ఉరకలెత్తుతున్న సౌత్-నార్త్ సినీ సోదరభావం
అయితే హిందీ చిత్రపరిశ్రమకు చెందిన ఆదిత్యాధర్‌ని టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంతో నిజాయితీగా ప్రశంసించారు. ధర్ ప్రతిభను ఆత్మీయంగా వ్యక్తిగతంగా ప్రశంసించాడు ఆర్జీవీ.
By: Sivaji Kontham | 21 Dec 2025 6:00 PM ISTఒకే పరిశ్రమకు చెందిన మాఫియాల గురించి చాలా చర్చ సాగుతోంది. బాలీవుడ్ ని ఏల్తున్న మాఫియా కొత్త వారికి అవకాశాలు కల్పించరని కంగన లాంటి నటీమణులు తీవ్రంగా బహిరంగంగా విమర్శిస్తున్నారు. అయితే ఒకే పరిశ్రమకు చెందిన వ్యక్తుల మధ్య సాన్నిహిత్యం ఎప్పుడూ చర్చనీయాంశం కాదు.
అసలు ఒకే పరిశ్రమకు చెందని, భిన్నమైన పరిశ్రమలకు చెందిన వ్యక్తులు ఒకరినొకరు ప్రశంసిస్తూ, సోదరభావంతో మెలిగితేనే అది నిజంగా హాట్ టాపిక్. ఇటీవలి కాలంలో ఆర్జీవీ- ఆదిత్యాధర్, సందీప్ రెడ్డి వంగా- ఆదిత్యాధర్ ఈక్వేషన్ పరిశీలిస్తుంటే, ఇది నిజంగా ఆశ్చర్యపరుస్తోంది.
ఆదిత్యాధర్ తెరకెక్కించిన దురంధర్ చిత్రానికి సొంత (హిందీ) పరిశ్రమ నుంచి చాలా మంది ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. హృతిక్ రోషన్ ఈ సినిమాలో ఏకపక్ష రాజకీయాల గురించి విమర్శించినా కానీ ఆదిత్యాధర్ పనితనంపై ప్రశంసలు కురిపించాడు.
అయితే హిందీ చిత్రపరిశ్రమకు చెందిన ఆదిత్యాధర్‌ని టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంతో నిజాయితీగా ప్రశంసించారు. ధర్ ప్రతిభను ఆత్మీయంగా వ్యక్తిగతంగా ప్రశంసించాడు ఆర్జీవీ. దానికి కృతజ్ఞతలు చెబుతూ, ఆర్జీవీ కల్ట్ జానర్ సినిమాలు, ధైర్యమైన టేకింగ్ నుంచి తాను ఎలా స్ఫూర్తిని పొందాడో ఆదిత్యాధర్ చెప్పుకొచ్చారు.
అదే విధంగా సందీప్ రెడ్డి వంగా కూడా ఆదిత్యాధర్ పైనా, దురంధర్ పైనా ప్రశంసలు కురిపించాడు. ఈ ప్రశంసలకు ప్రతిస్పందించిన ఆదిత్యా సందీప్ రెడ్డి వంగా ధైర్యమైన ఫిలింమేకింగ్ శైలిని మెచ్చుకున్నాడు. నిర్భయంగా చెప్పాలనుకున్నది చెబుతూ.. క్షమాపణలు చెప్పని పౌరుషమైన హీరోయిక్ పాత్ర శైలిని తాను ఎంతగా నమ్ముతున్నాడో చెప్పాడు. సందీప్ వంగా పనిని తాను ఆరాధిస్తానని అన్నాడు. `ధురందర్` చిత్రం చిత్తశుద్ధి, సంయమనం, దృఢ విశ్వాసంతో రూపొందించాము. మీ మాటలు ఆ ప్రయాణానికి సైలెంట్ కన్ఫర్మేషన్. భారతీయ సినిమాను నిజాయితీగా, మూలాలతో కూడినదిగా.. బలంగా ఉంచే మీ వాయిస్ వినిపించినందుకు నేను కృతజ్ఞుడను... అని రాసారు. మనం వేర్వేరు శైలులతో సినిమాలు చేసినా దేశం కోసం బలమన ధైర్యమైన రేపటి వైపు సోదరులుగా నడుస్తున్నాం. సినిమా ధైర్యవంతులను గుర్తుంచుకుంటుంది.., నచ్చిన వారిని కాదు! అని ఆదిత్యాధర్ పేర్కొన్నారు.
ఇవి ఊహించని కొత్త స్నేహాలు. నిన్న మొన్నటివరకూ ఆదిత్యా ధర్ ఎవరో సౌత్ లో చాలామందికి తెలియకపోవచ్చు. కానీ ఇప్పుడు ఎక్కడ విన్నా అతడి పేరు వినిపిస్తోంది. ఆదిత్యాధర్ ఒక బ్రాండ్ గా మారాడు. ఈ సమయంలో ఎలాంటి భేషజానికి పోకుండా అతడు ఎంతో తెలివిగా సందర్భానుసారం సౌత్ దర్శకులను తనవాళ్లను చేసుకున్నాడు. అతడు తన బలాన్ని ఇప్పుడు సౌత్ లోను పెంచుకున్నాడు. ఇకపై ఆదిత్యాధర్ రూపొందించే సినిమాలకు తెలుగులోను సరైన ప్రచారం లభిస్తుంది. అతడికి సినీ సోదరులు సౌత్ లోను ఉన్నారు గనుక చాలా విస్త్రతమైన పరిశోధన తర్వాత తన తదుపరి సినిమాల కథలను కూడా ఎంపిక చేయవచ్చు. అయితే ఇలాంటి అవకాశం ఒంటెద్దు పోకడతో సౌత్ సినిమాని విమర్శించే సిద్ధార్థ్ ఆనంద్ లాంటి దర్శకుల దరి చేరకపోవచ్చు.
