60ల నాటి కథ.. దుల్కర్ 'కాంత' వచ్చేది అప్పుడే!
1960ల నాటి సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక మాయా ప్రపంచం. ఆనాటి స్టార్ల జీవితాలు ఎంతో ఆసక్తికరంగా, నాటకీయంగా ఉండేవి. ఇప్పుడు సరిగ్గా అలాంటి ఒక కథతోనే దుల్కర్ మనల్ని ఆ కాలానికి తీసుకెళ్లబోతున్నాడు.
By: M Prashanth | 20 Oct 2025 1:24 PM ISTలవర్ బాయ్, యాక్షన్ హీరో, మాస్ క్యారెక్టర్.. ఇలా ఏ పాత్ర ఇచ్చినా అందులో ఒదిగిపోవడం పాన్ ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్‌కు అలవాటు. ప్రతీ సినిమాకు తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటూ, ప్రేక్షకులకు ఎప్పుడూ ఫ్రెష్ ఫీలింగ్‌ను ఇస్తాడు. ఇప్పుడు మరోసారి తనలోని నటుడికి పూర్తిస్థాయిలో పనిచెప్పే ఒక ఛాలెంజింగ్ రోల్‌తో మన ముందుకు రాబోతున్నాడు.
సినిమా ప్రపంచం బయటకు కనిపించేంత గ్లామర్‌గా ఉండదు. తెర వెనుక ఎన్నో రాజకీయాలు, అహంకారాలు, కుట్రలు దాగి ఉంటాయి. ముఖ్యంగా, 1960ల నాటి సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక మాయా ప్రపంచం. ఆనాటి స్టార్ల జీవితాలు ఎంతో ఆసక్తికరంగా, నాటకీయంగా ఉండేవి. ఇప్పుడు సరిగ్గా అలాంటి ఒక కథతోనే దుల్కర్ మనల్ని ఆ కాలానికి తీసుకెళ్లబోతున్నాడు.
ఆ చీకటి కోణాన్ని, ఆనాటి ఒక సూపర్ స్టార్ జీవితాన్ని మన కళ్లకు కట్టేందుకు దుల్కర్ సిద్ధమయ్యాడు. ఆయన నటిస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ చిత్రం 'కాంత'. ఈ సినిమా విడుదల తేదీని మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఈ దీపావళి కానుకగా, నవంబర్ 14న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఈ ప్రకటనతో ఫ్యాన్స్‌లో ఒక్కసారిగా కొత్త ఉత్సాహం నెలకొంది.
ఈ సినిమాలో దుల్కర్ 1960ల నాటి ఒక పెద్ద స్టార్ పాత్రలో కనిపించబోతున్నాడు. కేవలం అతని ఎదుగుదలను మాత్రమే కాకుండా, స్టార్‌డమ్ తెచ్చిపెట్టే అహంకారం, తోటి నటులతో ఉండే పోటీ, తెర వెనుక జరిగే రాజకీయాలను ఈ సినిమాలో దర్శకుడు కళ్లకు కట్టినట్లు చూపించబోతున్నాడట. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌లో దుల్కర్ మేకోవర్, అతని ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.
ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తుండగా, ఇద్దరు పాన్ ఇండియా యాక్టర్లు నిర్మాతలుగా మారడం విశేషం. దుల్కర్ సల్మాన్ స్వయంగా ఈ చిత్ర నిర్మాణంలో భాగస్వామి కాగా, మన రానా దగ్గుబాటి కూడా ఈ ప్రాజెక్ట్‌కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇద్దరు యాక్టర్లు కలిసి ఒక కంటెంట్ బేస్డ్ సినిమాను నిర్మిస్తుండటంతో, ప్రాజెక్ట్‌పై మరింత నమ్మకం పెరుగుతోంది.
ఇది రెగ్యులర్ కమర్షియల్ ఫార్మాట్‌లో సాగే సినిమా కాదని, ప్రేక్షకులకు ఒక కొత్త, సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇస్తుందని చిత్రయూనిట్ నమ్మకంగా చెబుతోంది. సినిమాపై ఉన్న ప్రేమను మరింత పెంచేలా ఈ చిత్రం ఉంటుందని వారు హామీ ఇస్తున్నారు. మరి 60ల నాటి ఈ స్టార్ కథ ఎంతలా ఆకట్టుకుంటుందో తెలియాలంటే నవంబర్ 14 వరకు ఆగాల్సిందే.
