ఫైట్లు, బిల్డప్పులు లేకుండానే హీరోయిజం.. తెలుగులో దుల్కర్ సల్మాన్ స్టైలే వేరే!
హీరో ఎలివేషన్లు, భారీ ఫైట్లు లేకుండానే దుల్కర్ సల్మాన్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్, ఆకాశంలో ఒక తార వంటి సినిమాల్లో విభిన్న పాత్రలు పోషిస్తూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు. స్టార్‌డమ్ కంటే కథకు, పాత్రకు ప్రాధాన్యత ఇస్తూ అసలైన హీరోయిజం చూపిస్తున్నారు.
By: Priya Chowdhary Nuthalapti | 22 Nov 2026 10:04 AM ISTసినిమాల్లో హీరో అంటే భారీ ఇంట్రడక్షన్ ఉండాలి. ఎంట్రీ సమయంలో అదిరిపోయే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, పవర్‌ఫుల్ డైలాగులు, ఫైట్లు ఉండాలని చాలామంది భావిస్తారు. ముఖ్యంగా కమర్షియల్ సినిమాల్లో హీరో ఎలివేషన్లకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుంది. అయితే ఇవేవీ లేకుండానే ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చని నిరూపిస్తున్నారు మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్. కథకు ప్రాధాన్యత ఇస్తూ, విభిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ తనకంటూ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నారు.
తెలుగు ప్రేక్షకులకు దుల్కర్ సల్మాన్ మహానటి సినిమాతో బాగా దగ్గరయ్యారు. ఈ చిత్రంలో ఆయన జెమిని గణేషన్ పాత్రలో కనిపించారు. నిజ జీవితంలో సావిత్రి జీవితంలో కీలకమైన వ్యక్తిగా నిలిచిన జెమిని గణేషన్ పాత్రకు కొన్ని నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయి. అయినప్పటికీ దుల్కర్ తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. పాత్రలోని ఎమోషన్స్ చూపించిన తీరు, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ చాలామందికి నచ్చాయి. నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలోనూ తనదైన ముద్ర వేయగలిగారు.
ఆ తర్వాత వచ్చిన సీతారామం దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో మరో ప్రత్యేకమైన సినిమాగా నిలిచింది. ఇందులో రామ్ పాత్రలో ఆయన నటన ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది. ముఖ్యంగా అమ్మాయిలకు..రామ్ పాత్ర ఒక కలల రాకుమారుడిలా కనిపించింది. భారీ ఫైట్లు, మాస్ ఎలివేషన్లు లేకపోయినా తన హావభావాలు, మాటతీరు, ప్రేమను వ్యక్తం చేసిన విధానంతో అందరినీ ఆకట్టుకున్నారు. మృణాల్ ఠాకూర్‌తో ఆయన కెమిస్ట్రీ కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచింది.
ఇక లక్కీ భాస్కర్ సినిమాలో పూర్తిగా మరో కోణంలో కనిపించారు. మధ్యతరగతి కుటుంబానికి చెందిన వ్యక్తిగా, తన తెలివితేటలతో జీవితాన్ని మార్చుకోవాలని ప్రయత్నించే భాస్కర్ పాత్రలో ఒదిగిపోయారు. సాధారణ మనిషి ఎదుర్కొనే సమస్యలు, ఆశలు, ఆశయాలను తన నటనతో సహజంగా చూపించారు.
ప్రస్తుతం ఆకాశంలో ఒక తార సినిమాలో కృష్ణ పాత్రతో తన పాపులారిటీని మరో స్థాయికి తీసుకెళుతున్నారు ఈ హీరో. ఈ కథలో హీరోయిన్ కలలు, ఆశయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది. భార్య ఆశయాలను అర్థం చేసుకుని, ఆమె ఎదుగుదలకు అండగా నిలిచే భర్తగా దుల్కర్ కనిపిస్తున్నారు. ఆమె పాత్రను పక్కకు నెట్టి తన హీరోయిజాన్ని చూపించే ప్రయత్నం చేయకుండా, కథకు అవసరమైన విధంగా నటించారు. ముఖ్యంగా పాతబడిన, చిరిగిన బ్యాగ్‌తో కనిపించే ఇంటర్వెల్ సన్నివేశంలో కూడా తనదైన స్టైల్ తో విజిల్స్ వేయిపిచ్చుకోగలిగారు.
ఈ సినిమాల్లో దుల్కర్ ఎక్కడా అనవసరమైన హడావుడి చేయరు. భారీ డైలాగులు, ఫైట్లు లేకపోయినా తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేస్తారు. ఒక మంచి పాత్రకు నిజాయితీగా ప్రాణం పోస్తే అదే అసలైన హీరోయిజం అని ఆయన సినిమాలు గుర్తుచేస్తున్నాయి.
స్టార్‌డమ్ కోసం కాకుండా కథలోని పాత్రకు ప్రాధాన్యత ఇచ్చే దుల్కర్ సల్మాన్ ప్రయాణం.. ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటుంది. మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్, ఆకాశంలో ఒక తార వంటి సినిమాలతో హీరో అంటే కేవలం తెరపై కనిపించే వ్యక్తి మాత్రమే కాదని, కథను ముందుకు నడిపించే బలమైన పాత్ర కూడా కావచ్చని చూపిస్తున్నారు. అందుకే దుల్కర్ సల్మాన్ హీరోయిజం మిగతా హీరోల శైలికి భిన్నంగా కనిపిస్తోంది.
