Begin typing your search above and press return to search.

మరో వివాదంలో దుల్కర్ సల్మాన్

వేఫేరర్ ఫిల్మ్స్ నుంచి పానంపిల్లి నగర్ అనే ప్రాంతంలో ఆడిషన్ కు రావాలని సదరు యువతిని పిలిచారట.

By:  M Prashanth   |   16 Oct 2025 7:26 PM IST
మరో వివాదంలో దుల్కర్ సల్మాన్
X

మలయాళ స్టార్ నటుడు దుల్కర్ సల్మాన్ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. ఇటీవల లగ్జరీ కార్ల అక్రమ రవాణా కాంట్రవర్సీలో విమర్శలు ఎదుర్కొన్న దుల్కర్ తాజాగా మరో చిక్కులో పడ్డారు. అయితే దుల్కర్ సినిమాల్లో హీరోగా రాణిస్తూనే నిర్మాణ సంస్థ ప్రారంభించి ప్రొడ్యూసర్ గా మారారు. వేఫేరర్ ఫిల్మ్స్ అనే బ్యానర్ పై సినిమాలు రూపొందిస్తున్నారు. ఈ బ్యానర్ పై ఇప్పటికే పలు సినిమాలు సైతం ఆయన నిర్మించారు. అయితే తాజాగా దుల్కర్ కు మరో షాక్ తగిలింది.

ఆయన సొంత నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిల్మ్స్ పేరుతో ఓ వ్యక్తి తనను లైంగికంగా వేధింపులకు గురిచేశారని ఎర్నాకుళం సౌత్ పోలీస్ స్టేషన్ లో ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఈ కంపెనీ అసోసియేట్ డైరెక్టర్ దినిల్ బాబు అనే వ్యక్తి సినిమాల్లో అవకాశం ఇప్పిస్తానని చెప్పి తనను లైంగికంగా వేధించాడని యువతి తన ఫిర్యాదులో పేర్కొంది. ఆమె ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం...

వేఫేరర్ ఫిల్మ్స్ నుంచి పానంపిల్లి నగర్ అనే ప్రాంతంలో ఆడిషన్ కు రావాలని సదరు యువతిని పిలిచారట. కానీ అక్కడకు వెళ్లి చూస్తే పరిస్థితి వేరుగా జరిగిందని పేర్కొంది. ఆ సందర్భాన్ని ఆ వ్యక్తి అడ్వాంటేజ్ గా తీసుకొని ఆమెను తనకు సహకరించాల్సిందిగా బెదిరించాడట. లేనిచో భవిష్యత్ లో ఇండస్ట్రీలో అవకాశాలు రాకుండా చేస్తానని బెదిరింపులకు దిగినట్లు తెలిపింది. అంతేకాదు దీనికి సంబంధించిన వాయిస్ రికార్డింగులు, చాటింగ్ ను ఆధారంగా పోలీసులకు అందజేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించారు.

అయితే ఈ వ్యవహారంపై వేఫేరర్ ఫిల్మ్స్ సంస్థ వెంటనే స్పందించింది. యువతి ఆరోపిస్తున్న దినిల్ బాబు అనే వ్యక్తికి తమ ప్రొడక్షన్ కంపెనీకి ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆలాగే ఆయన వేఫేరర్ ఫిల్మ్స్ నిర్మించిన ఏ సినిమాలోనూ భాగం కాలేదని ప్రకటన చేసింది. అతడు తమ కంపెనీ పేరును వాడుకొని ఫేక్ కాస్టింగ్ కాల్స్ నిర్వహించాడని పేర్కొంది. దీనికి ధీటుగా దినిల్ బాబుపై తేవర పోలీస్ స్టేషన్ , అలాగే ఫెఫ్కాలో ఫిర్యాదు చేసినట్లు వేఫేరర్ ఫిల్మ్స్ పేర్కొంది.

ఈ వ్యవహారాన్ని అంత ఈజీగా తీసుకునేది లేదని, అలాగే ఇలాంటి తప్పుడు ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దని నిర్మాణ సంస్థ తెలిపింది. సోషల్ మీడియాలో అధికారిక పేజ్ ల ద్వారా కాకుండా ఫేక్ ప్రొఫైల్స్ తో వస్తున్న ఇలాంట్ కాస్టింగ్ కాల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేసింది. అయితే ఈ ఘనటపై హీరో, నిర్మాత దుల్కర్ ఇప్పటిదాకా స్పందించలేదు.