Begin typing your search above and press return to search.

ఒక్క సినిమా టికెట్‌కు ₹90,000.. ఏమిటీ స్పెషల్?

హాలీవుడ్ విజువల్ వండర్ 'డ్యూన్ 3' కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతలా ఎదురుచూస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు.

By:  Madhu Reddy   |   8 April 2026 12:45 PM IST
ఒక్క సినిమా టికెట్‌కు ₹90,000.. ఏమిటీ స్పెషల్?
X

హాలీవుడ్ విజువల్ వండర్ 'డ్యూన్ 3' కోసం ప్రపంచవ్యాప్తంగా సినీ ప్రియులు ఎంతలా ఎదురుచూస్తున్నారో తెలిస్తే షాక్ అవుతారు. ఈ ఏడాది డిసెంబర్ 18న విడుదల కానున్న ఈ సినిమా ఐమ్యాక్స్ 70mm టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడైపోయాయి. కేవలం నిమిషాల్లోనే బుకింగ్స్ క్లోజ్ అవ్వడమే కాదు, బ్లాక్ మార్కెట్‌లో ఒక్కో టికెట్ ధర ఏకంగా రూ. 90,000 వరకు పలుకుతుండటం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అసలు ఈ టికెట్‌కు ఎందుకంత క్రేజ్? ఆ విశేషాలు చూద్దాం..

ఐమ్యాక్స్ క్రేజ్.. నిమిషాల్లోనే క్లోజ్:

డైరెక్టర్ డెనిస్ విల్లెనెవ్ తెరకెక్కిస్తున్న 'డ్యూన్: పార్ట్ త్రీ' చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకాయి. ఈ సినిమాను ఐమ్యాక్స్ 70mm ఫార్మాట్‌లో చూడాలని ఫ్యాన్స్ తెగ ఆరాటపడుతున్నారు. అందుకే డిసెంబర్ 18, 2026న సినిమా రిలీజ్ కాబోతుంటే.. నెలల ముందే మొదలైన అడ్వాన్స్ బుకింగ్స్‌లో టికెట్లు నిమిషాల్లో మాయమైపోయాయి. ఈ విజువల్ గ్రాండియర్‌ను మిస్ కాకూడదని జనం ఎగబడటంతో డిమాండ్ విపరీతంగా పెరిగిపోయింది.

90 వేల రూపాయల టికెట్ వెనుక అసలు కథ:

సాధారణంగా సినిమా టికెట్ అంటే వందల్లో ఉంటుంది, కానీ డ్యూన్ 3 కోసం ఐమ్యాక్స్ 70mm థియేటర్ల టికెట్లు రీసేల్ మార్కెట్‌లో వేలల్లో అమ్ముడవుతున్నాయి. అమెరికా, బ్రిటన్ వంటి దేశాల్లోని కొన్ని ప్రధాన నగరాల్లో ఒక టికెట్ ధర భారత కరెన్సీలో సుమారు రూ. 90,000 వరకు పలుకుతోంది. ఇంత ధర పెట్టి సినిమా చూడటం ఏంటని కొందరు ఆశ్చర్యపోతుంటే, ఆ ఎక్స్‌పీరియన్స్ కోసం ఎంతైనా ఖర్చు పెట్టొచ్చని డైహార్డ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో వాదిస్తున్నారు.

ప్రపంచవ్యాప్తంగా థియేటర్ల కొరత:

ఈ భారీ టికెట్ రేట్లకు ప్రధాన కారణం ఐమ్యాక్స్ 70mm థియేటర్లు చాలా తక్కువగా ఉండటమే. అమెరికా, యూకే మొత్తం కలిపి కేవలం 19 లొకేషన్లలో మాత్రమే ఈ స్పెషల్ ఫార్మాట్ స్క్రీన్స్ అందుబాటులో ఉన్నాయి. ఇక దీంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినిమా ప్రేమికులు ఆ కొన్ని థియేటర్లకే పరిమితం కావాల్సి వస్తోంది. వెంటనే మరిన్ని ఐమ్యాక్స్ 70mm స్క్రీన్లను పెంచాలని ఫ్యాన్స్ నెట్టింట డిమాండ్ చేస్తున్నారు.

దర్శకుడి విజన్.. సరికొత్త అనుభూతి:

డైరెక్టర్ విల్లెనెవ్ ఈ సినిమాను పూర్తిగా 70mm ఫిల్మ్‌పై షూట్ చేశారు. ఈ ఫార్మాట్‌లో సినిమా చూస్తే మనం నేరుగా ఆ కథా ప్రపంచంలోకి వెళ్లిపోయినట్టు అనిపిస్తుందని ఆయన చెబుతుంటారు. అందుకే విజువల్స్‌లో ఏమాత్రం క్వాలిటీ తగ్గకూడదని కోరుకునే వారు ఈ ప్రత్యేకమైన థియేటర్ల కోసం ఎంత దూరమైనా వెళ్తున్నారు. ఇక మొత్తం మీద 'డ్యూన్ 3' కేవలం సినిమాగానే కాకుండా ఒక గ్లోబల్ ఈవెంట్‌గా మారిపోయింది.

ఇక ఒక మంచి సినిమాను బెస్ట్ క్వాలిటీలో చూడాలనే ఆడియన్స్ కసి, డిమాండ్‌కు తగ్గ థియేటర్లు లేకపోవడం వెరసి సినిమా టికెట్‌ను అక్షరాలా లక్ష రూపాయల మార్కుకు దగ్గరగా తీసుకెళ్లాయి. మరి ఇక ఆ స్థాయిలో ఖర్చు పెట్టి చూసే ఆడియన్స్‌ను ఈ సినిమా ఎంతలా మెప్పిస్తుందో వేచి చూడాలి!