కాంత నా డ్రీమ్ ప్రాజెక్ట్.. ఈ సినిమా తర్వాత దుల్కర్‌ను అలా పిలుస్తారు: రానా
మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి వరుస హిట్‌లతో తెలుగులో దుల్కర్ సల్మాన్ తనకంటూ భారీ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నారు.
By: M Prashanth | 6 Nov 2025 8:17 PM ISTమహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ వంటి వరుస హిట్‌లతో తెలుగులో దుల్కర్ సల్మాన్ తనకంటూ భారీ మార్కెట్‌ను క్రియేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఆయన నటిస్తున్న మరో ప్రతిష్టాత్మక చిత్రం ‘కాంత’. పాతతరం సినిమా ఇండస్ట్రీ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడిక్ థ్రిల్లర్ డ్రామాగా ఈ సినిమా రాబోతోంది. తాజాగా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ ట్రైలర్‌కు అన్ని వర్గాల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.
ఈ ఈవెంట్‌లో సినిమా నిర్మాతల్లో ఒకరైన రానా దగ్గుబాటి, హీరో దుల్కర్ సల్మాన్ పాల్గొన్నారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్‌పై వారు ఎంతో కాన్ఫిడెంట్ గా ఉన్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఈ సినిమాను నిర్మించడం తనకెంతో గర్వంగా ఉందని రానా పేర్కొన్నారు. ఇది తనకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని, ఈ సినిమాలో భాగం కావడం సంతోషంగా ఉందని తెలిపారు. ఈ ఈవెంట్‌లో రానా చేసిన వ్యాఖ్యలు సినిమాపై అంచనాలను మరింత పెంచేశాయి.
రానా మాట్లాడుతూ.. "ఈ సినిమా విడుదలయ్యాక దుల్కర్ సల్మాన్‌ను అందరూ 'నట చక్రవర్తి' అని పిలుస్తారు" అని అన్నారు. దుల్కర్ నటన అద్భుతంగా ఉందని ఆయన ప్రశంసించారు. ‘కాంత’ వంటి సినిమాను నిర్మించినందుకు గర్వపడుతున్నానని, ఇది తమ అందరి కెరీర్‌లో ఒక గొప్ప మూవీగా నిలిచిపోతుందని ధీమా వ్యక్తం చేశారు. రానాతో పాటు దుల్కర్ సల్మాన్ కూడా ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం.
హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గురించి కూడా రానా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆడిషన్ సమయంలో ఆమెపై తనకు కొన్ని సందేహాలు ఉన్నాయని, కానీ తన నటనతో వాటన్నింటినీ పటాపంచలు చేసిందని అన్నారు. ఈ సినిమాలో రానా కూడా ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు. ‘కాంత’ నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.
దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ.. ‘కాంత’ లాంటి గొప్ప చిత్రంలో నటించడం, నిర్మించడం గర్వంగా ఉందన్నారు. ఈ సినిమా గురించి భవిష్యత్తులో అందరూ గొప్పగా మాట్లాడుకుంటారని, ఇది తమ కెరీర్‌లో ప్రత్యేకంగా నిలిచిపోతుందని అన్నారు. హైదరాబాద్ క్రౌడ్ ఎనర్జీ అంటే తనకు చాలా ఇష్టమని, ప్రేక్షకులందరూ థియేటర్లలో సినిమా చూడాలని కోరారు.
ఇక భారీ అంచనాల మధ్య ‘కాంత’ నవంబర్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. మరి సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో చూడాలి.
