ముగ్గురు వద్దకు వెళ్లిన కథ.. ఇప్పుడు హీరోగా DSP?
ఇప్పుడు ఆ టాపిక్‌ను మళ్లీ తెరపైకి తెచ్చారు 'బలగం' ఫేమ్ వేణు యెల్దండి. 'బలగం' లాంటి ఒక ఎమోషనల్ క్లాసిక్ తర్వాత, వేణు తన రెండో సినిమాపై చాలా కసరత్తు చేస్తున్నారు.
By: M Prashanth | 16 Oct 2025 10:22 PM ISTటాలీవుడ్‌లో ఎప్పుడు ఏ కాంబినేషన్ సెట్ అవుతుందో, ఏ ప్రాజెక్ట్ ఎవరి చేతికి వెళ్తుందో ఊహించడం కష్టం. తాజాగా, ఇండస్ట్రీలో ఒక మైండ్‌బ్లోయింగ్ ట్విస్ట్ చక్కర్లు కొడుతోంది. రాక్‌స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారనేది ఆ క్రేజీ న్యూస్. ఈ వార్త వినగానే అందరూ షాక్ అవుతున్నా, దీని వెనుక ఒక పెద్ద కథే నడుస్తోందని తెలుస్తోంది. ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కోసం దర్శక, నిర్మాతలు ఈ అనూహ్యమైన నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది.
నిజానికి DSPని హీరోగా పరిచయం చేయాలనే ప్రయత్నం గతంలోనే జరిగింది. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్, తన సొంత బ్యానర్‌లో డీఎస్పీని హీరోగా లాంచ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ, ఎందుకో ఆ ప్రాజెక్ట్ కార్యరూపం దాల్చలేదు. దాంతో డీఎస్పీ హీరో అవతారం చాప్టర్ క్లోజ్ అయిపోయిందనే అందరూ అనుకున్నారు. కానీ, అతనిలోని పెర్ఫార్మర్, అతనికున్న యూత్ ఫాలోయింగ్ చూసి, అతను హీరో మెటీరియల్ అని ఫీల్ అయ్యేవాళ్లు ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.
ఇప్పుడు ఆ టాపిక్‌ను మళ్లీ తెరపైకి తెచ్చారు 'బలగం' ఫేమ్ వేణు యెల్దండి. 'బలగం' లాంటి ఒక ఎమోషనల్ క్లాసిక్ తర్వాత, వేణు తన రెండో సినిమాపై చాలా కసరత్తు చేస్తున్నారు. ఆ చిత్రానికి టాలీవుడ్‌లోని బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్‌లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ ప్రాజెక్ట్‌కు 'ఎల్లమ్మ' అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను కూడా ఖరారు చేశారు.
కథ సిద్ధంగా ఉంది, నిర్మాత రెడీగా ఉన్నారు.. కానీ, నెలలు గడుస్తున్నా సినిమా మాత్రం సెట్స్‌పైకి వెళ్లలేదు. దానికి కారణం, ఈ కథకు సరైన హీరో దొరక్కపోవడమే. వేణు ఈ కథను ఎంతో ఇష్టపడి రాసుకున్నా, దాన్ని పండించగల నటుడి కోసం వేట కొనసాగుతూనే ఉంది. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. ఈ 'ఎల్లమ్మ' కథ మొదట నేచురల్ స్టార్ నాని దగ్గరకు, ఆ తర్వాత యంగ్ హీరో నితిన్ దగ్గరకు వెళ్లింది. వారిద్దరితో సెట్ కాకపోవడంతో, బెల్లంకొండ శ్రీనివాస్‌తో చర్చలు జరిపినట్లు కూడా వార్తలొచ్చాయి.
ఇలా ముగ్గురు హీరోల వద్దకు వెళ్లిన ఈ కథ, ఫైనల్‌గా ఇప్పుడు అనూహ్యంగా దేవిశ్రీ ప్రసాద్ వద్దకు చేరిందని ఇండస్ట్రీ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే, ఇది టాలీవుడ్‌లో ఒక బోల్డ్ ఎక్స్‌పెరిమెంట్ అవుతుంది. స్టార్ హీరోలు వద్దనుకున్న ఒక పవర్‌ఫుల్ కథకు, నటుడిగా ఒక మ్యూజిక్ డైరెక్టర్ ఎలా న్యాయం చేస్తాడు? 'బలగం' లాంటి ఎమోషన్స్‌ను పండించిన వేణు, డీఎస్పీలోని నటుడిని ఎలా బయటకు తీస్తాడు? అనేవి ఆసక్తికరంగా మారాయి. ఏది ఏమైనా, ఈ క్రేజీ రూమర్ మాత్రం 'ఎల్లమ్మ' సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. దీనిపై అధికారిక ప్రకటన వస్తే, ఆ కిక్కే వేరుగా ఉంటుంది.
