టాలీవుడ్ లో అలా చూసి షాక్ అయ్యాను : దుల్కర్
మలయాళ స్టార్ హీరో అయిన దుల్కర్ సల్మాన్ ఈ విషయమై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
By: Ramesh Palla | 3 Dec 2025 12:52 PM ISTసినిమా ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా 8 గంటల పని డిమాండ్ వినిపిస్తున్న విషయం తెలిసింది. సాధారణ నటీనటులు మాత్రమే కాకుండా స్టార్ హీరోయిన్స్ సైతం షూటింగ్ కేవలం 8 గంటలు మాత్రమే ఉండాలి అనే డిమాండ్ చేయడం వల్లే ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ చర్చ జరుగుతోంది. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దేశవ్యాప్తంగా గుర్తింపు ఉన్న హీరోయిన్ అయినా దీపిక పడుకొనే 8 గంటల పని డిమాండ్ కారణంగా ఆమెకు పలు సినిమా ఆఫర్లు చేజారాయి అనేది టాక్. అయినా కూడా తాను తన డిమాండ్ ని వెనక్కి తీసుకోవడం లేదు. ఏ నిర్మాత అయితే ఎనిమిది గంటల పని కి ఒప్పుకుంటాడో ఆ సినిమానే దీపిక చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది తన ఒక్కదాని కోసం కాదని సినిమాలో నటించే అలాగే సినిమా కోసం పనిచేసే ప్రతి ఒక్కరి ఆరోగ్యం దృష్టిలో పెట్టుకొని తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు దీపిక ఆమధ్య ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక....
దీపిక డిమాండ్ ని తప్పుపడుతున్న నిర్మాతలు ఉన్నారు. అలాగే నటీనటులు కూడా ఉన్నారు. సినిమా అనేది ఒక ఉద్యోగం కాదని, సినిమా అనేది టైం పెట్టుకుని చేసేది కాదని చాలామంది అంటున్నారు. షూటింగ్ గ్యాప్ లో మీరు విశ్రాంతి తీసుకునే అవకాశం ఉంటుంది. అలాగే రెగ్యులర్ షూటింగ్ ఉండదు. కనుక రోజుకు ఇన్ని గంటలు మాత్రమే షూటింగ్ చేయాలి అనే నిబంధన పెట్టుకుని వర్క్ చేస్తే కచ్చితంగా నిర్మాత లాస్ అవుతాడని అలాగే సినిమా అనుకున్న సమయం కి పూర్తి కాదని ఇండస్ట్రీలోని కొందరు దీపిక డిమాండ్ ని తిరస్కరిస్తున్నారు. బాలీవుడ్ లో మాత్రమే కాకుండా సౌత్ సినిమా ఇండస్ట్రీలో కూడా ఈ విషయమై ప్రముఖంగా చర్చ జరుగుతుంది. తాజాగా సౌత్ స్టార్ హీరోలు అయినా దుల్కర్ సల్మాన్ మరియు రానా స్పందించారు. వారిద్దరు కలిసి నటించిన కాంత సినిమా ప్రమోషన్ సందర్భంగా ఈ విషయమై తమ అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు. ఇద్దరు కూడా పని గంటల డిమాండ్ ని తోసిపిచ్చారు.
దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ...
మలయాళ స్టార్ హీరో అయిన దుల్కర్ సల్మాన్ ఈ విషయమై మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మలయాళ సినిమాలు చేస్తున్నప్పుడు షూటింగ్ ఎప్పుడు పూర్తి అవుతుందో క్లారిటీ ఉండేది కాదు. ఒక సినిమా షూటింగ్ మొదలుపెట్టాం అంటే ఆ రోజు అనుకున్న సీన్స్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా చేయకపోతే నిర్మాతకి ఆర్థిక భారం పెరుగుతుంది. అందుకే కొన్ని సందర్భాల్లో ఎక్కువ పని గంటలు చేయాల్సిన అవసరం ఉంటుంది అని దుల్కర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే తాను తెలుగులో చేసిన మొదటి సినిమా మహానటి షూటింగ్ సమయంలో ఆశ్చర్యకరమైన సంఘటనలు చూశానని చెప్పుకొచ్చాడు. షూటింగ్ సాయంత్రం 6 గంటల వరకే పూర్తి చేసి ఇంటికి పంపించేవారు. అప్పటి వరకు నేను ఎన్నో సినిమాల్లో నటించాను.. కానీ ఎప్పుడూ అలా ఆరు గంటలకు ఇంటికి పంపించిన దాఖలాలు లేవని దుల్కర్ సల్మాన్ సరదాగా తన సినిమా ఇండస్ట్రీ అయినా మలయాళ సినిమా ఇండస్ట్రీపై కామెంట్స్ చేశాడు.
వాళ్లకి కౌంటర్ ఇచ్చిన రానా...
తమిళ సినిమా ఇండస్ట్రీలో రెండో శనివారాలు సెలవు ఉంటుంది. అది అందరికీ మంచిదని దుల్కర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఒక సినిమా ఒకే రోజు ఎక్కువ గంటలు పనిచేయడం ద్వారా తక్కువ ఖర్చుతో పూర్తి అవుతుంది. అదనంగా ఒకరోజు చేయడం వల్ల ఎక్కువ ఖర్చు అవుతుంది కనుక నిర్మాతగా ఆలోచించినప్పుడు 8 గంటల పని అనేది సినిమా ఇండస్ట్రీలో వర్కౌట్ కాదని, ఒకవేళ అలా చేస్తే నిర్మాతకి నష్టం అని దుల్కర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. ఇక రానా మాట్లాడుతూ సినిమా అనేది ఒక లైఫ్ స్టైల్, ఉద్యోగం కాదు. సినిమాలో నటించాలా వద్దా అనేది వారి వారి అభిప్రాయం. సినిమా సినిమాకి అవసరాలు వేరువేరుగా ఉంటాయి. ఫ్యాక్టరీలో పని చేసినట్లుగా 8 గంటలు మాత్రమే పనిచేస్తాం అంటే ఇక్కడ వీలుపడదు. ఒక సీన్ బాగా పండాలంటే 8 గంటలు కాదు పది గంటలు అయినా కష్టపడాల్సి ఉంటుంది. అలా కష్టపడేందుకు సిద్ధపడ్డప్పుడు మాత్రమే ఇండస్ట్రీలోకి రావాలని రానా సూచించాడు. ఎనిమిది గంటల పని మాత్రమే కావాలి అంటే వేరే ఉద్యోగం చూసుకోవాలని రానా సున్నితంగా 8 గంటల పని డిమాండ్ చేస్తున్న వారికి కౌంటర్ ఇచ్చాడు.
