'కాంత' ఫస్ట్ డే కలెక్షన్స్.. దుల్కర్ మార్కెట్‌కు ఇది ప్లస్సా?
అందరి అంచనాల మధ్య, 'కాంత' చిత్ర బృందం తమ సినిమా మొదటి రోజు వసూళ్ల వివరాలను అధికారికంగా ప్రకటించింది.
By: M Prashanth | 15 Nov 2025 12:50 PM ISTదుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో, రానా దగ్గుబాటి సమర్పణలో వచ్చిన పీరియడ్ డ్రామా 'కాంత'. 1950ల నాటి సినీ పరిశ్రమ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాపై మొదటి నుంచి ఒక ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. 'సీతారామం' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత దుల్కర్ నుంచి వస్తున్న సినిమా కావడం, దానికి తోడు రిలీజ్‌కు ముందు కొన్ని వివాదాలు చుట్టుముట్టడంతో 'కాంత' వార్తల్లో నిలిచింది.
నిన్న (నవంబర్ 14) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా, ఊహించని టాక్‌తో ప్రయాణం మొదలుపెట్టింది. ఇది రెగ్యులర్ మసాలా సినిమా కాదని, పూర్తిగా నటనకు, కథనానికి ప్రాధాన్యత ఉన్న సినిమా అని ట్రైలర్‌తోనే స్పష్టమైంది. ఇలాంటి సీరియస్, కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలా పెర్ఫార్మ్ చేస్తాయనేది ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది.
అందరి అంచనాల మధ్య, 'కాంత' చిత్ర బృందం తమ సినిమా మొదటి రోజు వసూళ్ల వివరాలను అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా 10.5 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్లు వెల్లడించారు. ఈ మేరకు మేకర్స్ కొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.
దుల్కర్ సల్మాన్ ప్రస్తుత మార్కెట్‌ను, సినిమా జానర్‌ను బట్టి చూస్తే, ఇది ఒక డీసెంట్ ఓపెనింగ్ అనే చెప్పాలి. 'కాంత' ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్ కాదు, కాబట్టి ఇది బెస్ట్ స్టార్ట్ అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా కేరళ, తమిళనాడుతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కూడా దుల్కర్‌కు ఉన్న క్రేజ్ ఈ వసూళ్లకు హెల్ప్ అయింది.
రిలీజ్‌కు ముందు ఎదురైన న్యాయపరమైన చిక్కులను దాటుకుని థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమాకు, తొలి రోజు వచ్చిన రెస్పాన్స్ ఫర్వాలేదనే చెప్పాలి. అయితే, ఇలాంటి సినిమాలకు అసలైన పరీక్ష వీకెండ్‌లో ఉంటుంది. తొలి రోజు వసూళ్లు ఎలా ఉన్నా, సినిమా భవిష్యత్తు మొత్తం మౌత్ టాక్‌పైనే ఆధారపడి ఉంటుంది.
శని, ఆదివారాల్లో ఫ్యామిలీ ఆడియన్స్ నుంచి ఆదరణ లభిస్తేనే 'కాంత' బాక్సాఫీస్ వద్ద నిలదొక్కుకోగలుగుతుంది. ప్రస్తుతం వచ్చిన టాక్‌తో ఈ వీకెండ్ వసూళ్లు ఎంతవరకు వెళ్తాయో చూడాలి.
