రెండేళ్ల తర్వాత వచ్చినా అదే పరిస్థితి...!
భారీతనం కొట్టొచ్చినట్లు కనిపించింది, అయితే యానిమల్ సినిమాలో మాదిరిగా ఈ సినిమాలో కూడా ఎక్కువ హింస ఉంది అనే అభిప్రాయాన్ని ప్రేక్షకులు వ్యక్తం చేశారు.
By: Ramesh Palla | 5 Dec 2025 2:06 PM ISTరోహిత్ శెట్టి దర్శకత్వంలో 2022 సంవత్సరంలో వచ్చిన సర్కస్ సినిమాతో రణవీర్ సింగ్ చివరిసారి హీరోగా ప్రేక్షకులను అలరించాడు. మధ్యలో ఒకటి రెండు సినిమాల్లో కనిపించినప్పటికీ అవి కేవలం గెస్ట్ రోల్స్ కావడంతో అభిమానులను సంతృప్తి పరచలేదు. ఎట్టకేలకు రణవీర్ సింగ్ తన దురంధర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. గత ఏడాది కాలంగా రణవీర్ సింగ్ నటిస్తున్న దురంధర్ సినిమాపై అంచనాలు పెరుగుతూ వచ్చాయి. ఆయన కెరియర్ లోనే అత్యధిక బడ్జెట్ తో నిర్మిస్తున్న సినిమా అంటూ నిర్మాణ సంస్థ ప్రచారం చేసింది. ఆదిత్య దార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు మేకర్ తీసుకొచ్చారు. సినిమా మేకింగ్ సమయంలో ఉన్నంత ఆసక్తి విడుదల సమయంలో ప్రేక్షకుల్లో క్రియేట్ చేయడానికి సాధ్యమైనట్లు ప్రమోషన్లు నిర్మాతలు చేయడంలో విఫలమయ్యారు. దర్శకుడు సినిమాను ఎంత క్రియేటివ్ గా తీశాడో తెలియదు కానీ ప్రమోషన్ విషయంలో మాత్రం పూర్తిగా విఫలం అయ్యాడు అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
రణవీర్ సింగ్ హీరోగా నటించిన...
రణవీర్ సింగ్ హీరోగా నటించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్, అర్జున్ రాంపాల్, సారా అర్జున్ వంటి ప్రముఖులు నటించారు. మొదట ఈ సినిమా మేజర్ మోహిత్ శర్మ జీవితం ఆధారంగా రూపొందించినట్లు వార్తలు వచ్చాయి. దాంతో ఆయన కుటుంబ సభ్యులు తమ అనుమతి లేకుండా సినిమాను రూపొందిస్తున్నారు అంటూ కోర్టును ఆశ్రయించారు. దాంతో దర్శకుడు ఆదిత్య దార్ ఈ సినిమా పూర్తిగా కల్పిత కథ అని, ఎవరి జీవిత చరిత్రను మేము చూపించబోవడం లేదని పలు మీడియా సమావేశాల్లో చెప్పుకొచ్చాడు. ఎప్పుడైతే మోహిత్ శర్మ జీవిత కథ కాదు అంటూ ఈ సినిమా గురించి ప్రకటన వచ్చిందో అప్పటి నుండి బజ్ తగ్గుతూ వచ్చింది. కానీ సినిమా షూటింగ్ పూర్తి అయిన తర్వాత ప్రమోషన్ కార్యక్రమాల సమయంలో చిత్ర యూనిట్ సభ్యులకు బజ్ పెంచే అవకాశం ఉంది. కానీ ప్రమోషన్ ని వాడుకొని సినిమా బజ్ క్రియేట్ చేయడంలో మేకర్స్ విఫలమయ్యారు. హీరో రణవీర్ సింగ్ ని ఉపయోగించుకొని సినిమాను జనాల్లోకి తీసుకువెళ్లడానికి ఆసక్తికరంగా ప్రమోషన్ కార్యక్రమాలు చేయలేకపోయారు. దాంతో సినిమాకు ముందస్తు బజ్ క్రియేట్ కాలేదు.
దురంధర్ నేడే విడుదల
సినిమా ట్రైలర్ విడుదలైన తర్వాత తప్పకుండా ఆకట్టుకుంటుందని అంత భావించారు. భారీతనం కొట్టొచ్చినట్లు కనిపించింది, అయితే యానిమల్ సినిమాలో మాదిరిగా ఈ సినిమాలో కూడా ఎక్కువ హింస ఉంది అనే అభిప్రాయాన్ని ప్రేక్షకులు వ్యక్తం చేశారు. పైగా ఈ సినిమా కేవలం యాక్షన్ కోసమే చూడాలి అన్నట్లుగా ట్రైలర్ ఉండడంతో ఫ్యామిలీ ఆడియన్స్ ఆసక్తి చూపించలేదు అనేది కొందరి అభిప్రాయం. మొత్తానికి సినిమా నేడు విడుదల అయ్యింది. వారం ముందే ప్రారంభం అయిన అడ్వాన్స్ బుకింగ్ లో ఏమాత్రం సందడి కనిపించలేదు. సినిమా విడుదల తర్వాత అయినా టాక్ ప్రభావం ఉంటుందేమో అని మేకర్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దాదాపుగా 200 కోట్ల రూపాయల బడ్జెట్ తో నిర్మించామని ఒక జాతీయ మీడియా సంస్థకు చెందిన ప్రతినిధితో నిర్మాత చెప్పినట్లు తెలుస్తోంది. అంతకు మించి కూడా ఖర్చు చేసి ఉండవచ్చని ట్రైలర్ చూస్తే అనిపిస్తుంది. కానీ సినిమా లో మ్యాటర్ ఎంత ఉంది అనేది మాత్రం ఇప్పుడే చెప్పలేం ఈరోజు తర్వాత వచ్చే టాక్ ను బట్టి ఫలితం ఉంటుంది.
బాక్సాఫీస్ వద్ద సందడి లేదు...
ఒక స్టార్ హీరో రెండు సంవత్సరాలు గ్యాప్ తీసుకొని వస్తున్నాడు అంటే ఆయన అభిమానుల్లో కచ్చితంగా ఆసక్తి అంచనాలు భారీగా ఉంటాయి. రణవీర్ సింగ్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ చిన్నది ఏం కాదు, ఆయన సాధించిన హిట్స్ చిన్నవి కాదు. అందుకే దురంధర్ సినిమాకి మంచి ఓపెనింగ్ ఉంటుందని అంతా భావించారు. కానీ సినిమా బాక్సాఫీస్ వద్ద పేలవమైన ఓపెనింగ్ రాబట్టింది. సినిమా హిట్ టాక్ దక్కించుకుంటే తప్పితే భారీ కలెక్షన్స్ వచ్చే పరిస్థితి లేదు. మినిమం ఓపెనింగ్స్ లేకపోవడంతో బాలీవుడ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితికి ఇది అద్దం పడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రణవీర్ సింగ్ ఈ సినిమాతో సక్సెస్ దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్నాడు. కాస్త ఎక్కువ సమయమైనా పరవాలేదని సినిమాపై ఎక్కువగా వర్క్ చేశాడు. ఈ సినిమా చేసిన సమయంలో ఇతర సినిమాల గురించి అంతగా ఆసక్తి చూపించలేదని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. అయినప్పటికీ ఫలితం ఆశించిన స్థాయిలో వస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. రెండు సంవత్సరాల తర్వాత వచ్చినప్పటికీ మినిమం బజ్ లేకపోవడంతో ఆందోళన కలిగిస్తుందని బాలీవుడ్ వర్గాల వారు అంటున్నారు.
