ఇది నిజంగా ఓటీటీ గ్యాంబ్లింగ్? స్టార్‌పవర్ లేకపోతే అంతేగా!
సూపర్ హీరో జానర్‌లో తెరకెక్కిన మలయాళ చిత్రం `లోకా చాప్టర్-1: చంద్ర` గ్రాండ్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. కళ్యాణి ప్రియదర్శన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారి.
By: Sivaji Kontham | 3 Dec 2025 8:45 AM ISTసూపర్ హీరో జానర్‌లో తెరకెక్కిన మలయాళ చిత్రం `లోకా చాప్టర్-1: చంద్ర` గ్రాండ్ సక్సెస్ సాధించిన సంగతి తెలిసిందే. కళ్యాణి ప్రియదర్శన్ ఈ చిత్రంలో ప్రధాన పాత్రధారి. ఈ చిత్రాన్ని దుల్కర్ సల్మాన్ నిర్మించారు. అయితే దుల్కర్ నిర్మాత అయినా కానీ, ఓటీటీ హక్కులు కొనుగోలు చేసేందుకు ఎవరూ ముందుకు రాకపోవడం ఆశ్చర్యపరిచింది. ఇటీవలి ఇంటర్వ్యూలో దుల్కర్ స్వయంగా దీనిని ధృవీకరించాడు. మేం బడ్జెట్ పరిమితులు దాటిపోయాము. రెండింతలకు మించిపోయాము.. ఎవరూ సినిమాను కొనడానికి ఇష్టపడలేదు. టోవినో, నేను అక్కడ ఉన్నాము.. కానీ మీరు కొన్ని నిమిషాలు మాత్రమే కనిపిస్తారు! అని ఓటీటీలు వ్యాఖ్యానించినట్టు దుల్కర్ చెప్పారు.
పెద్ద తారల స్క్రీన్ సమయం కూడా ఓటీటీ ఒప్పందాలను ఖరారు చేస్తుందని దుల్కర్ తెలిపాడు. పెద్ద తారలు ఎక్కువ స్క్రీన్ సమయం కలిగి ఉంటే ఓటీటీలు ఎక్కువ చెల్లిస్తాయని కూడా దుల్కర్ ధృవీకరించాడు. అయితే `లోకా చాప్టర్ 1: చంద్ర` బాక్సాఫీస్ వద్ద ఒక బిగ్ సర్ ప్రైజ్. పెద్ద స్టార్లు ఎవరూ లేకుండానే ఈ సినిమా ఘనవిజయం సాధించింది. పాపులర్ తారలు లేకుండానే మలయాళంలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డులకెక్కింది. ఇందులో ప్రధాన పాత్రలో నటించిన కళ్యాణి ప్రియదర్శన్ కి మంచి పేరొచ్చింది. డొమినిక్ అరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కళ్యాణి ప్రియదర్శన్-నస్లెన్ ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ చిత్రం జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కి రావడానికి ముందు 2 నెలలకు పైగా థియేటర్లలో స్థిరంగా ప్రదర్శితమైంది. భారీ మొత్తానికి ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను విక్రయించగా.. ఓవరాల్ గా మాలీవుడ్ లోనే బెస్ట్ ధర పలికిందని కూడా కథనాలొచ్చాయి. అసలు వద్దు అనుకున్న సినిమాని ఓటీటీలు నెత్తిన పెట్టి మరీ కొనుక్కున్నాయి.
ప్రస్తుతం మేకర్స్ రెండవ అధ్యాయంపై పని ప్రారంభించారు. ఇందులో టోవినో పాత్ర చాతన్ చుట్టూ కథాంశం కేంద్రీకృతమై ఉంటుంది. దుల్కర్ సల్మాన్ సహా మరికొందరు పెద్ద స్టార్లు నటించేందుకు అవకాశం ఉందని కథనాలొస్తున్నాయి. ఈసారి స్టార్ పవర్ ని పెంచడం ద్వారా పాన్ ఇండియాలో సత్తా చాటాలని దుల్కర్ పట్టుదలగా ఉన్నట్టు తెలుస్తోంది.
