రానా, దుల్కర్.. ఆ ఫోటోల వెనుక ఇంత కథ ఉందా?
దుల్కర్ సల్మాన్ తన సోషల్ మీడియా ఖాతాలో రానా దగ్గుబాటి, సముద్రఖనితో కలిసి ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలను షేర్ చేశారు.
By: M Prashanth | 25 Nov 2025 2:10 PM ISTసినిమా ఇండస్ట్రీలో మల్టీస్టారర్ సినిమాలు రావడం కామన్. కానీ తెరమీద నటించిన స్టార్స్, తెర వెనుక కూడా మంచి ఫ్రెండ్స్ అవ్వడం చాలా అరుదుగా చూస్తుంటాం. షూటింగ్ అయిపోయాక ఎవరి దారి వాళ్ళు చూసుకుంటారు. కానీ కొందరు మాత్రం ఆ ప్రయాణాన్ని, ఆ జ్ఞాపకాలను ఎప్పటికీ మర్చిపోలేరు. లేటెస్ట్ గా పాన్ ఇండియా స్టార్ దుల్కర్ సల్మాన్ చేసిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ ఫోటోల్లో ఉన్న బాండింగ్ చూసి ఫ్యాన్స్ మురిసిపోతున్నారు.
మలయాళ స్టార్ హీరో అయినప్పటికీ, మన తెలుగు ప్రేక్షకులకు కూడా అభిమాన నటుడిగా మారిపోయాడు దుల్కర్. ఇక టాలీవుడ్ హంక్ రానా దగ్గుబాటితో అతనికి మంచి స్నేహం ఉందన్న విషయం తెలిసిందే. వీరిద్దరూ కలిసి నటించిన 'కాంత' సినిమా షూటింగ్ సమయంలో వీరి మధ్య సాన్నిహిత్యం మరింత బలపడింది. సినిమా షూటింగ్ పూర్తయి, విడుదలైన తర్వాత కూడా ఆ రోజులను తలచుకుంటూ దుల్కర్ ఎమోషనల్ అయ్యారు.
దుల్కర్ సల్మాన్ తన సోషల్ మీడియా ఖాతాలో రానా దగ్గుబాటి, సముద్రఖనితో కలిసి ఉన్న కొన్ని బ్యూటిఫుల్ ఫోటోలను షేర్ చేశారు. "మిస్సింగ్ దీస్ ఫైన్ జెంట్స్" అంటూ క్యాప్షన్ పెట్టి, ఆ షూటింగ్ రోజులను గుర్తు చేసుకున్నారు. ఒక ఫోటోలో ముగ్గురూ ప్రైవేట్ జెట్ ముందు స్టైలిష్ గా నిల్చొని ఉండగా, మరో ఫోటోలో బస్ లో ప్రయాణిస్తూ సరదాగా నవ్వుకుంటూ కనిపిస్తున్నారు.
ఈ ఫోటోల్లో వారి ముఖాల్లోని చిరునవ్వు చూస్తుంటే, షూటింగ్ సెట్స్ లో వారు ఎంత ఎంజాయ్ చేశారో అర్థమవుతోంది. కేవలం పనిలా కాకుండా, ఒక పిక్నిక్ లాగా ఆ సమయాన్ని గడిపినట్లు వారి బాడీ లాంగ్వేజ్ చెబుతోంది. రానా ఈ సినిమాను నిర్మిస్తూనే, ఇందులో కీలక పాత్ర పోషించారు. సముద్రఖని, దుల్కర్ తో కలిసి రానా ట్రావెల్ చేసిన ఈ జర్నీ ఎంతో స్పెషల్ అని ఈ ఫోటోలు చెబుతున్నాయి.
ముగ్గురూ క్యాజువల్ వేర్ లో, కూలింగ్ గ్లాసెస్ తో ఫుల్ చిల్ మోడ్ లో కనిపించడం ఫ్యాన్స్ కు బాగా నచ్చింది. ఆన్ స్క్రీన్ మీద ఎంత సీరియస్ గా నటించినా, ఆఫ్ స్క్రీన్ లో మాత్రం మంచి ఫ్రెండ్స్ గా మారిపోయారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇక రానున్న రోజుల్లో వీరు మళ్లీ కలిసి పనిచేస్తారో లేదో చూడాలి.
