Begin typing your search above and press return to search.

యూట్యూబర్స్‌ పై అప్పుడు ఇలా.. ఇప్పుడు నయన్ ఇలా..

కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార, విఘ్నేష్ శివన్ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు.

By:  M Prashanth   |   23 Jan 2026 6:00 PM IST
యూట్యూబర్స్‌ పై అప్పుడు ఇలా.. ఇప్పుడు నయన్ ఇలా..
X

కోలీవుడ్ స్టార్ కపుల్ నయనతార, విఘ్నేష్ శివన్ మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారారు. దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌ లో ముగ్గురు ప్రముఖ యూట్యూబర్లతో కలిసి వారిద్దరూ దిగిన ఫోటో ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతూ, పెద్ద ఎత్తున ట్రోలింగ్‌ కు దారితీసింది. ఆ ఫోటోతో పాటు గతంలో నయనతార చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తూ నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

కొన్ని నెలల క్రితం ఓ ఇంటర్వ్యూలో నయనతార, తనపై నెగిటివ్ ప్రచారం చేస్తున్న యూట్యూబ్ ఛానళ్లను తీవ్రంగా తప్పుబట్టారు. ముఖ్యంగా ఓ యూట్యూబ్ ఛానల్ తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆ సందర్భంలో ముగ్గురు వ్యక్తులను ఏకంగా మూడు కోతులు అంటూ వ్యాఖ్యానించడం అప్పట్లో సంచలనంగా మారింది. ఆ సమయంలో ఆమె ఎవరి పేర్లు ప్రస్తావించలేదు.

కానీ చాలా మంది మాత్రం ఆమె వలైపేచు టీమ్‌ ను ఉద్దేశించి మాట్లాడారని భావించారు. ఆ వ్యాఖ్యలతో అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇప్పుడు తాజాగా నయనతార, విఘ్నేష్ శివన్‌ లు వలైపేచు యూట్యూబర్లను దుబాయ్ ఎయిర్‌ పోర్ట్‌ లో కలిశారు. ఆ తర్వాత దిగిన ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్‌ గా మారింది. ఆ యూట్యూబర్లు నయన్ జంటతో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో క్షణాల్లో వైరల్ అయింది.

దీంతో నెటిజన్లు నయనతార కామెంట్స్ చేస్తూ గుర్తు చేస్తూ క్వశ్చన్ చేస్తున్నారు. బహిరంగంగా విమర్శలు చేస్తూ, వ్యక్తిగతంగా మాత్రం స్నేహంగా ఉండటం ఏమిటని నయన్ ను ప్రశ్నిస్తున్నారు. అందరి ముందు ఒక మాట, లోపల ఇంకో మాట అనేలా పరిస్థితి ఉందని కొందరు ఆరోపణలు చేస్తున్నారు. మరికొందరు ఇది కేవలం పబ్లిసిటీ కోసమే చేసిన స్టంట్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే కొందరు నెటిజన్లు హద్దులు దాటి ట్రోలింగ్‌ కు దిగారు. ఫోటోపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తూ నయనతారతో పాటు విఘ్నేష్ శివన్‌ ను కూడా తీవ్రంగా విమర్శించారు. దీంతో ఈ వ్యవహారం మరింత వివాదాస్పదంగా మారింది. ఇదిలా ఉండగా మరికొందరు మాత్రం.. ఇప్పటికైనా వారి మధ్య విభేదాలు సద్దుమణిగాయేమోనని కామెంట్లు పెడుతున్నారు.

ఇకపై వలైపేచు నుంచి నయనతారపై నెగిటివ్ వీడియోలు రావు అంటూ కొందరు సరదాగా కామెంట్లు చేస్తున్నారు. ఇద్దరూ వ్యక్తిగతంగా మాట్లాడుకుని సమస్యను పరిష్కరించుకున్నారని పలువురు అంచనా వేస్తున్నారు. మొత్తానికి, నయనతార- విఘ్నేష్ శివన్‌ లు వలైపేచు యూట్యూబర్లతో దిగిన ఒక్క ఫోటో సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. దీంతో ఆ విషయంపై మళ్లీ నయన్, విఘ్నేష్ ఏమైనా రెస్పాండ్ అవుతారేమో వేచి చూడాలి.