హీరోకి ఎక్కువ పని పెట్టేస్తున్నారా?
డబుల్ రోల్ తెలుగు, తమిళ సినిమాలకు కొత్తేమీ కాదు. ఒకప్పుడు తండ్రి కొడుకు, అన్నదమ్ములు, ఒకేలా కనిపించే ఇద్దరు అనే కథల్లో ఎక్కువగా వాడేవారు.
By: M Prashanth | 23 Aug 2026 8:30 AM ISTడబుల్ రోల్ తెలుగు, తమిళ సినిమాలకు కొత్తేమీ కాదు. ఒకప్పుడు తండ్రి కొడుకు, అన్నదమ్ములు, ఒకేలా కనిపించే ఇద్దరు అనే కథల్లో ఎక్కువగా వాడేవారు. ఇప్పుడు మాత్రం లెక్క కాస్త మారింది. ఒకే హీరోను రెండు టైమ్‌లైన్స్‌లో, రెండు వేర్వేరు లుక్స్‌లో, కొన్నిసార్లు సీక్రెట్ క్యారెక్టర్‌గా చూపించే ప్రయత్నాలు పెరుగుతున్నాయి.
ఇప్పుడు వస్తున్న పెద్ద సినిమాలు చూస్తే అదే కనిపిస్తోంది. మహేష్ బాబు ‘వారణాసి’లో రుద్రతో పాటు శ్రీరాముడి రూపంలో కూడా కనిపించనున్నాడు. యష్ ‘టాక్సిక్’లో రెండు కంటే ఎక్కువ అవతారాల్లో కనిపిస్తారనీ తెలుస్తోంది. ప్రభాస్ చేస్తున్న కొన్ని సినిమాల్లో కూడా రెండు షేడ్స్, సీక్రెట్ క్యారెక్టర్‌ల గురించి వార్తలు వస్తున్నాయి. ఇవన్నీ ఒకే రకమైన పాత్రలు కాకపోయినా, స్టార్‌ను ఒక్క రూపంలోనే చూపించకుండా ఎక్కువగా వాడుకోవాలనే ప్రయత్నం కనిపిస్తోంది.
దీనికి ఒక సింపుల్ కారణం కూడా ఉండొచ్చు. ఇప్పుడు పెద్ద హీరో సినిమా అంటే బడ్జెట్ కూడా భారీగానే ఉంటుంది. ప్రేక్షకుడు టికెట్ కొట్టి వస్తే రెండు మూడు గంటల్లో తన హీరో నుంచి ఎక్కువ షేడ్స్ చూడాలని ఆశిస్తాడు. ఒకే పాత్రలో మొత్తం సినిమా నడపడం కంటే రెండో లుక్, మరో టైమ్‌లైన్ లేదా కొత్త షేడ్ ఉంటే అదే సినిమాకు ఇంకో హుక్ దొరుకుతుంది.
మరోవైపు ప్రమోషన్స్‌కి కూడా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఫస్ట్ లుక్‌లో ఒక రూపం చూపించి, ట్రైలర్‌లో మరో రూపం బయటపెట్టొచ్చు. ఇంకో క్యారెక్టర్‌ను సినిమా వరకు దాచిపెట్టొచ్చు. ఇలా ఒక్క హీరో నుంచే రెండు మూడు సర్‌ప్రైజులు తీసుకురావచ్చు. అందుకే డ్యూయల్ రోల్ పాత ఫార్ములా అయినా, ఇప్పుడు దాన్ని వాడే విధానం మాత్రం మారిపోయింది.
కానీ రెండు పాత్రలు పెట్టడం వల్లే సినిమా పెద్దది అయిపోదు. రెండింటికీ కథలో పని ఉండాలి. ఒకే హీరోను రెండు లుక్స్‌లో చూపించడమే కొత్తదనం అయితే అది ఎక్కువసేపు నిలబడదు. అందుకే ఇప్పుడు మేకర్స్ ముందు ఉన్న అసలు పని డబుల్ రోల్ పెట్టడం కాదు.. రెండో పాత్ర ఎందుకు ఉందో ప్రేక్షకుడికి నమ్మించడం.
పాన్ ఇండియా సినిమాల స్కేల్ పెరిగేకొద్దీ స్టార్‌ను కూడా మరింతగా వాడుకోవాలనే ఆలోచన పెరుగుతున్నట్టుంది. ఒకే హీరోతో రెండు అవతారాలు, రెండు లుక్స్, రెండు రకాల ఎలివేషన్స్ తీసుకురావడం ఇప్పుడు కొత్త ప్యాకేజీగా మారుతోంది. వచ్చే పెద్ద సినిమాల్లో ఈ ఫార్ములా నిజంగా కథకు ఎంత ఉపయోగపడుతుందో చూడాలి.
