్మి` చిత్రం అక్టోబర్ 17న విడుదలకానుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే బలమైన భావోద్వేగాల చిత్రంగా వస్తున్న మూవీ పండగ చివరి రోజుల కలెక్షన్లపై కన్నేసింది. ఇలా ఒకరి తర్వాత ఒకరు వరుసగా థియేటర్లలోకి వస్తున్న చిత్రాలతో దసరా బరి ఒక్కసారిగా వేడెక్కింది.
మొత్తానికి ఈ దసరా సీజన్లో బాక్సాఫీస్ వద్ద ఒకరితో ఒకరు తలపడేందుకు ఏకంగా ఐదుకు పైగా సినిమాలు సిద్ధమయ్యాయి. మాస్ యాక్షన్ నుండి ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామాల వరకూ అన్ని వర్గాలను అలరించే కంటెంట్ అందుబాటులో ఉండటంతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది. మరి ఈ దసరా బాక్సాఫీస్ యుద్ధంలో ఏ సినిమా అఖండ విజయం సాధిస్తుంది? ఎన్ని చిత్రాలు కలెక్షన్ల మోత మోగిస్తాయనేది చూడాలి.
