Begin typing your search above and press return to search.

విమర్శలను సైతం అవకాశాలుగా మ‌లుచుకుంటోన్న న‌యా స్టార్!

సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు, ట్రోల్స్ తనను గతంతో పోలిస్తే ఇప్పుడు పెద్దగా ప్రభావితం చేయడం లేదని దుల్కర్ సల్మాన్ తెలిపారు. తనను సవాల్ చేసే పాత్రలను ఎంచుకుని విమర్శలకు పనితో సమాధానం చెప్పాలనుకుంటానని అన్నారు. ప్రస్తుతం ‘ఆకాశంలో ఒక తార’, ‘శ్రీ శ్రీ’ చిత్రాల్లో నటిస్తున్నట్లు పేర్కొన్నారు.

By:  Srikanth Kontham   |   18 Nov 2026 12:42 PM IST
విమర్శలను సైతం అవకాశాలుగా మ‌లుచుకుంటోన్న న‌యా స్టార్!
X

సోషల్ మీడియా విస్తరించిన నేప‌థ్యంలో సెలబ్రిటీలకు ప్రశంసలతో పాటు విమర్శలు.. ట్రోల్స్ కామన్ అయిపోయాయి. ఏ చిన్న విషయం దొరికినా నెటిజన్లు నెగెటివిటీని స్ప్రెడ్ చేస్తుంటారు. కొందరు స్టార్స్ ఈ విమర్శలను చూసి మనోవేదనకు గురవుతుంటే.. మరికొందరు వాటిని పట్టించుకోకుండా ముందుకెళ్లి పోతుంటారు.

అయితే మాలీవుడ్ చాక్లెట్ హీరో దుల్కర్ సల్మాన్ మాత్రం నెగెటివిటీని పూర్తిగా భిన్నమైన కోణంలో చూస్తున్నట్లు తెలిపారు. ఆన్‌లైన్ విమర్శలు తనను కృంగదీయడానికి బదులు మరింత కష్టపడేలా ప్రేరేపిస్తాయన్నారు.

గతంకంటే ఇప్పుడు ఆన్‌లైన్ నెగెటివిటీ తనను చాలా తక్కువగా ప్రభావితం చేస్తోందన్నారు. కాలం గడుస్తున్న కొద్దీ సోషల్ మీడియాలో వచ్చే విమర్శల వెనుక ఎలాంటి లాజిక్ లేదని గ్రహించానని తెలిపారు. ఎప్పుడూ మంచి సినిమాలు చేయాలని.. విభిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను అలరించాలనే నిజాయితీతోనే పనిచేస్తానని.. అయినా కొంత నెగెటివిటీ ఎదురుకావడం సహజమని అభిప్రాయపడ్డారు.

అయితే ఆ విమర్శలను తానెప్పుడు ఓ రుగ్మతలా మనసులో కసితో ఉంచుకోనని వాటినే పాజిటివ్ ఎనర్జీగా మలుచుకుంటానని దుల్కర్ తెలిపారు. `ఒకవేళ నేను ఏదైనా చేయలేనని కొందరు భావిస్తే ఆ సవాల్‌ను స్వీకరించి చేసి చూపించాలని నాకు అనిపిస్తుంది. నా సినిమా ఎంపికలు కూడా చాలా వరకు ఈ ఆలోచనల ద్వారానే ప్రభావిత మవుతుంటాయి. నన్ను భయపెట్టే లేదా ఒక నటుడిగా సవాల్ విసిరే పాత్రల వైపే ఎక్కువగా అడుగులు వేస్తాను. ఆ విమర్శలే నా ఎదుగుదలకు తోడ్పడుతున్నాయి` అన్నారు.

ప్రారంభంలో ఇలాంటి ప్రతికూల వ్యాఖ్యలు బాధించేవని.. కానీ తోటి నటుల అనుభవాలను గమనించిన తర్వాత ఇండస్ట్రీలో ఇవన్నీ సహజమేనని అర్థం చేసుకున్నానని దుల్కర్ అన్నారు. ప్రస్తుతం ఏమాత్రం అనవసరమైన ఆందోళనలు పెట్టుకోకుండా నటనపైనే పూర్తి దృష్టి పెట్టానని తెలిపారు. ప్రేక్షకులను కొత్తదనంతో అలరించడమే తన లక్ష్యమని.. విమర్శలను అనుకూలంగా మార్చుకోవడమే అసలైన విజయమన్నారు.

ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం దుల్కర్ సల్మాన్ న‌టించిన `ఆకాశంలో ఒక తార` విడుదలకు సిద్ధమవుతుంది. అలాగే `శ్రీ శ్రీ` అనే మ‌రో చిత్రంలోనూ న‌టిస్తున్నారు. ప్ర‌స్తుతం మాలీవుడ్ సినిమాలు త‌గ్గించి టాలీవుడ్..కోలీవుడ్ చిత్రాల‌పైనే దృష్టి పెట్టారు. ఇప్ప‌టికే ఈ రెండు భాష‌ల‌పై మంచి ప‌ట్టు సాధించారు. అయితే న‌టుడిగా మ‌రిన్ని ప్ర‌యోగాలు అవ‌స‌ర‌మ‌ని భావించి ఆ దిశ‌గా ముందు కెళ్తున్నారు.