'ఆకాశంలో ఒక తార' ట్రైలర్: అమ్మాయి స్పేస్ డ్రీమ్ వెనుక దుల్కర్!
దుల్కర్ సల్మాన్, సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రల్లో పవన్ సాధినేని తెరకెక్కించిన ‘ఆకాశంలో ఒక తార’ ట్రైలర్ విడుదలైంది. ఆస్ట్రోనాట్ కావాలని కలలు కనే పల్లెటూరి అమ్మాయికి అండగా నిలిచే యువకుడిగా దుల్కర్ కనిపించారు. శ్రుతి హాసన్ స్పేస్ సైంటిస్ట్‌గా, రుహాని శర్మ కీలక పాత్రలో మెరిశారు. ఈ సినిమా నవంబర్ 20న నాలుగు భాషల్లో విడుదల కానుంది.
By: M Prashanth | 16 Nov 2026 1:29 PM ISTతెలుగులో ఎప్పుడూ డిఫరెంట్ కథలను ఎంచుకునే దుల్కర్ సల్మాన్, మరోసారి ఒక ఫ్రెష్ కాన్సెప్ట్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. పవన్ సాధినేని దర్శకత్వంలో నటించిన లేటెస్ట్ మూవీ 'ఆకాశంలో ఒక తార'. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా సమర్పణలో సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మించిన ఈ సినిమా ట్రైలర్ రిలీజైంది. కమర్షియల్ హంగుల జోలికి వెళ్లకుండా, ఒక ఎమోషనల్ డ్రామాను తెరపైకి తెస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.
అబ్దుల్ కలాం కొటేషన్ తో మొదలైన ట్రైలర్, గోదావరి పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో సాగే ఒక సింపుల్ కథను పరిచయం చేసింది. ఇందులో కల్పన పాత్రలో సాత్విక వీరవల్లి కనిపిస్తున్నారు. ఇంగ్లీష్ కూడా సరిగ్గా రాని ఒక సాధారణ అమ్మాయి, ఆస్ట్రోనాట్ అయి స్పేస్ లోకి వెళ్లాలని పెద్ద కల కంటుంది. చుట్టుపక్కల వాళ్లంతా ఆమె ఆశను చూసి నవ్వుతున్నా, కృష్ణ పాత్రలో దుల్కర్ సల్మాన్ ఆమెకు సపోర్ట్ గా నిలుస్తారు. తన కల కోసం తానే కాలిలా మారి నడిపించాలనుకునే పల్లెటూరి కుర్రాడిగా దుల్కర్ లుక్, బాడీ లాంగ్వేజ్ నేచురల్ గా ఉన్నాయి.
ట్రైలర్ లో డైలాగ్స్ కంటెంట్ కు తగ్గట్లు సింపుల్ గా, ఎమోషనల్ గా కుదిరాయి. "పది మంది నవ్వితే ఏంటి.. ఒక్కళ్లు నమ్మితే చాలదా కృష్ణ గారూ" అని హీరోయిన్ చెప్పే డైలాగ్ తో పాటు, చివర్లో కారులో దుల్కర్ ఎమోషనల్ అవుతూ "రేపు నువ్వు నన్ను వదిలి వేల కిలోమీటర్లు వెళ్తావ్.. అలవాటు చేసుకో" అని చెప్పే సీన్ టచ్ చేసేలా ఉంది. గ్రామీణ వాతావరణం నుంచి డీఆర్డీవో, ప్రైవేట్ స్పేస్ మిషన్ వరకు కథ మారే తీరును నీట్ గా కట్ చేశారు.
ఈ ట్రైలర్ లో శ్రుతి హాసన్ రోల్ సర్ ప్రైజ్ ట్విస్ట్ లా కనిపిస్తోంది. రాకెట్ ప్రయోగాలు చేసే ఒక బోల్డ్ స్పేస్ సైంటిస్ట్ గా, సిగరెట్ తాగుతూ కాస్త రఫ్ యాటిట్యూడ్ ఉన్న 'రోహిణి' పాత్రలో శ్రుతి కొత్తగా కనిపించారు. కల్పన టాలెంట్ ను గుర్తించి తన టీమ్ లోకి తీసుకునే కీలక పాత్రలో ఆమె నటించారు. ఇక ట్రైలర్ ఎండింగ్ లో రుహాని శర్మ ఎంట్రీ ప్లెజెంట్ గా ఉంది. "ఆప్ దోనో కా కహానీ బహుత్ ప్యారా హై" అంటూ ఆమె చెప్పిన డైలాగ్ తో ట్రైలర్ ను కూల్ గా ముగించారు.
టెక్నికల్ వర్క్ కూడా సినిమాకు బాగానే సెట్ అయినట్లు కనిపిస్తోంది. సుజిత్ సారంగ్ కెమెరా వర్క్ ఒకవైపు గోదావరి విలేజ్ విజువల్స్ ను, మరోవైపు స్పేస్ సెటప్ ను రిచ్ గా చూపించింది. జీవీ ప్రకాష్ కుమార్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాల్లోని ఎమోషన్ ను బాగా క్యారీ చేసింది. గుణ్ణం గంగరాజు రైటింగ్, ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ సినిమాకు ప్లస్ అయ్యేలా ఉన్నాయి.
రొటీన్ ఫార్ములా సినిమాలకు భిన్నంగా ఒక ఇన్స్పైరింగ్ డ్రామాగా 'ఆకాశంలో ఒక తార' రూపొందినట్లు ట్రైలర్ క్లారిటీ ఇస్తోంది. ఎక్కడా ఓవర్ డ్రామా లేకుండా, కంటెంట్ మీద నమ్మకంతో తీసిన సినిమా లాగా అనిపిస్తోంది. తెలుగుతో పాటు తమిళ, మలయాళ, హిందీ భాషల్లో నవంబర్ 20న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. మరి ఈ పల్లెటూరి అమ్మాయి స్పేస్ జర్నీ ఆడియన్స్ కు ఏ రేంజ్ లో కనెక్ట్ అవుతుందో చూడాలి.
