Begin typing your search above and press return to search.

టాలీవుడ్ వెర్సస్ కోలీవుడ్.. పైచేయి ఎవరిదో?

ఈ దీపావళికి మిత్రమండలి, తెలుసు కదా, కే ర్యాంప్.. ఇలా మూడు తెలుగు చిత్రాలు రేసులో నిలిచాయి. వీటికి పోటీగా ‘డ్యూడ్’ కూడా పోటీకి సై అంది.

By:  Garuda Media   |   17 Oct 2025 9:00 AM IST
టాలీవుడ్ వెర్సస్ కోలీవుడ్.. పైచేయి ఎవరిదో?
X

సాధారణంగా పండుగ సీజన్లలో తెలుగు చిత్రాలతో పాటు అనువాద సినిమాలు రిలీజైనా.. వాటికి పెద్దగా ఆదరణ ఉండదు. కానీ కొన్నిసార్లు మాత్రం అనువాదాలు కూడా మంచి ఫలితాలు రాబడుతుంటాయి. గత ఏడాది క, లక్కీ భాస్కర్ చిత్రాలతో పోటీ పడి తమిళ అనువాదం ‘అమరన్’ తెలుగులో మంచి ఫలితాన్నందుకుంది. ఈసారి కూడా ఓ క్రేజీ తమిళ మూవీ టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో నిలిచింది. అదే.. డ్యూడ్.

ఈ దీపావళికి మిత్రమండలి, తెలుసు కదా, కే ర్యాంప్.. ఇలా మూడు తెలుగు చిత్రాలు రేసులో నిలిచాయి. వీటికి పోటీగా ‘డ్యూడ్’ కూడా పోటీకి సై అంది. ఆశ్చర్యకరంగా తెలుగు చిత్రాలకు దీటుగా, ఇంకా చెప్పాలంటే వాటిని మించి ‘డ్యూడ్’ తెలుగులో క్రేజ్ సంపాదించింది. ఇదంతా ప్రదీప్ రంగనాథన్ చలవ అనే చెప్పాలి. తన కోసం మన యూత్ ఎగబడుతున్నారు.

మూడు తెలుగు చిత్రాల్లో ఒకటైన ‘మిత్రమండలి’ ఆల్రెడీ రిలీజైంది. దానికి ఆశించిన టాక్ రాలేదు. రేసులో చివరి చిత్రమైన ‘కే ర్యాంప్’ శనివారం రిలీజ కానుంది. శుక్రవారం ‘డ్యూడ్’తో నేరుగా ‘తెలుసు కదా’ మూవీ ఢీకొట్టబోతోంది. సిద్ధు జొన్నలగడ్డకు యూత్‌లో మంచి క్రేజే ఉన్నా.. ‘టిల్లు స్క్వేర్’ తరహాలో ‘తెలుసు కదా’కు హైప్ క్రియేట్ కాలేదు. కానీ కంటెంట్ మీద టీం చాలా నమ్మకంతో ఉంది.

శుక్రవారం ఉదయం షోలకు ‘తెలుసు కదా’ కంటే ‘డ్యూడ్’కే ఎక్కువ జనం కనిపిస్తే ఆశ్చర్యమేమీ లేదు. కానీ అంతిమ ఫలితం ఏంటన్నది ఆయా చిత్రాలకు వచ్చే టాక్‌ను బట్టే నిర్ణయం అవుతుంది. సినిమాకు మంచి టాక్ వస్తే సిద్ధు పుల్ వేరుగా ఉంటుందని భావిస్తున్నారు. రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టిల రూపంలో అడిషనల్ గ్లామర్ ఎట్రాక్షన్ కూడా ఉంది ‘తెలుసు కదా’కు. అలా అని ‘డ్యూడ్’ను తక్కువ అంచనా వేయలేం. దానికి పాజిటిట్ టాక్ వస్తే.. యూత్ మరోసారి ప్రదీప్ కోసం ఎగబడ్డం ఖాయం. మరి టాలీవుడ్ వెర్సస్ కోలీవుడ్ పోరులో శుక్రవారం పైచేయి ఎవరిదో చూడాలి.