స్టార్ వారసుడికి తెలుగు సినిమాలే కొండంత అండ!
మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన దుల్కర్ సల్మాన్ నేడు సౌత్ ఇండియాలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు.
By: Srikanth Kontham | 12 Sept 2026 10:00 PM ISTమలయాళ మెగాస్టార్ మమ్ముట్టి వారసుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన దుల్కర్ సల్మాన్ నేడు సౌత్ ఇండియాలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నారు. ప్రత్యేకించి తెలుగులో దుల్కర్ సినిమాలు మంచి ఫలితాలు సాధిసస్తున్నాయి. అయితే కొంత కాలంగా దుల్కర్ కు మాతృ భాష కంటే తెలుగులోనే మంచి ఫలితాలు వస్తున్నట్లు కనిపిస్తోంది. దీంతో దుల్కర్ కు తెలుగు సినిమాలే కొండంత అండగా నిలుస్తున్నాయనే వాదన బలపడుతోంది. `మహానటి` చిత్రంలో జెమిని గణేశన్ పాత్ర తో తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చిన దుల్కర్ నటనలో క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అందరినీ మెప్పించారు.
అటుపై హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన `సీతా రామం` సినిమా దుల్కర్ రేంజ్‌ను పూర్తిగా మార్చేసింది. బలమైన పాత్రలో సహజంగా నటించి తెలుగు నేలపై రాముడిగా కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో స్థానం సంపాదించారు. అనంతరం వెంకీ అట్లూరి దర్శకత్వంలో రిలీజ్ అయిన `లక్కీ భాస్కర్` చిత్రం కూడా తెలుగులో సంచలన విజయం సాధించింది. సాధారణ బ్యాంక్ ఉద్యోగిగా దుల్కర్ నటన, ఆర్థిక నేరాల నేపథ్యంతో సాగే స్క్రీన్‌ప్లే టాలీవుడ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
కేరళ బాక్సాఫీస్ వద్ద ప్లాప్ ..యావరేజ్ అనిపించుకున్న కొన్ని కాన్సెప్టులు కూడా దుల్కర్ నటించిన తెలుగు సినిమాల రూపంలో ఇక్కడ భారీ వసూళ్లను సాధించాయి. మలయాళ చిత్ర పరిశ్రమలో ఎక్కువగా రియలిస్టిక్, సీరియస్ డ్రామాలకు ప్రాధాన్యత ఇస్తారు దుల్కర్. అక్కడ ఎమోషన్స్ వర్కవుట్ కాక పరాజయం పాలైన సినిమాలు ఉన్నా? తెలుగులో మాత్రం కమర్షియల్ హంగులతో కూడిన భావోద్వేగాలకు మంచి ఆదరణ దక్కుతుంది.
తెలుగు ప్రేక్షకులు నటనలో నిజాయితీ ఉంటే ఇతర భాషల నటులనైనా సొంత బిడ్డల్లా ఆదరిస్తారనే విషయానికి దుల్కర్ మరో ఉదాహరణ. ప్రస్తుతం దుల్కర్ కు మాతృభాష కంటే తెలుగు చిత్ర పరిశ్రమలోనే దుల్కర్‌కు తిరు గులేని మార్కెట్ క్రియేట్ అవుతుంది. విభిన్నమైన కథలను ఎంచుకోవడం, తెలుగు నేటివిటీకి సరిపోయేలా పాత్రలలో ఒదిగిపోవడమే దుల్కర్ విజయాల వెనుక రహస్యం. దీంతో తెలుగు నిర్మాతలు దుల్కర్ సల్మాన్‌తో బిగ్ బడ్జెట్ సినిమాలు తీయడానికి ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో దుల్కర్ కూడా మాలీవుడ్ కంటే టాలీవుడ్ పైనే దృష్టి పెడుతున్నారు. ఏక కాలంలో రెండు భాషల్లో సినిమాలు చేస్తున్నా? ఫోకస్ అంతా తెలుగు సినిమాలపైనే కనిపిస్తోంది. రెగ్యులర్ గా ఇక్కడ దర్శక, నిర్మాతలకు టచ్ లో ఉంటున్నారు. స్టార్ హీరోలతోనూ మంచి రిలేషన్ షిప్ ని మెయింటెన్ చేస్తున్నారు.
